శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధ్యానం అంటే

>> Thursday, November 7, 2013

ధ్యానం

మనల్ని ప్రకృతి ప్రేమించినంతగా, ప్రకృతిని మనం ప్రేమించ గలమా? ప్రకృతి ఇచ్చినదంతా పొంది మైమరచి ఉండగలమా?  ఆ స్థితిని మనం చేరగలిగితే, ప్రకృతి పట్ల ఆత్మీయతతో, కృతజ్ఞతతో హృదయం బరువెక్కుతుంది.  మది నాట్యం చెయ్యడం ప్రారంభిస్తుంది.  మన హృదయం చేసే ఆనంద తాండవమే 'ధ్యానం'.
బయట కనపడే భగవంతుని అనుక్షణం అనుభవంలోకి తెచ్చుకోవాలి.  తీరికవేళలో కనపడని దేవుని ప్రావీణ్యాన్ని, ప్రేమను, ప్రతిభను తలచుకొని పరవశించాలి.  ఆయన ఆప్యాయత అవగతమైన మరుక్షణమే దేవుని పాదాల వద్ద వాలిపోయి మోకరిల్లుతామ్.  సంతృప్తి నిండిన హృదయం నర్తిస్తుంది.  ఇదే ధ్యానం.
ఒకే విషయం పై మనసు కేంద్రీకరించడం వలన అక్కర్లేని ఇతర విషయాలపై దృష్టి మరలకుండా ఉంతుంది.  కొద్ది సేపు మనశ్శాంతి దొరుకుతుంది.  అటు-ఇటు తిరిగే తుంటరి మనసు తాత్కాలికంగా కట్టుబడుతుంది.  కానీ నిజమైన ధ్యానం వల్ల కలిగే ప్రశాంత స్థితి చాలా కాలం నిలిచి ఉంటుంది.
వేల వర్ణాల పూలతో నిండిన తోటను చూడండి.  ఆ పరిమళాలు ఎదలో నింపండి.  అర్థ నిమీలిత నేత్రాలతో సృష్టికర్త భావుకతను మౌనంగా కీర్తించండి.  ఆ 'చైతన్యం' తో పూర్తిగా తాదాత్మ్యం చెందండి.
అసలీ శక్తి ప్రకృతికి ఎలా వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఈ విధమైన నిబిడాశ్చర్యంతో నిశ్చల మానసిక స్థితి ప్రాప్తిస్తుంది.  హృదయం ఒడుదుడుకులు లేని సరోవరమవుతుంది.  బహిర్ముఖం చేద్దామని ప్రయత్నించినా మనసు చెక్కు చెదరదు.  ఇటువంటి 'సహజసుఖస్థితి' కావాలి.  ఈ స్థితి అలవాటు కావాలి.
మనసును సహజంగా నెమ్మదించనీయండి.  బలవంత పెట్టకండి.  అసంకల్పితంగా, అలవోకగా ఒక అంశం మీద కేంద్రీకరించనీయండి.  ఇష్ట దేవతల యొక్క నామస్మరణ చేసినా, వారి చరణ కమలాల మీద దృష్టి నిలిపినా, వెనువెంటనే విశ్వాంతరాళమంతటా నిండిన ఆ మహాశక్తి యొక్క అనంత సామర్థ్యం మనో నేత్రానికి దర్శనం కావాలి.  ఆ అద్భుత ప్రజ్ఞ మన బుద్ధికి స్ఫురించాలి.  ఆ అపార వాత్సల్యం, ఆ ప్రేమ పరిమళంతో మన మది మత్తులో మునిగి తేలాలి.  కృతజ్ఞతతో హృదయం నిండి పొంగి పోవాలి.  అదే నిజమైన ధ్యానం.  అప్పుడే అవధిలేని ఆనందం లభిస్తుంది.
మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి.  దైవం పట్ల ప్రేమతో, కృతజ్ఞతతో సంతృప్తిగా హృదయమయూరం చేసే నృత్యమే ధ్యానం.

--
ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.
--

3 వ్యాఖ్యలు:

యామజాల సుధాకర్ November 7, 2013 at 8:17 AM  

చాలా చక్కగా చెప్పారండి.

Zilebi November 8, 2013 at 9:03 PM  


కూర్చుని కళ్ళు మూసుకుని 'నీదరి' పోవుటను ధ్యానము అందురు !

జిలేబి

durgeswara November 9, 2013 at 9:08 AM  

నిజమండీ!
నీదరి పోతే నీవు అనంతమైన పరమాత్మలో లీనమవుతావని జిలేబీగారు చాలాలోతుగా చెప్పారు ధన్యవాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP