శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడంటే ఎవరు?

>> Friday, November 8, 2013


"మీ మందుల షాపు పేరేమిటి నాయనా?"  ..  వి.వి. సుబ్రహ్మణ్యం గారు ప్రశాంతంగా తన సంభాషణ ప్రారంభించారు.
"సత్యా మెడికల్ షాప్ (పేరు మార్చి రాశాను)" అని సాయిరాం బదులిచ్చాడు.  
"మీరమ్ముతున్నవన్నీ విషాలని నిరూపిస్తా.  దానికి నువ్వు మందుల దుకాణం అని పేరు పెట్టావంటా......
కావాలంటే ఎ సీసాలోవైనా గుప్పెడు మాత్రలు మింగి చూడు.  నీకే తెలుస్తుంది.  అవన్నీ విషాలైనప్పుడు సత్యా పాయిజన్ షాప్ అని పెట్టుకోవాలి కానీ, సత్యా మెడికల్ షాప్ అని పేరు పెట్టడం హేతువాదం ఎలా అవుతుంది? నువ్వమ్మే వాటిలో విషానికి భిన్నంగా మందుని నా కళ్ళకు చూపించ గలవా?"
- సుబ్రహ్మణ్యం గారి తర్కానికి సాయిరాం బిత్తరపోయాడు.
"అదేంటండీ అలా అంటారు? వాటిని తప్పుగా వాడితే అవి విషాలే.  వాటినే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తగిన పద్ధతిలో వాడినప్పుడు అవే మందులవుతాయి" అని కాస్త విసురుగా సమాధానం చెప్పాడు.
కోప్పడకు నాయనా - నా భావం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఈ చిన్న ఉపమానం.  నీ దుకాణంలో ఉన్న విషాలు కేవలం శాస్త్రవేత్త చూపు వల్ల  ఔషధాలవుతున్నాయి.  అలాగే కేవలం మనుషులుగా, పంచభూతాలుగా, రసాయనిక పదార్థాలుగా, భౌతిక వస్తువులుగా ఉన్నవన్నీ గురువు ఇచ్చే చూపు వల్ల దైవ స్వరూపాలవుతాయి.  హేతువాదంతో చూస్తె అంతా ప్రకృతే.  ఆధ్యాత్మిక దృష్టితో చూస్తె ఈ ప్రకృతి వెనుక ఉన్న అందమైన ప్రణాళిక, దానిని నడిపించే మహోన్నతమైన ధర్మం - ఆచూకీ అందుతాయి.  పాల నుంచి వెన్నని తీసినట్లుగా శాస్త్రవేత్త అయిన గురువు కూడా ఈ సత్యదర్శనం చేయించి మనిషి నుంచి మనీషిని ఆవిష్కరిస్తాడు.  అప్పుడు అంతా దైవమయమే.  ఇందాక నువ్వు ప్రస్తావించిన algebra లో X అనుకుని బయలుదేరి సమాధానాన్ని కనుక్కున్నట్లే, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న ప్రజ్ఞనే దేవుడని అనుకుని శోధిస్తూ వెళ్ళడమే సత్యాన్వేషణ.  ఈ శోధన లోనే మానవుడు పురోగమిస్తాడు.  దార్మికుడవుతాడు. శాస్త్రాలు పుట్టేదీ, శాంతి లభించేదీ రెండూ దీని నుంచే.  ప్రపంచ వికాసానికి మార్గం ఇదే.  ఇదే భారతీయమైన ఆధ్యాత్మిక సాధన.
ఈ సాధనలో పురోగమించిన వారిలో తమకు బాగా నచ్చిన వారి పేర్లను ప్రజలు అభిమానిస్తారు.  స్మరిస్తారు.  వారి సుగుణాలను ఆరాధిస్తూ తమ బిడ్డలకు ఆ పేర్లు పెట్టుకుంటారు.  అలా పెట్టుకున్నదే సాయిరాం అనే నీ పేరు.  అలాంటి తల్లితండ్రులను అవివేకులుగా నిందిస్తూ, రాముడి గురించి, రామ రాజ్యాన్ని గురించి ఏమీ తెలియకుండానే తేలికగా మాట్లాడేసే నిన్ను చూసి బాధపడుతున్నా.  స్వదేశీయులనుంచి స్వజాతీయుల నుంచి కూడా తనను తాను రక్షించుకోవలసిన దుస్థితిలో ఈ దేశం, ఈ సంస్కృతీ, ఇక్కడి విజ్ఞానం, వివేకం ఉన్నందుకు ఇంకా బాధపడుతున్నా.  ఇదంతా మనని పరాయి వారికి మళ్ళీ బానిసలుగా చేయడానికి ఎంతో కాలం పట్టదు.  నువ్వు ఎడ్యుకేట్ చేయడం కాదు, మొదట నువ్వు ఎదుకేట్ కావాలి.  మీ అమ్మానాన్నలు నిన్ను చూసి గర్వించ గలిగే రోజు రావాలి.  ఐ విష్ యు wisdom.
"సార్! బాధ్యతలను మేమూ సమర్థిస్తాం.  కానీ, మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తాం.  దేవుడంటూ ఫలానా ఎవడో ఉన్నాడని అనుకుంటూ ముందుకు వెళ్ళడమే సాధన అని మీరంటున్నారు తప్ప, ఆ దేముడిని మీరు చూపించలేక పోతున్నారు.  కనిపించని ఆ దేవుడి పేరుతో ఎన్ని మోసాలు, అరాచకాలు జరుగుతున్నాయో మీరు లెక్కలోకి తీసుకోవడం లేదు.  ఈ దారుణాలకు అడ్డుకట్ట పడాలంటే ఆయన ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించని వాడు కాకూడదు.  దేవుణ్ణి మీరు అందరికీ చూపించాలి" - సాయిరాం పెదవి విప్పాడు.
"బాబూ! దేవుడంటే నీ నిర్వచనం ఏమిటో కాస్త చెబుదూ!"
"సార్! దేవుడున్నాడని అంటున్నారు కాబట్టి మీరే చెప్పండి ఆయనెవరో"
"అది కాదయ్యా! లేదంటున్నావు కాబట్టి, ఎవడు లేడని అంటున్నావో నువ్వే చెప్పు! అప్పుడు మన డిబేట్ కొనసాగిద్దాం"దేవుడంటే మనిషి చేసిన ఒక కల్పన.   పూర్వ జన్మ అనే ఆలోచనలలో, పాపపుణ్యాలనే నమ్మకంలో పడదోయడం ద్వారా శాంతి భద్రతల నిర్వహణను సులభం చేసుకోవచ్చుననే ఆశతో పాలకులు దీనిని ప్రోత్సహించారు" అంటూ సాయిరాం జవాబు మొదలు పెట్టాడు.  
"ఆ పాలకులే కనక వీటిని నిజంగా నమ్మిన వారైతే ఇవాళ ఇన్ని కుంభకోణాలు జరగవు.  గుడులలో దొంగతనాలు జరుగవు. కేవలం జనాలను నమ్మించడానికి పురోహిత వర్గాల వారిని కలుపుకొని దేవుడు, దెయ్యం అంటూ ఏమేమో చెప్పారు. చెబుతున్నారు.   దేవుడంటూ ఉంటే ఇదమిత్థంగా అతడు ఇదీ అని చెప్పవచ్చు. లేని వాడి గురించి ఏముంది? ఏమైనా చెప్పవచ్చు.  మీరంతా చేస్తున్న పని అదే" అన్నాడు సాయిరాం. 

"నాయనా సాయిరాం! దేవుడనే మాటకు నీ భావన అదే అయితే, ఆ దేవుడు అసత్యమే.  దేవుడనే మాటకు నువ్వు చెప్పిన అర్థమే నిజమైతే, నేను కూడా నీతో పాటు నిరీశ్వరవాదినే" అన్నారు సుబ్రహ్మణ్యం గారు. 

అది విని అక్కడే ఉన్న మరో అతిథి సూర్యనారాయణ మూర్తి గారు గొల్లున నవ్వారు. 

"ఎందుకు నవ్వుతున్నారు? మీ దేవుడంటే ఏమిటో మీరు ఇదమిత్థంగా చెప్పాలి.  అంతే తప్ప దేవుడున్నాడంటూ ఏవేవో కల్పించి చెప్పి, ప్రజలను మోసగించకూదదు" అంటూ సాయిరాం తన వాదన కొనసాగించాడు.  మూర్తి గారు ఏదో జవాబు చెప్పేంతలో సుబ్రహ్మణ్యం గారు కలగజేసుకుని, "సాయిరాం లో నిజాయితీ ఉంది.  అతడు మనసా, వాచా, కర్మణా ఒక్కటే నమ్ముతున్నాడు.  దానినే మాట్లాడుతున్నాడు.  దానినే పాటిస్తున్నాడు.  భగవంతుడి కృప అతడికి పరిపూర్ణంగా లభిస్తుంది.  పైకి ఒకటి చెబుతూ చాటున మరొక విధంగా ప్రవర్తించే వారితో పోల్చి చూస్తే, దైవానికి ఎక్కువ దగ్గరైన వాడు సాయిరామే.  అతడిని కన్న తల్లితండ్రులు సంతోష పడే రోజు ఖచ్చితంగా వస్తుంది" అన్నారు. 

"నిజమే! మీరు కాబట్టి, ఇంత ఔదార్యం చూపుతున్నారు.  మతోన్మాదుల దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడి చూడమనండి! భ్రష్టుడివంటూ తిట్టిపోస్తారు" అన్నారు సూర్యనారాయణ మూర్తి గారు. 

"సుబ్రహ్మణ్యం గారు నన్ను  పొగిడి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు.  నాకు మీ నుంచి కావలసింది ఖచ్చితంగా దేవుడంటే ఇదీ అనే సమాధానం.  దానితో దేవుడు నిజమో, కల్పనో  తేలిపోతుంది" అన్నాడు సాయిరాం.   వాతావరణం కాస్త గంభీరంగా మారింది. 

"దేవుణ్ణి నీ కళ్ళకే చూపించాలా?" నేనడిగాను. 

"అవును"

"లేకపోతే దేవుడు సత్యం కాదా?  భూమ్యాకర్షణ శక్తి నిజం.  మరి దానిని చూపించగలవా? .....   విమానాలు, రాకెట్లు లేని కాలంలోనే భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళు మూఢులా?"

​ సాయిరాం పెదవి విప్పాడు "అది సైన్సు.  మానవుడు తార్కికమైన బుద్ధితో ఆలోచిస్తూ పెరిగాడు.  ఒడ్డున ఉన్న వాడికి సముద్రంలో దూరం నుంచి వస్తున్న ఓడ మీది జండా కనిపించింది.  తరువాత పొగ గొట్టం కనిపించింది.  తరువాత ఓడ పై భాగం, ఆఖరుగా ఓడ కింది భాగం కనిపించాయి.  దానిని బట్టి, భూమి వాస్తవ ఆకారాన్ని అతడు ఊహించ గలిగాడు.   ఇవాళ రాకెట్ సాయంతో రోదసి లోకి వెళ్లి ఫోటోలు తీసినప్పుడు అదే నిజమని నిగ్గు తేలింది.  భూమి బల్లపరుపుగా ఉందని వాదించిన మతాలున్నాయి. దానికి భిన్నంగా వాదించిన వారి తలలు నరికే మూఢులను అవి తయారు చేశాయి.  ​ఇవాల్టికి కూడా సృష్టి కేవలం ఆరువేల ఏళ్ళ క్రితం మాత్రమే ప్రారంభమైందని నూరిపోస్తున్న మతాలున్నాయి.  దేవుడు కల్పన అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా?". 

సాయిరాం ని నేనడిగాను - "భూమి వాస్తవ ఆకారం, భూమ్యాకర్షణ శక్తుల లాగానే బుద్ధికి మాత్రమే అందే సత్యాలు, కళ్ళకు కనిపించని సత్యాలు ఉన్నట్లుగా సైన్సు కూడా అంగీకరిస్తోంది కదా! అలాంటప్పుడు దేవుణ్ణి కళ్ళకే చూపించాలని వాదించడం అశాస్త్రీయమే కదా". 

"కళ్ళకు కనిపించక పోయినా పర్వాలేదు.  దేవుణ్ణి తార్కికంగా నిరూపిస్తే చాలు" అని ఒప్పుకున్నాడు సాయిరాం. 
"ఒక హెచ్చరిక చేయదలచుకున్నాను.  కళ్ళకు కనిపించని రూపంలో మాత్రమే దేవుడున్నాడని ఎవరూ అనడం లేదు.  విషంలో ఔషధం  లాగా, కనిపించే దానిలో కనిపించని రీతిలో కూడా అతడున్నాడని చెప్పడానికే విషము - మందు ఉదాహరణను నీ దృష్టికి తెచ్చాను.  భగవంతుడు తర్కానికి కొద్దిగా అందుతాడు.  అందనంత పెద్దవాడు కూడా.  ముందుగా ఇప్పటి వరకు నువ్వు అంగీకరించిన దాని సారాంశంగా, ఈ సృష్టిని మనం మానవుడి కళ్ళకు కనిపించేదిగా, కనిపించనిదిగా విభజించి చూడడానికి సైన్సు ఒప్పుకునేదీ లేనిదీ తేల్చి చెప్పు" - సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేసారు. 

"మీరు ఎలా వర్గీకరించినా సైన్సు కు సమ్మతమే.  క్లాసిఫికేషన్ అనేది సైన్సు తొలి మెట్లలో ఒకటి.  ఎటొచ్చీ అది సమగ్రంగా ఉండాలి.  అంతే" అన్నాడు సాయిరాం. 
సూర్యనారాయణ మూర్తి గారు తిరిగి రంగంలోకి దిగారు "నన్ను కాస్త చెప్పనివ్వండి! కనిపించేదిగా, కనిపించనిదిగా సృష్టిని వర్గీకరించడం సమగ్రమైన విధానం కాదు.  కనిపించడం అంటే దేనికి? కళ్ళకు మాత్రమేనా?  పూల పరిమళాన్ని కళ్ళు చూడగలవా?  మంచు చల్లదనం కళ్ళకు కనబడుతుందా? అందుకే సృష్టిని భారతీయ శాస్త్రజ్ఞులు పంచభూతాలుగా వర్గీకరించారు.   అవి పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు.  వీటిలో ఆకాశ తరంగాలలో మన చెవికి వినబడేవి ఉన్నాయి.  మనం వినలేనివీ కోకొల్లలుగా ఉన్నాయి.  వాయువుని మన చర్మం స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది.  తేజస్సుని అనగా కాంతిని మాత్రమే మన కళ్ళు గుర్తించగలుగుతాయి.  అదీ కొంత మేర మాత్రమే.  జలాన్ని మన నాలుక కొంత  మేర మాత్రమే రుచిచూడ గలుగుతుంది .  పృథ్విని మన ముక్కు వాసన ద్వారా కొంత వరకు మాత్రమే పసిగడుతుంది.  కాబట్టి, కళ్ళకు కనిపించడం అని కాక, పంచేంద్రియాలలో దేనికైనా సరే తెలిసేదీ, వీటిలో వేటికీ అందనిది అని సృష్టిని విభజించుకోవడం సమంజసం.  సృష్టి పంచభూతాత్మకమైనది. అలాగే వాటిని గమనించగలిగిన మానవుడు కూడా?"

​​
"మరైతే దేవుడు?" సాయిరాం ప్రశ్నించాడు. 
"భగవంతుడికి అది అని పేరు పెట్టుకుని, ఇక్కడ తన ముందరి ప్రతి ఒక్క దానిలోనూ దాని కోసం గాలిస్తూ ఇది అదే, ఇది అదే అని గుర్తిస్తూ కొందరు భగవంతుడి అన్వేషణ సాగించారు.  అంతిమంగా అన్నీ ఆ భగవంతుడే అని వారి హృదయానికి అర్థం కాజొచ్చింది.  అందుకే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడి మనస్సుని తేట తెనుగు పద్యంలో ఆవిష్కరిస్తారు పోతన. నేనంటే ఎవరనే ప్రశ్నతో మరికొందరు ఇదే అన్వేషణ సాగించారు.  దీనికి విపర్యయంగా నేను అంతే ఈ ముక్కు కాదు, ఈ చెయ్యి కాదు, ఈ చర్మం కాదు ...  ... నేతి, నేతి (ఇది కాదు, ఇది కాదు) అని చర్చించుకుంటూ చివరకు ఆ నేనన్నది కూడా భగవంతుడేనని గుర్తించారు. 'ఎవ్వనిచే జనించు? జగమెవ్వని లోపల నుండు? లీనమై ఎవ్వనియందు డిందు? పరమేశ్వరుడెవ్వడు ? మూలకారణంబెవ్వడు? అనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె అయిన వాడెవ్వడు? ఆత్మభవుడెవ్వడు?' అనే ప్రశ్నలన్నీ భగవంతుడి గుణాలను వెల్లడించే సమాధానాలే" అని సూర్యనారాయణ మూర్తి గారు జవాబిచ్చారు.
"ఒక్క క్షణం ఆగండి! మా ఇంటి దగ్గర్లో చిన్న గుడి ఉంది.  దానిలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.  అందరూ ఆయన్ని దేముడంటూ పూజలు, ప్రదక్షిణలు అన్నీ చేస్తున్నారు.  ఆ విగ్రహం వల్ల సృష్టి జనిస్తొందా? ఆ విగ్రహం లోపల ఈ జగత్తు ఉందా? ప్రపంచమంతా లీనమై ఆ విగ్రహంలో కలసిపోతుందా? ఆయనే పరమేశ్వరుడా? కొద్ది ఏళ్ళ క్రితం ప్రతిష్టించిన ఆ విగ్రహం అనాదా? ఈ జగతికి మూల కారణమా? అలాంటి లక్షలాది విగ్రహాలలో అసలు దేవుడు ఎవడు? దేవుడంటే మీరు చెప్పేది ఒకటి, ఆచరణలో చూపించేది మరొకటి.  దేవుడని అంటూ గంభీరంగా ఏవేవో మాట్లాడి, ఆఖరికి మీరు విగ్రహారాధన లోకి దిగుతున్నారు.  రాళ్ళు రప్పలను పూజిస్తున్నారు" సాయిరాం తన వాదాన్ని ఘాటుగా వినిపించాడు.
సుబ్రహ్మణ్యం గారు ఒక కాగితం, కలం తీసుకుని, "A" అనే అక్షరాన్ని, "అ" అనే అక్షరాన్ని, "నాన్న" అనే పదాన్ని, "రూ. 100" అనే పదాన్ని రాశారు.  "నాయనా సాయిరాం! ఇవేమిటో కాస్త చెప్పు" అని అడిగారు.  అతడు చదివాడు "A, అ, నాన్న, వంద రూపాయలు". 
"వీటిలో నాన్నని చూపించు" అన్నారు సుబ్రహ్మణ్యం గారు.   సాయిరాం తన వేలితో చూపించాడు.  "అ ని చూపించు" అన్నారు.  అతడు చూపించాడు.  అలాగే తక్కినవి.
"నాయనా! ఇది 'అ' అని అన్నావు.  మరి అనేక పుస్తకాలలో అనేకానేక చోట్ల రాసి ఉన్న అదే అక్షరం మాటేమిటి?" ఆ కోట్లాది 'అ' లలో అసలు 'అ' ఏది? ".  
"ఎక్కడ రాసినా అది 'అ' యే".  
"అలా ఎలా కుదురుతుంది? ఇక్కడ రాసి ఉన్నది 'అ' అని నువ్వన్నావు.  మళ్ళీ అక్కడ రాసి ఉన్నది కూడా 'అ' అంటే ఎలా?" సుబ్రహ్మణ్యం గారు ప్రశ్నించారు.  తనే జవాబు కూడా ఇచ్చారు. 
"'అ' అనేది ఒక శబ్దం.  దానిని వాక్కు రూపంలో కాకుండా, మరేదైనా రూపంలో ఎవరికైనా తెలియజేయాల్సి వచ్చింది.  అప్పుడే ఆ శబ్దానికి ఒక రూపం ఇవ్వాల్సి వచ్చింది.  శబ్దానికి రూపం లేదు.  మన సులభ్యం కోసం 'అ' అనే అక్షరంగా రూపం ఇచ్చుకున్నాం.  అలా రూపం దిద్దుకున్నదే 'అ' అనే అక్షరం.  అలాగే 'నాన్న' నాన్నే కానీ, ప్రస్తావన తేవలసి వచ్చినప్పుడల్లా నాన్నని తెచ్చి కూచోబెట్టలేం.  పది చోట్ల నాన్న ప్రస్తావన తేవాలన్నా సాధ్యం కాదు.  అందుకే ఓ ఉత్తరం ద్వారా, ఓ వ్యాసం ద్వారా, అలా అనేక చోట్ల చెప్పాల్సి వచ్చినప్పుడు నాన్న అనే మాటని ఉపయోగిస్తాం.  శబ్దాలలో అర్థం లేనివి కూడా ఉన్నాయి.  అర్థాలను నిర్ణయించు కోవడం తోటే అది భాష అయింది.  భాషకు రూపం లేదు.  రూపం ఇవ్వడం తోటే లిపి అయ్యింది.  భావానికి రూపం లేదు.  దానికి రూపమివ్వడంతో చిత్రం అయింది.  శిల్పంగా వికాసం చెందింది. ఈ విధంగా శబ్దానికి, అర్థానికి రూపంలో ఒక భౌతిక ఆలంబనను కల్పించుకోవడం విగ్రహారాధనే.  వంద రూపాయలు అనే దానికి నోటుగా ఒక రూపం ఇచ్చాం.    ఇదేమిటి అని అడిగితె వంద రూపాయలు అని అంటున్నాం.  నువ్వు ఏ, బి, సి, డి లను అ, ఆ, ఇ, ఈ లను ఉపయోగిస్తున్నావంటె భాషను, సాహిత్యాన్ని ఆరాధించడానికి విగ్రహారాధన మార్గాన్ని స్వీకరించావన్న మాటే.  కరెన్సీని ఉపయోగిస్తున్నా అంతే.
భాషను నిందించే వాడివైతే మూగవాడుగా బతకాలి.  సాహిత్యాన్ని ద్వేషిస్తున్నావంటే మానవ వికాసంలో భాగమైన దృశ్య, శ్రవణ కార్యకలాపాలకు దూరంగా Mentally Retarded గా బతకాలి.  విగ్రహారాధనని వ్యతిరేకించే వాడివైతే లిపిని బహిష్కరించాలి.    A, అ, నాన్న, రూ.100 మొదలైన పదాలేవీ రాయకూడదు.  అక్షరాలను చదవకూడదు.  చాయా చిత్రాలనూ, రేఖా చిత్రాలనూ, వర్ణ చిత్రాలనూ, శిల్పాలను, కాలిగ్రఫీని అన్నింటిని బహిష్కరించాలి.  కరెన్సీని వాడకూడదు.  వీటిని ఉపయోగించడానికి, విగ్రహారాధనకు తేడా ఏమీ లేదు.  నేను చుట్ట కాలుస్తాను తప్ప పొగ పీల్చనని అంటే ఎలా ఉంటుందో, లిపిని, కరెన్సీ ని జీవితంలో ఉపయోగిస్తూ, విగ్రహారాధనకు వ్యతిరేకిని అంటే అలాగే ఉంటుంది.
ఒక మాస్టారు గారన్నారు. "ఒరే! 'నువ్వు' అనే దానికి నీ దేహం సాక్షాత్తూ విగ్రహమే. మరి దానికి నువ్వు పళ్ళు తోమడం, క్రాఫు దువ్వడం, స్నానం చేయించడం, పౌడరు రాయడం, నైవేద్యం పెట్టడం అన్నీ చేస్తున్నావా లేదా? అదంతా విగ్రహారాధన ద్వారా జరిగే నీ ఆరాధనే కదా" అని, ఇంతకీ సాయిరాం! నువ్వు దైవాన్ని వ్యతిరేకిస్తున్నావా? విగ్రహారాధానని వ్యతిరేకిస్తున్నావా?  దైవాన్ని తలవక పోయినా భగవంతుడి దయ వలన బతికిపోవచ్చు.  కానీ విగ్రహారాధనకు వ్యతిరేకినంటూ ఈ అక్షరాలను, అర్థాలను,  లిపినీ, చిత్రాలనూ వేటినీ జీవితంలోకి రానివ్వనని భీష్మించుకుంటే, దేవుడు కూడా నిన్ను కాపాడ లేదు.  ఈ అక్షరాలూ, లిపి, చిత్రాలు, విగ్రహాలు అన్నీ దేవుడిచ్చిన వరాలు.  దేవుణ్ణి గౌరవించడ మంటె, దేవుడిచ్చిన కానుకలను చక్కగా ఉపయోగించడం.  అంతే తప్ప, నిషేదించడం కాదు".   సుబ్రహ్మణ్యం గారి జవాబు కూడా ఘాటుగానే ఉందనిపించింది.
"ఎవడి వల్ల జగత్తు జనిస్తుందో వాడు దేవుడని మీరన్నారు.  అలాంటి దేవుడికి ప్రకృతిలోని కేవలం ఏవో కొన్ని అంశాలు ఎలా సంకేతాలవుతాయి?" సాయిరాం ప్రశ్నించాడు. 
(ఇంకా ఉంది     ............. )



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP