శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మానవజీవితంలో భక్తి-దయాగుణం

>> Friday, September 27, 2013


'దయా ధర్మకా మూలహై దయ' అనేది ధర్మానికి మూలమని, తులసీదాసు అంటాడు. మానవునికి ఉన్న ఉత్తమ సంపదలో దయ మొట్టమొదటిది. బాహ్యసౌందర్యం కంటే, గుణసౌందర్యం కంటే అనేక రెట్లు గొప్పది. ప్రధానమైంది. పేదలయందు దయ, ఆర్తులయందు ఆదరణ బుద్ధి, దీనులయందు దాతృస్వభావం, కష్టాలతో బాధపడేవారిపై కరుణ ఇలాంటి పరోపకార బుద్ధితో కూడిన సహృదయం కలవారై ఉండాలి. అనేక జన్మలనెత్తి చివరకు దైవకృపతో ఈ మానవజన్మకు రావడం జరిగింది. కనుక మన హృదయాన్ని దైవసంపదతో నింపుకుని దైవనిలయంగా తీర్చిదిద్దుకోవడమే మన లక్ష్యం.  భగవంతుడు పక్షపాతం లేనివాడు. కనుక మనం భగవంతుని ధ్యానించుటకు అవకాశం కల్పించుకోవాలి. భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితంలో భగవంతుని ఆరాధించుటకు సమయం దొరకడం లేదు అనడం సముచితం కాదు. ఏ పనిచేయాలన్నా లక్ష్యశుద్ధితో వ్యవహరిస్తే, ఏకాగ్రత కూడా కుదుర్చుకోవాలి. నిలకడ లేని మనసును నియంత్రణలో ఉంచుకుంటే ఆలోచనలు వాటికవే సంస్కరింపబడతాయి.
''తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవినానోక్తం కర్మ కర్తుమిహార్హసి" అని ఏదీ చేయదగినదీ, చేయరానిదీ నిర్ణయించేటప్పుడు శాస్త్రం ప్రమాణమై ఉంది. శాస్త్రంలో చెప్పబడిన దానిని తెలుసుకుని, దానిననుసరించి నువ్వీ ప్రపంచంలో కర్మచేయాలి అని శ్రీకృష్ణుని బోధ.
భగవంతుడి రూపాన్ని సామాన్యుడు కాంచలేడు. అర్థం చేసుకోలేడు. అయితే ప్రజలకు ఆ భగవంతుడి మీద మనసు నిలిచేందుకు పలు రూపాలను మన పెద్దలు అందించారు. విఘ్నేశ్వరుడు, శ్రీమహావిష్ణువు, శివుడు, శ్రీరాముడు ఈవిధంగా ఎవరికి ఏరూపం ఆకర్షణగా తోచితే, ఏ రూపం చూడటం ద్వారా మనసుకు తృప్తి కలుగుతుందో దానిని ఎంచుకోవచ్చు. అలా ఒక రూపంలో ఉన్నవానిని ఆరాధించేవారు మరో రూపాన్ని పూజించకూడదని భావించడం అర్థరహితం. రూపం ఏదైనా భగవంతుడు ఒక్కడే.
మనిషి భగవంతునిలో ఐక్యం కావటానికి ఆచరించాల్సిన సూత్రాలేమిటో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇరవై సూత్రాలను వివరించాడు. ఆ సూత్రాలను అనుసరించిన వారికి విముక్తి లభిస్తుంది. గౌరవం, మర్యాదలు అవసరమే కాని అవే జీవితంగా భావించకూడదు. క్షమాగుణం అలవర్చుకుని ఇతరులకు హాని తలపెట్టకూడదని, ఆర్భాటాల కతీతంగా జీవించా లని, సేవాభావం కల్గి ఉండాలని, శారీరక శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా అవసరం. భౌతిక సుఖాల వల్ల వచ్చే దుఃఖాలను గుర్తించాలి.
దయ కలిగి ఉండడం మనిషి ఔన్నత్యాన్ని సూచిస్తుంది. మనకు ఎంత కఠిన పరిస్థితి ఎదురైనా, ఎంతటి అవమానం జరిగినా వాస్తవాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఎదుటి వారిని క్షమించగలను అనే ధీమాను దయార్ధ్రత వికసింపజేస్తుంది. సాటిమనిషిపై దయ చూపడం అనేది గొప్పశక్తి. ఒక గొప్పవరం.                       - కావ్యసుధ  

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP