శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీరు భౌతికులా, ఆధ్యాత్మికులా?

>> Saturday, September 28, 2013


September 26, 2013

సృష్టి ఎందుకు? నిజానికి సృష్టి అనేది ఏమీ లేదు. ఏదీ సృష్టి అవడం లేదు. కేవలం శక్తి రకరకాలుగా ఆడుతూ ఉంది, అంతే. దేవుడు కూర్చుని ఏదో సృష్టించడం లేదు, శక్తి రకరకాలుగా ఆడుతూ ఉంది. కానీ, ఈ శక్తి అంతా జీవం కనుక అది ఎప్పుడూ రకరకాలుగా రూపాంతరం చెందుతుంది. ఇది ఎప్పుడూ జరిగిపోతూ ఉంటుంది. మంట మండుతున్నప్పుడు కూడా, ప్రతి క్షణం అది రకరకాల రూపాలుగా మారుతుంటుంది. ఎందుకంటే ఏ చలన శక్తిని అయినా కదలకుండా ఉంచలేం. అది సర్వకాల సర్వావస్థలా రూపాంతరం చెందుతూనే ఉంటుంది. ఆ రూపాలన్నీ కనిపించి, కనుమరుగవుతూ ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఎందుకు? నిజంగా చెప్పాలంటే 'ఎందుకు' అనే ప్రశ్న లేదు. అది అలానే ఉంది. ఇది ఉనికి, ఇదే సర్వం. మీరు అడిగే 'ఎందుకు' అనేది చాలా పరిమితమైన ప్రశ్న. అందుకే ఎందుకు, ఎలా, అని మీరు అడగలేరు. మీరు 'సృష్టి' అంటున్నది అపరిమితమైన ఘటన కాబట్టి దానిని మీరు అపరిమితమైన ప్రశ్న అడగలేరు. కనుక పరిమితమైన ఎలా, ఎందుకు అనేవి అర్థం లేని ప్రశ్నలు.

ఈ ఉనికికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా అర్థం లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ మితమైనవి. మీ పరిమితమైన తార్కిక మనసులో తయారైన ప్రశ్నలతో అనంతమైన దానిని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సృష్టికి సంబంధించిన ప్రశ్నలన్నీ అర్థం లేనివి. అందువల్ల సమాధానాలకు కూడా అర్థం ఉండదు. సృష్టి ఎందుకు అనే ప్రశ్న లేదు. అది ఉంది, అంతే. మీ ప్రశ్న కానీ, నా జవాబు గానీ దానిని పట్టి ఉంచలేవు. ఈ ఉనికి గురించి మీరు అడిగింది ఏదైనా చెప్పింది పూర్తిగా అర్థం లేనిదే. అదంతా కేవలం ఈ మూర్ఖత్వమే.

సృష్టితో వాటికి ఏ సంబంధమూ లేదు. సృష్టి 'ఇలా ఉంది' అని నేను అనుకోవచ్చు. 'ఇంకో విధంగా ఉంది' అని మరొకరు అనుకోవచ్చు. సృష్టికి దానితో సంబంధం లేదు. అది అలా ఉంది. మీరు కేవలం ఆటలో ఒక భాగం మాత్రమే. అదీ సూక్ష్మాతి సూక్ష్మమైన భాగం. మీరు ఈ సృష్టిలో భాగంగా ఉండాలనుకుంటున్నారా, ఎప్పుడూ సృష్టిలో భాగంగానే కొనసాగాలనుకుంటున్నారా లేదా మీరు సృష్టికర్తగా మారాలనుకుంటున్నారా అనేదే ఇప్పటి ప్రశ్న. సృష్టిలో భాగంగా ఉండటానికి ఒక మనిషి సంతృప్తి చెందనప్పుడు, కేవలం ఈ అనుభూతి అతనికి సరిపోనప్పుడు అతను సృష్టిమూలం తెలుసుకోవాలనుకుంటే, దానిని యోగ లేదా ఆధ్యాత్మికత లేదా దానిని మీరు ఇంకా ఏదైనా అనవచ్చు. మీరు సృష్టితో సరిపెట్టుకోవడానికి సుముఖంగా లేనప్పుడు, సృష్టి మూలం ఏదో కావాలనుకున్నప్పుడు, అప్పుడే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు. మీరు కనుక సృష్టిలో సంతోషంగా ఉండటానికి సమ్మతిస్తే మీరు భౌతికపరమైన విషయాలతో సరిపెట్టుకున్నట్లే, మీరు భౌతికులే. సృష్టిమూలం కోరుకునే వారైతేనే మీరు ఆధ్యాత్మికులు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP