జన్మరహస్యం
>> Tuesday, August 6, 2013
ధృతరాష్ట్రుని మనసు మార్చి పాండవులకివ్వవలసిన రాజ్యభాగమిప్పించి యుద్ధాన్ని నివారించటానికి విదురుడు ఎన్నెన్నో మంచి విషయాలు ధృతరాష్ట్రునకు చెప్పాడు. ఇంకా ఇంకా వినాలనుంది అన్నాడు ధృతరాష్ట్రుడు. నేను చెప్పగలిగినదంతా చెప్పాను, అంతకంటే మిన్నయైనవి సనత్సుజాతుడైతే నీకు చెప్పగలడు అన్నాడు విదురుడు. ఆయన్ను కలిసికోవటం కష్టం కదా అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు నిశ్చల మనస్కుడై క్షణమాత్రము ధ్యానించాడు. వెంటనే వారి ముందు ప్రత్యక్షమయ్యాడు సనత్సుజాతుడు. ధృతరాష్ట్రుడు, విదురుడు వినయంగా లేచి ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించారు. సనత్సుజాతుడు వారికి మృత్యువును గూర్చి, కర్మను గూర్చి, జన్మలను గూర్చి, యజ్ఞముల గూర్చి, పుణ్యలోకాలను గూర్చి, ఆత్మపరమాత్మల గూర్చి, పుణ్యపాపాలను గూర్చి, మౌనాన్ని గూర్చి, పరమాత్మ తత్వాన్ని గూర్చి వివరిస్తాడు. వేదములను గూర్చి చెబుతూ అవి పాపకర్మాచరణుని పాపంబులు తొలగించి రక్షించవు. అంతేకాక రెక్కలు వచ్చిన పక్షులు గూళ్లను విడచి ఎగిరిపోవునట్లు వేదాలు పాపకర్మాచరణుని విడచి తొలగిపోతాయని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ''మహానుభావా! వేదములు వేదవిదుని రక్షింపకున్నచో వేదాధ్య యనమును, వేదార్థ విచారంబును, వేదార్థానుష్ఠానంబును కర్తవ్యంబులను వాక్యంబుల సత్ప్రలాపంబులేయగును కదా?"యని అడుగుతాడు. (పేజి 275, ఉద్యోగపర్వము) దానికి సమాధానమిస్తూ సనత్సుజాతుడు ఇలా అంటాడు ''వేదంబులకు స్వర్గాది సాధనంబయిన యాగాది కర్మములనాచరించుటయే పరమార్ధంబు కాదు. కర్మోపాసనాదుల కంటెనతిరిక్తంబయిన బ్రహ్మ ప్రాప్త్యుపాయంబు నెఱింగించుటయే వేదంబులకు పరమార్థంబు. ఆయర్థంబు చక్కనెఱింగినవారలను" వేదంబుల రక్షించును. ''వేదతత్వంబు నెఱుంగక బుగ్యజురాది వేదములను, పురాణేతి హాసములను చదువువాడు బహువాక్యుడగును కానీ ముఖ్య బ్రాహ్మణుడు కాడు. సత్యాది లక్షణంబయిన పరమాత్మ స్వరూపంబు తెలిసినవాడే ముఖ్య బ్రాహ్మణుడగును. ''సర్వసంగ పరిత్యాగియూ ఆత్మను పరమాత్మతో అనుసంధింపవలయును. ఇదియే మౌనము. ఈవిధంబు నెఱిగినవాడే (మౌని)ముని అనదగును గాని అడవుల నిడుమలంబడి నివసించినంత మాత్రాన ముని కానేరడు. తనకును పరమాత్మకును భేదము తలంపకు కైవల్యము నొందిన యతండు మునిశ్రేష్ఠుడనబడును. ''తల్లిదండ్రుల వలన కలిగిన జన్మంబు జన్మంబు కాదు. ఆచార్యుని వలన కలిగి విద్యావశంబున కలిగిన జన్మమే జన్మము. అట్టి జన్మమే జన్మాంతర నిరాకరణ కారణంబగు, కావున శ్రేష్ఠంబగును. అట్టి జన్మకు కారణభూతుడు ఆచార్యుడు కాబట్టి ఆయన ఎడల ఎప్పుడూ భక్తిగౌరవాలుండాలి అని బోధిస్తాడు సనత్సుజాతుడు. మహాభారతంలోని ఉద్యోగపర్వంలోనున్న సనత్సుజాతీయము ధృతరాష్ట్రునికున్నట్టే మనకూ ఉన్న ఎన్నెన్నో అపోహలను తొలగిస్తుందనడటంలో సందేహము లేదు. అన్నీ వినినా మనలో రావలసిన మార్పు రాకపోతే ఇక ధృతరాష్ట్రునకు మనకు భేదమేమి? కళ్లు లేక ధృతరాష్ట్రుడు అంధుడైతే కళ్లుండీ అంధులమే అవుతాము మనమంతా. చెవులుండీ చెవుడివాడయ్యాడు ధృతరాష్ట్రుడు. మరి మనమూ అలాగే బ్రతకాలా? అంతకన్నా ఘోరమైన అంగవైకల్యము ఏముంటుంది?
- రాచమడుగు శ్రీనివాసులు
0 వ్యాఖ్యలు:
Post a Comment