శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆది వరాహస్వామిచే కాపాడబడిన భూమి ఎక్కడ ఏ సముద్రంలో ముంచబడింది

>> Wednesday, September 11, 2013

ఒకానొక గ్రూప్ లో ఈ క్రింది ప్రశ్న చూసాను. చాలా మంచి ప్రశ్న.
ప్రశ్న: ఆది వరాహస్వామిచే కాపాడబడిన భూమి ఎక్కడ ఏ సముద్రంలో ముంచబడింది. భూమి నీరు ఒకే చోట ఉన్నాయి కదా? దయచేసి తెలుపగలరు.

జవాబు :

దీనికి సమాధానం చెప్పాలంటే పురాణములోని పై పై మాటలు చెప్పెయ్యవచ్చు. దాని వలన ఈ సమాధానం చదివే వారిలో కుతూహలం అంతటితో ఆగిపోవచ్చు. లేదా ఇవన్న్నీ కాకమ్మ కథలు తార్కికంగా లేదు అనే తేలిక భావన కలగవచ్చు. అందుకని విషయాన్ని వివరించి చదువరుల అవగాహనని కొంత పైకి తీసుకువెళ్ళి ఆ తరువాత సమాధానం చెప్పాలి. దాని వలన చదివే వారిలో రావలసిన కొన్ని మంచి మార్పులు ఇది చదివిన వారి జీవితంలో కొనసాగుతాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించగలరు.

భాగవతము మొదలైన పురాణములలో సృష్టికి సంబంధించిన కొన్ని కొన్ని వైజ్ఞ్యానికములైన కథలు ఉన్నాయి. అవి గుప్తములు రహస్యములు. అంటే అందరికీ తెలియకూడనివి అని కాదు. అందరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయములే అయినప్పటికీ మనసు చేత అర్థం చేసుకోవటానికి కష్టం (దాదాపు ఋషులంతటి ప్రజ్ఞ్య గలవారికి సాధ్యం ), అనగా ఒకరకంగా సామాన్యులకు దురూహ్యములు. ఈ కథలలో వేద ప్రతిపాద్యమైన విషయములు ఎన్ కోడెడ్ గా 'నిక్షిప్తం' చెయ్యబడ్డాయి. అయినప్పటికీ సామాన్యులు కూడా ఆ శక్తిని పొందాలని అటువంటి విషయాలని మనకి ఒక కథ లాగా అందించారు. బయటికి అది కథ లాగా కనిపించినా అది అర్థం అయినా కాకపోయినా ఆ కథలను అలాగే చదవటం వలన జీవులు ఉద్ధరించబడతారు. వేదములో ఇవ్వబడిన మంత్రాలతో సమానమైన శక్తిని కలిగి ఉంటాయి. [నిజానికి కొన్ని వేదమంత్రాలు కూడా మామూలుగా అర్థం కాని రహస్యమైన విధానంలో ఉంటాయి. ఋషులు ద్రష్టలు మాత్రమే వాటిని అర్థం చేసుకుని చెప్పగలరు. వాటిని పాశ్చాత్యులు కొందరు సంస్కృతం నేర్చేసుకుని అనువదించేద్దామని ప్రయత్నించి తప్పులు తడకలుగా అర్థం చేసుకున్నారు. అదే సంస్కృత మంత్రాలు యథా తథంగా చదివితే ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. అందువలన మనము వ్యాసుడు, పోతన వంటి వారు రాసిన భాగవతం మొదలైన పురాణాలు యథాతథంగా చదివే ప్రయత్నం చెయ్యాలి. అనువాదాలు కాదు ! ]

మనము భౌతిక శరీరములతో భౌతికమైన [Matter] పదార్థములతో నిండిన లోకములో ఉన్నాము. మనము చూసే మనుష్యులు పశు పక్ష్యాదులు, మట్టి, నీళ్ళు, గాలి, రంగు రంగుల అగ్ని అన్నీ కూడా భౌతికమే. దీనినే (1) భూలోకము [Plane of Matter] అంటారు. మనం చూసే గ్రహ గోళాలు అన్నీ - మనం చూస్తున్న సూర్య బింబము, చంద్రుడు, గ్రహములు, తారకలూ, పాలపుంత ఇవి అన్నీ భౌతిక పదార్ధం తో నిండి ఉన్నవే. ఇవన్నీ భూలోకం గానే పిలువబడతాయి. మనమున్న భూమి అనబడే గోళం అందులో ఒక భాగం మాత్రమే అని అర్థం అయ్యిందనుకుంటాను.

దీని కంటే సూక్ష్మమైన లోకములు ఉన్నాయి. ఆ సూక్ష్మమైన లోకములు ఆధారముగా స్థూలమైన భూలోకం నిలబడి ఉంది. అంటే - మనకి మనసు ఉంది కదా, ఆ మనసు వలన, దానిలోని తెలివి వలన మన శరీరం కల్పిమ్పబడింది. అలాగే భౌతికంగా మనం చూస్తున్న ప్రతీ వస్తువుకీ ఒక మనస్సు దాని ప్రకృతి లక్షణములుగా/తెలివి/mind గా పని చేస్తుంటుంది. ఈ మనస్సు భౌతిక ద్రవ్యముతో తయారవక శక్తిమయముగా [Force/Energy] ఉంటుంది. మనసు దేహమును తయారు చేసుకుని భూలోకంలోకి పుడుతూ ఉంటుంది. దేహాన్ని కోల్పోయినప్పుడు తిరిగి కేవల మనోమయ కక్ష్యలలో నిలబడుతూ ఉంటుంది. శక్తి / Force పదార్ధమును / Matter ను నడిపిస్తుంది. భౌతికమైన దేహములు ఇంకా కల్పిమ్పబడనప్పుడు కేవలం మనోమయ కక్ష్యలో ఉన్న జీవులు గల లోకమును (2) భువర్లోకము [Plane of Force] అంటారు. మనమున్న భూలోకంలోనే వేరొక కక్ష్యలో భువర్లోకం కూడా ఉన్నది. వేరే ఎక్కడో ఇంకొక లోకంగా కాదు. భూమి జీవులందరికీ భువర్లోకము అంతర్లీనముగా ఆధారముగా ఉన్నది.

ఇంకా ఇంతకంటే సూక్ష్మమైన లోకమొకటి ఈ భువర్లోకమునకు ఆధారం గా ఉంటుంది. దాన్ని (3) సువర్లోకము (Plane of consciousness) అంటారు. నేనున్నాను అనే అస్తిత్వము సచేతనములమైన మనకెలా ఉన్నదో అచేతనములు విచేతనములు అయిన వస్తువులలో కూడా ఉంటుంది. ఆ అస్తిత్వమును ప్రజ్ఞ్య (consciousness) అని అంటాము.

వీటికి పైన ఇంకా సూక్ష్మతరము సూక్ష్మతమము అయిన వెలుగు లోకములు వీనికి ఆధారభూతముగా ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయి అని అర్థం చేసుకోవటం మన ఊహకి కొంచం కష్టమైన విషయం. వాటి పేర్లు 4-మహార్లోకము, 5-జనోలోకము, 6-తపోలోకము, 7-సత్యలోకము.
సత్యలోకం లో బ్రహ్మ దేవుడు ఉంటాడు. ఈ లోకములలో పైకి వెళ్ళిన కొద్దీ చైతన్యం పెరుగుతుంది. ఇంకా పైన వైకుంఠ లోకం ఉంటుంది.

అలాగే భూలోకం కంటే బాగా పదార్థమయమైన బరువైన అజ్ఞ్యాన జనితములైన చీకటి లోకములున్నాయి. వాటిని (-1)అతల (-2) వితల (-3) సుతల (-4) తలాతల (-5) మహాతల (-6) రసాతల (-7) పాతాళ లోకములుగా చెబుతారు. వెళ్ళిన కొద్దీ వీటిలో చాలా చీకటి ఉంటుందిట. ప్రతీ లోకములోనూ ఆయా లోకానికి సంబంధించిన జీవులుంటారు.

ఈ పదునాల్గు లోకములలో ఒక దానిలోనుండి ఇంకొక దానిలోనికి మార్గాలున్నా మామూలు జీవులందరూ వారి వారి లోకాన్ని దాటి వెళ్ళలేరు.

బ్రహ్మ గారు పడుకున్నప్పుడు వీటిలో [1 to 4] భూ, భువ, సువ, మహర్లోకములు కరిగిపోతాయి. అలాగే [-1 to -5] మహాతలం దాకా ఉన్న క్రింద లోకములు కూడా ఉండవు. అవన్నీ కరిగిపోయి ఒకే పదార్థంగా 'జలము'లతో నిండి ఉంటాయి. ఆయ లోకములకు, వాటి అధిపతులకు, అందులోని జీవులకు అది ప్రళయం. అప్పుడు సూర్యుడు కూడా ఉండదు కాబట్టి అంతటా అజ్ఞ్యానమనే చీకట్లు ఉంటాయి. ఇక్కడ 'జలము'లంటే మనం తాగే నీళ్ళు, మన భూమి మీద ఉండే సముద్రాలు కాదు. ఒక మూలపదార్ధం వంటిది.

అలా పూర్వ కాలంలో ఒకానొకప్పుడు బ్రహ్మగారు నిద్రకు ఉపక్రమించే సమయంలో అనేక వరములచేత సకల లోకములలోనూ అజేయుడై సంచరించగల హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భౌతిక లోకములను [1,2,3] తస్కరించి (-6) రసాతలంలో దాచేసాడట. తిరిగి మరుసటి పగలు [బ్రహ్మ కల్పం] లో సృష్టి మొదలెట్టినపుడు బ్రహ్మ గారు 1,2,3 లోకాలు సృష్టి చేద్దామని సంకల్పించగానే బ్రహ్మ నాసిక నుండి సర్వ వ్యాపకుడైన నారాయణుడు యజ్ఞ్య వరాహ మూర్తిగా అవతరించి ఆ 'జలములను' చీల్చుకుంటూ అధోలోకములకు వెళ్లి రసాతలములో భూగోళమును దాచిన రాక్షసుని కనుగొని సంహరించి అక్కడి నుండి 'భూమి' [అనగా 1,2,3 లోకాల సముదాయం] ని ఉద్ధరించాడట, అనగా ఆయా లోకముల పునర్ కల్పన ఆ 'వరాహకల్పం'లో వరాహమూర్తే చేసినట్టు.

నీటిలోనే మంచు గెడ్డ కట్టినట్టుగా ఆ దివ్యజలములలో క్రమముగా భౌతిక లోకములు పునరుత్పన్నమయ్యి వాటి యందు బ్రహ్మగారి సృష్టి తిరిగి మొదలయ్యింది.

ఇలాంటివి మనకు తెలియాలంటే గురువులను ఆశ్రయించాలి. మన తార్కిక దృష్టికి అర్థం కాని విషయాలు చాల ఉన్నాయి. మన తెలివి భూలోకమును భువర్లోకమును కూడా దాటలేదు కదా. రేపొద్దున్న ఎవరో పాశ్చాత్యుడు వచ్చి మేము పాలపుంత చివరి దాకా టార్చ్ లైట్ వేసి వేదికాము, మాకు మీ పురాణాల్లో చెప్పిన పదునాల్గు లోకాలు కనిపించలేదు అంటే సమాధానం చెప్పగలమా? అసలు వాడు అది అనే లోపల వాడికి కూడా ఈ అవగాహన కలిగిస్తే గొడవే లేదు.

3 వ్యాఖ్యలు:

hari.S.babu September 12, 2013 at 2:52 AM  

చాలా బాగుంది మీ వివరణ!

hari.S.babu September 12, 2013 at 2:53 AM  

చాలా బాగుంది మీ వివరణ!

Unknown September 18, 2013 at 3:39 AM  

This absolute True

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP