శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడే అసలైన స్నేహితుడు!

>> Monday, July 15, 2013

దేవుడికి కోపతాపాలుంటాయా? మనం ఏమైనా అంటే దేవుడికి కోపం వస్తుందా? దేవుడు మనలాగే ఉంటాడా? మనలాగే ఆలోచిస్తాడా? దేవుడు మనలాగే ఉంటాడని మనం అనుకుంటాం. పొగడితే ఉబ్బిపోతాడని, విమర్శిస్తే మండిపడతాడని భావిస్తాం. దేవుడో, దేవతో కత్తులు, కఠార్లు, శూలాలు పట్టుకుని తిరుగుతుంటారని, కోపం వస్తే కళ్లెర్రజేస్తూ శూలంతో పొడిచి చంపేస్తారని సినిమాల్లో చూపించడం, మనం వాటిని నమ్మేయడం జరుగుతుంటుంది. కానీ, వీటిల్లో నిజం లేదని అనేక మంది మహాత్ముల జీవితాల్లో నిరూపితమైంది.

దేవుడిది ప్రేమతత్వం. మనుషులు చేసే తప్పొప్పులను బట్టి ఆయన మనిషి జీవితాన్ని నిర్దేశిస్తాడనే అభిప్రాయం సరికాదు. మనిషి చేసే తప్పొప్పుల ఫలితాన్ని మనిషే అనుభవిస్తాడు. ఎవరు ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి మొక్కే మొలుస్తుంది. మీకు కాళ్లూ చేతులూ, మేధ ఇచ్చిన తరువాత దేవుడు నిజానికి మీ కర్మానికి మిమ్మల్ని వదిలేశాడనుకోవాలి. మీకు కావాల్సిన జీవితాన్ని మీరు అనుభవించండి. మీకు ఇచ్చిన అవయవాలతో మీరు సంపాదించుకుంటారో, ఆనందిస్తారో, విచారంలోకి, విషాదంలోకి కూరుకుపోతారో మీ ఇష్టం.

మీ దగ్గర డబ్బులు లేకపోయినా, మీలో అనారోగ్యాలు బయలుదేరినా, ఇంట్లో ఏదైనా విషాదం జరిగినా మీరు అందుకు దేవుడిని తప్పుపట్టడం సరికాదు. మీరు సంపాదించుకోవడానికి, మీరు ఆనందంగా బతకడానికి దేవుడు ఏనాడూ అభ్యంతరపెట్టడు. నిజానికి మీరంతట మీరు బాగు పడాలనే ఆయన భావిస్తాడు. మీకు ఆయన అంతశ్శక్తిని, మనశ్శక్తిని ప్రసాదించాడు. వాటిని మీరు ఉపయోగించుకోవాలి. విల్ పవర్‌ను ఉపయోగించుకోవాలి. మీ కాళ్లూ చేతులూ, మెదడూ, కళ్లూ చెవులే మీకు పెట్టుబడి. మీరు వాటిని సక్రమంగా ఉపయోగించుకోండి, బాగుపడండి. మీ అంతట మీరు మీ పనులు చేసుకోవగలడం ఆయనకు నచ్చిన పని.

అయితే, తనను ఆశ్రయిస్తే మీకు ఆయన దోవ చూపిస్తాడు. మిమ్మల్ని గైడ్ చేస్తాడు. మీరు ఆయన సహాయం కోరవచ్చు. ఆయన స్వయంగా వచ్చి మీకు ఎటువంటి సహాయమూ చేయడు. మీకు ఆయన ఎవరి ద్వారోనో సలహా ఇవ్వొచ్చు. ఏ పుస్తకం ద్వారానో, వ్యక్తి ద్వారానో మీకు సహాయం లేదా సలహా అందవచ్చు. కాస్తంత అప్రమత్తంగా ఉంటే అది మీకు అర్థమవుతుంది. ఒక్కోసారి మీకే మీ సమస్యకు పరిష్కారం తట్టవచ్చు. మీరు కాస్తంత అవగాహనతో వ్యవహరించాలి. అంతే. మీరు ఏం చెప్పినా దేవుడు వింటున్నాడనే వాస్తవాన్ని మాత్రం మరచిపోకండి. మీకు కావాల్సిందేదో మీరు దేవుడితో లోలోపల మాట్లాడుకోవచ్చు. మీరు మాట్లాడే ప్రతి మాటనూ ఆయన వింటారు. మీకు తప్పకుండా దోవ చూపిస్తారు.

ఒక్క విషయాన్ని మీరెప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుడు మీ వెంటే ఉంటాడు. మీ సంగతిని గమనిస్తూనే ఉంటాడు. ఆయన కోసం మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ధ్యాసంతా ఆయనను పిలవడం మీదే ఉంచండి. ఆయనను ప్రార్థించడమంటే ఆయనను పిలవడమే. ఆయన పేరు తలచుకోగానే ఆయన మీ వైపు చూస్తాడు. మీ ధ్యాస ఆ సమయంలో మరో విషయం మీదకు మళ్లిందంటే, మీరు ఆయన్ని పిలిచి, ముఖం పక్కకు తిప్పేసుకున్నట్టవుతుంది. ఇది మంచి పద్ధతి కాదు కదా! మీరు ఆయనను ఓ మానవాతీత వ్యక్తిగా, ఓ మహోన్నతుడుగా పరిగణించడం కన్నా ఓ స్నేహితునిగా పరిగణించడం మంచిది. ఆయన అదే కోరుకుంటాడు. మహాత్ముల జీవిత విశేషాలను బట్టి అర్థమవుతున్నదేమిటంటే, మనం దేవుడి దగ్గరికి వెళ్లడానికి లేదా దేవుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించేకన్నా, దేవుడే మన దగ్గరికి వచ్చేలా ప్రయత్నించడం మంచిది. మనిషిలో ఆయనకు నచ్చే అలవాట్లు, లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటిని అలవరచుకుంటే దేవుడు మన చుట్టూనే తిరుగుతుంటాడు. ఆ లక్షణాలుః నిస్వార్థత, త్యాగనిరతి, నిజాయతీ, సత్యనిష్ఠ, నిష్కల్మషం. ఈ లక్షణాలను అలవరచుకుంటే మీరు ఆయనను ప్రార్థించకపోయినా ఆయన ఏమీ అనుకోడు.

ఆయన ఇంత ప్రపంచాన్ని, ఇంత జనాభాని నియంత్రించడం కుదరక, మీకు తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, అన్నగా, స్నేహితునిగా... ఇలా రకరకాలుగా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వర్తించండి. అవి దేవుడి తరఫున మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలని గుర్తుంచుకుని వ్యవహరించండి. మీ జీవితం గురించి దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఎప్పుడూ ప్రేమమయుడు. నరకడం, పొడిచేయడం, చంపేయడం, కన్నెర్ర చేయడం వంటివి ఆయన చేయనే చేయడు. మీరు ఎటువంటి తప్పు చేసినా ఆయన క్షమించేస్తాడు. వాటిని ఆ తరువాత గుర్తు కూడా పెట్టుకోడు. దేవుడిని అపార్థం చేసుకోండి. ఆయనను స్నేహితుడిని చేసుకోండి. ఆ తరువాత మీ జీవితమే మారిపోతుంది.
- పరిప్రజ్ఞానంద

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP