వస్తు వైభవాలు నిజమైన ప్రాప్తి కాదు
>> Thursday, August 1, 2013
July 30, 2013
మనం చేసే కృషికి ప్రతిఫలం ఎల్లప్పుడూ సమతూకంలోనే ఉంటుంది. ప్రతిఫలం అంటే ప్రాప్తి, లాభం, సంపద, పొందు అనే అర్థాలున్నాయి. ప్రాప్తి అనే మాట వినగానే ఏదో మధురానుభూతి పొందినట్టు మనసు స్పందిస్తుంది. ప్రాప్తిలో స్థూలము, సూక్ష్మము అని రెండు రకాలుంటాయి. తాత్కాలిక లాభాన్ని కలిగించేది, నశ్వరమైనది భౌతికప్రాప్తి. ఫలితం మీద దృష్టి లేకుండా తమ పనిని తాము చేసుకుపోయేవారికి సరైన ప్రాప్తి లభిస్తుంది. ఒకరి ప్రాప్తిని మరొకరు చెడగొట్టనూలేరు, పెంచనూ లేరు. దేనికైనా 'పుట్టిపెట్టాలని' పెద్దలంటారు. ఈ సృష్టిలో ఎవరి కృషి (ప్రయత్నం) కూడా వృధాపోదు. గత జన్మలో చేసిన దానధర్మాల ఫలితంగా ఈ జన్మలో ధనవంతుల ఇంట్లో పుట్టి సుఖప్రదంగా జీవిస్తారు. అందుచేత మనిషిలోని మంచి చెడులతో నిమిత్తం లేకుండా తమ వంతు ప్రాప్తిని పొందుతూనే ఉంటారు. మన కర్మలకు ప్రతిఫలంగా భగవంతుడు ప్రాప్తిని ఇవ్వక మానడు. నడిచేవాహనానికి ఇంధనం అందినట్టే కర్తవ్య నిష్ఠతో సాగిపోయే వారికి ప్రాప్తులు వాటంతటవే అందుతాయి.
మనిషిలో విషయ వికారాలు చోటుచేసుకున్నందున భౌతికమైన ప్రాప్తిని ఎంత పొందుతున్నప్పటికీ మానసికంగా రోజురోజుకూ దిగజారడం కూడా చూస్తున్నాము. గత జన్మల ఖాతాననుసరించే ప్రాప్తిని పొందడం జరుగుతుందని అందరికీ తెలుసు. అందుచేత ఫలితం మీద ఆశ లేకుండా సంతృప్తితో ముందుకు సాగాలి. సుఖదుఃఖాలు, లాభనష్టాలు ఇవన్నీ ద్వందాలు. ఒకదానితో ఒకటి వెన్నంటి ఉంటాయి. వీటిని సమదృష్టితో స్వీకరించి మనిషి తనలోని మాత్సర్యాన్ని తొలగించుకోవాలని పరమాత్ముడు అంటారు. ఈ ప్రాప్తిని పొందేవారిలో కూడా మూడు రకాలుంటారు. చేసిన దానికన్న ఎక్కువ ప్రాప్తిని ఆశించేవారు, చేస్తున్నట్టు భ్రమింపచేస్తూ ప్రాప్తిని అందుకోవాలనుకునేవారు, అసలు పనే చేయకుండా ప్రాప్తిని పొందుతామనుకునేవారు. వీరు తమ బుద్ధిని మార్చుకోలేనంత వరకు కర్మను ఇష్టపూర్తిగా చేయలేరు. ఎవరేమి చేసినా దానికి ప్రతిఫలం దైవనిర్ణయం. ఆ ప్రాప్తిని ఆనందంగా స్వీకరిస్తూ దానికి భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించాలి. సృష్టియందు శీతోష్ణాలు సహజం. శీతాకాలంలో, వేసవికాలంలో మనకు కొన్ని ప్రకృతి పరమైన సమస్యలు తప్పవు. వాటిని వద్దంటే కాలచక్రం తిరగక మానుతుందా? అలాగే జీవితంలో కూడా ఒకదాని వెంట ఒకటి ఉండే సుఖదుఃఖాలను కూడా కాదనక స్వీకరించి, కర్మభ్రష్టులం కాకుండా ముందుకు సాగిపోవాలి.
మనం అనుకున్నవన్నీ జరిగితే దేవుడున్నాడనీ, లేకపోతే లేడనే రెండు నాలుకల స్వభావం మనిషికి ప్రాప్తినివ్వదు. అలాంటివారు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలకు పాల్పడి అడ్డదారిలో ప్రాప్తి పొందాలనుకొంటారు. కాని అందులో ఎలాంటి సంతృప్తి, సంతోషాలను అనుభవించలేరు. సూక్ష్మ ప్రాప్తులనేవి శాశ్వతమైనవి. పవిత్రత, సత్యత, దయ, ప్రేమ మొదలగు దైవీగుణాలు జీవితంలో ఆచరించి ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లడం వలన అనేక రెట్లు ప్రాప్తిని పొందగలుగుతాము. శ్రీకృష్ణుని స్నేహంలో కుచేలుడు సకల సంపదలు పొందినప్పటికీ లేశమైనా అహంకారం లేకుండా యోగులను మన్నిస్తూ, పేదవారికి దానధర్మాలు చేస్తూ, స్నేహానికి ప్రతీకగా నిలిచి భగవత్ప్రాప్తికి యోగ్యుడని అనిపించుకున్నాడు. మనిషి ఎప్పుడూ తన కళ్లకు కనిపించిన దానినే ఆలోచిస్తూ ఈ వస్తు వైభవాలు, సంబంధాలు, పదవులే తన జీవిత సర్వస్వమనుకుంటారు. అయితే అసలు నిజమైన ప్రాప్తి ఏమిటి? ఆ భగవంతుని పట్ల ఎల్లవేళలా ప్రేమ కలిగి ఉండటమే నిజమైన ప్రాప్తి. ఆయన పట్ల సంలగ్నం చేసినప్పుడే జీవితంలో సంతృప్తి సంతోషాలతో పాటు పుణ్యాత్మలమై దివ్యలోక(స్వర్గ)ప్రాప్తిని పొందుతాము.
మనం అనుకున్నవన్నీ జరిగితే దేవుడున్నాడనీ, లేకపోతే లేడనే రెండు నాలుకల స్వభావం మనిషికి ప్రాప్తినివ్వదు. అలాంటివారు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలకు పాల్పడి అడ్డదారిలో ప్రాప్తి పొందాలనుకొంటారు. కాని అందులో ఎలాంటి సంతృప్తి, సంతోషాలను అనుభవించలేరు.
ం బ్రహ్మకుమారీలు
0 వ్యాఖ్యలు:
Post a Comment