శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

(అ)ధర్మ వచనములు

>> Thursday, September 5, 2013


కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుల వారు విజృంభించి పాండవసేనలోని యోధులను, గురరలను, ఏనుగులను వేలసంఖ్యలో చంపివేశాడు. శ్రీకృష్ణుడు దాన్ని చూసి అర్జునునితో ''ఓఅర్జునా! ఈ ద్రోణుడు ధనుర్ధరుడై యున్నప్పుడు ఆ ఇంద్రాది దేవతలును నీతని యుద్ధమున జయింపజాలరు. ఈతడు అస్త్రసన్యాసమొనర్చిన గాని మానవులీతని జయింపజాలరు". కావున పాండవులిపుడు ధర్మమును విడిచి జయము సంపాదించువారై యుండవలయును. ఇపుడీ ద్రోణుడు మనలనెల్ల ఎటుల చంపకుండునో, అట్లుగా నొక ఉపాయమొనర్పవల యును. అశ్వత్థామ హతుడగునేని ఇతడు యుద్ధము నుండి విరమించునని నా నిశ్చయము. కావున ''వాడు హతుడయ్యెనని ఇపుడెవ్వడేని చెప్పవలయును, అని అన్నాడు. అట్ల అసత్యము చెప్పటానికి ఒక్క ధర్మరాజు తప్ప అందరూ సిద్ధమయ్యారు. అశ్వత్థామ అను పేరుగల ఒక ఏనుగును చంపి భీముడు ద్రోణునికి దగ్గరగా వెళ్లి, ''అశ్వత్థామా హతః అన్నాడు. కానీ భీముని మాటలను ద్రోణుడు నమ్మలేదు. ధైర్యము వీడలేదు. ఇంకా చెలరేగి పాండవ సైన్యాన్ని మట్టుపెట్టాడు. అగ్నిదేవుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, కశ్యపుడు ద్రోణునకు కనిపించి ''ఓ భరద్వాజా! అధర్మయుద్ధమారంభమైనది. నీ నాశనమునకు సమయము సమీపించియున్నది. కావున ఇక ఆయుధము విడువుము. ఇందులకు వచ్చియున్న మమ్ముం జూడుము. ఈ క్రూర కర్మము చాలును. ఇక నిట్టి కృత్యము నీకొనరింపదగినది కాదు. నీవు వేదవేదాంగ వేత్తవు. సత్యధర్మపరాయణుడవు. బ్రాహ్మణుండవగు నీకు బొత్తుగా నీ కృత్యము తగనది. కావున మోహము త్యజించి విల్లువిడువుము. శాశ్వత పథమను వర్తింపుము. ఇపుడీ మానవలోకమున నీవుండవలసిన కాలము సంపూర్ణమై నది. అస్త్రవిద్య నెఱుగని వారెల్లరును నీ బ్రహ్మాస్త్రముచే దహింపబడిరి గదా! ఓ విప్రోత్తమా! నీ విట్టి దుష్కృ త్యమొనర్పరాదు. ఇక నీవాయుధమును వడిగా విడువుము. జాలము చేయవలదు. ఓ ద్విజోత్తమా! ఇంకనూ పాపిష్టతరమగు కృత్యమొనర్తువేటికి? అని అన్నారు. (పేజి 861-ద్రోణపర్వము-శ్రీమదాంధ్ర వచన మహాభారతము)
అదే సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ''ఓ ధర్మరాజా! కోపోద్దీపితుడైన ఈ ద్రోణుడిక నీ పగటి సగమును యుద్ధము చేసెనేని, మనసేనయెల్ల నశించుననుట సత్యదూరము కానేరదు. కావున మమ్మెల్ల కాపాడుటకై సత్యము కంటే ఘనమైన ఈ అసత్యమును పలుకుము. ప్రాణ రక్షణమునకై పలికిన అసత్యము వలన పాపము కలుగనేరదు. అటులే కాంతాజనము నెడను, వివాహముల విషయమునను, గోవులను, బ్రాహ్మణులను, విత్త మును రక్షించుటయందును అనృతమాడినను పాతకము కలుగనేరదు అని అన్నాడు. (పుటలు 861-62- ద్రోణపర్వము)ధర్మరాజు ద్రోణునితో 'అశ్వత్థామా హతః అని గట్టిగా చెప్పి అశ్వత్థామ అను సంజ్ఞగల ఏనుగు అని చిన్నగా చెప్పాడు. అంతవరకు భూమికి నాలుగు అంగుళాలపైన ఉన్న అతని రథము అతడు అసత్యమా డటం వల్ల భూమిలోకి కృంగింది. ధర్మరాజు ఎట్టి పరిస్థితిలోనూ అసత్యమాడడని భావించిన ద్రోణుడు నిజంగా తన కుమారుడు చనిపోయాడని అనుకుని దుఃఖించి, జీవితంపై ఆశవిడిచి, పాండవులకు తానొక తప్పుచేసిన వానిగా రుషి వచనములచే నిశ్చయించుకుని, మనసు చెడి అస్త్రసన్యాసము చేశాడు. దృష్టద్యుమ్నుని చేతిలో చచ్చాడు. ఇది మహాభారతంలో మనకు స్పష్టంగా కనపడే విషయం.  మహాభారతము అనినా, శ్రీకృష్ణుడు అనినా మనకు ఎంతో భక్తి. ''ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనిన శ్రీకృష్ణుడు అర్జునునితో ధర్మమును విడిచి జయము సంపాదించాలని చెప్పటమేమిటి? ధర్మరాజుతో సత్యము కంటే అసత్యము ఘనమై నదని చెప్పటమేమిటి? రెండు సేనల్లోని బంధుమిత్రులను చూసి విల్లును అర్జునుడు క్రింద పడవేస్తేనేమో మోహంలో అలా చేశాడని, భగవద్గీతను వినిన తర్వాత మోహం నశించి విల్లంబులను చేతబట్టి యుద్ధం చేశా డని అంటాము. మరి ఈ ఘట్టంలోనేమో అద్భుతంగా యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుల వారికి రుషులు కనబడి మోహాన్ని వీడి విల్లంబులు పడవేసి యుద్ధం చేయటం ఆపమని చెప్పారు. ఇదంతా ఏమిటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. ప్రశ్నించటం మాని, కేవలం శ్రీకృష్ణుడు పరమాత్ముడని ఆయన ఏమి చేసినా, ఏమి చెప్పినా అదే సరైనదని విశ్వసించి ఊరకే ఉండగలమా? అది సాధ్యం కాదు. మరి ఏమి చేయాలి? తపస్సు చేయాలి. ఏకాంతంగా, మౌనంగా, ప్రశాంతంగా కూర్చొని సమాధానాలకై వేచి చూడాలి. అంతరంగంలో ఒక వెలుగు వెలుగుతుంది. సమాధానాలు లభిస్తాయి. కేవలం ఈ ఒక ఘట్టాన్ని మాత్రమే పరిగణిస్తే సరిపోదు, మొత్తం భారతాన్ని అంతా లెక్కలోకి తీసుకోవాలి. అధర్మపరులు, అసత్యవాదులు అయిన కౌరవుల పక్షాన నిలబడి పోరాడుతున్నాడు ద్రోణుడు. ఆయన మరణిస్తే తప్ప ధర్మాన్ని, సత్యాన్ని రక్షించటానికి వీలుకాదు. ఆయన చావాలంటే తాత్కాలికంగా కొంత అధర్మాన్ని, అసత్యాన్ని ఆశ్రయించక తప్పదు. ఆ పనినే చేయమ న్నాడు శ్రేష్టమైన ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించదలచిన శ్రీకృష్ణుడు. ఇకపోతే బ్రాహ్మణుడైన ద్రోణాచార్యుల వారు యుద్ధాన్ని చేస్తూ శత్రువులను చంపుతూ కాలం గడిపితే అది మోహమే, స్వధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్ర యించటమే. అలాగే క్షత్రియుడైన అర్జునుడు అస్త్రసన్యాసం చేస్తే, యుద్ధం చేయటానికి వెనుకాడితే, చంపటా నికి జంకితే అదీ మోహమే, స్వధరాన్ని వీడి పరధర్మాన్ని ఆశ్రయించటమే.  కేవలం మేధస్సుతో అర్థమయ్యే గ్రంథం కాదు మన మహాభారతం. అలాగే గుడ్డిగా నమ్మవలసిన గ్రంధము. ఆరాధించవలసిన గ్రంథమూ కాదు. మనలను అంతర్ముఖులుగా చేసి, ఆధ్యాత్మికము వైపు  నడిపే సద్గంధ్రమది. అందుకే వేల సంవత్సరాలు నిలబ డగల్గింది. ఇంకనూ నిలబడుతుంది. ఇది నిజం. అంతర్యామిని ఆశ్రయించి, అంతరార్థాన్ని గ్రహించి ఆధ్యాత్మి కతను పొందటం, అది మనజాతి కర్తవ్యం.                   - రాచమడుగు శ్రీనివాసులు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP