శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఉపనిషత్తులు అంటే ఏమిటి?

>> Monday, August 5, 2013

ఉపనిషత్తులు అంటే ఏమిటి?
1. జన్మరాహిత్యానికి లేక మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులంటారు.
2. ఆత్మ జ్ఞానము అని మరొక అర్థము.
3. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండుట అని ఇంకొక అర్థము.
ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి?
సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి.  అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది.
ఉపనిషత్తులను 'రహస్యం' అని ఎందుకు పిలుస్తారు?
'ఉపనిషత్' శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి 'రహస్యము' అను అర్థం.  రహస్యము అనగా తెలియడం కష్టమైనా ప్రయత్న పూర్వకంగా తెలిసికొన దగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే.  కాని దాని 'రహస్యం' అని అనం.  ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమ రహస్యం.  ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం.  ఆత్మా అనేది 'నేను, నేను' అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు.  అందుచేతనే ఇది పరమ రహస్యం, ఉపనిషత్తు.  ఈ పరమ రహస్యానికే కాకుండా, దీనిని బోధించే గ్రంధానికి కూడా ఉపనిషత్తు అని పేరు.
ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరి కొన్ని అర్థాలను వ్రాయండి?
1. జీవులలో ఉండే అవిద్య అను సంసార భీజమును నాశనము చేయునది అని ఒక అర్థం.
2. మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు జేర్చెది అని ఒక అర్ధం.
3. జన్మ, వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం.
4. అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే "గ్రంథం" అని ఒక అర్థం, ఆ గ్రంథం ద్వారా అందించ బడిన "విద్య" అని ఇంకొక అర్థం - ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి.
"ఓం శాంతిః 
శాంతిః  శాంతిః" అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి?
ప్రతి మనిషిని మూడు రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది.  వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు.

శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మిక
దుఃఖాలు అంటారు.

పంచమహా భూతాల నుండి (ఆకాశం, వాయువు, అగ్ని, జాలం, పృథ్వి), శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆదిభౌతిక
దుఃఖాలు అంటారు.

అతివృష్టి, అనావృష్టి, పిడుగు పాటు, గ్రహ బాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక
దుఃఖాలు అంటారు.

పరమాత్మ చింతనము ఈ పై మూడు రకాల
దుఃఖములను శాంతింప జేయు గాక అని ఈ శాంతి పాఠము బోధిస్తోంది.
పది ఉపనిషత్తులను గుర్తించే శ్లోకం ఏది?
ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరాః
ఛాందోగ్యమైతరేయం చ బృహదారణ్యకం తథా
శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదాహరించిన ఇంకొక ఉపనిషత్తు ఏది?
శ్వేతాశ్వతరోపనిషత్తు
నాలుగు వేదాలకు చెందిన మహా వాక్యాలేమిటి? అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి?

ఋగ్వేదం    - ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయోపనిషత్తు
యజుర్వేదం  - అహంబ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు
సామవేదం   - తత్వమసి - చాందోగ్యోపనిషత్తు
అథర్వణవేదం - అయమాత్మాబ్రహ్మ - మాండూక్యోపనిషత్తు 


[kBn sharmagaaru]
 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP