మీరే సృష్టికర్త కండి! - సద్గురు
>> Thursday, July 11, 2013
మీరే సృష్టికర్త కండి! - సద్గురు
July 11, 2013
ఆనంద సీమలు
ఆనందం మన శరీరంలో ఉంటే దాన్ని మనం ఆరోగ్యం, సుఖం అంటాం. అది మన మనసులో ఏర్పడితే శాంతి, సంతోషం అంటాం. అది మన భావాల్లో ఏర్పడితే దాన్ని ప్రేమ, దయ అంటాం. అది మన ప్రాణశక్తిలో ఏర్పడితే దాన్ని పరమానందం, పారవశ్యం అంటాం. అంటే, అంతరంగంలో ఒక ఆనందరూపుడైన మానవునిగా, బయటి ప్రపంచం శాంతి పూర్వకంగా, ప్రేమ భరితంగా ఉండాలనుకుంటున్నాం. మీరు కోరుకునేది ఇదే. అయితే మనం దాన్ని సూటిగా నెరవేర్చవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. దాన్ని సృష్టించడానికి మనల్ని మనం బద్ధులం చేసుకోవలసిన సమయమిది. దీని కోసం మనం చేయవలసిందల్లా ఒక్కటే. మనలో మనం శాంతియుతంగా, ఆనంద భరితంగా, ప్రేమపూర్వకంగా ఉండడమే. అందుక ని మనం ప్రతి రోజూ స్పష్టమైన ఒక ఆలోచనతో 'ఈ రోజున, మనం ఎక్కడికి వెళితే అక్కడ, ఒక శాంతిభరితమైన, ప్రేమ పూర్వకమైన ప్రపంచాన్ని సృష్టిస్తాం' అని ఆరంభించాలి. ఒకవేళ మనం, రోజుకు వందసార్లు ఓడిపోతే, వంద పాఠాలు నేర్చుకున్నట్లు. అసలు నిబద్ధుడైన మనిషికి ఓటమి అనే మాటే ఉండదు. వారికి విజయమో లేక గుణపాఠమో ఇవి మాత్రమే ఉంటాయి.
ఆ నాలుగూ కలిస్తే...
మనం నిజంగా కోరుకునేదాన్ని సృష్టించుకోవడం కోసం, మనల్ని మనం బద్ధుల్ని చేసుకున్నామనుకోండి. మన మనసు కూడా క్రమబద్ధం అవుతుంది. ఒకసారి మన మనసు క్రమబద్ధం కాగానే, మన భావోద్వేగాలు క్రమబద్ధం అవుతాయి. మన ఆలోచనల్ని అనుసరించే మన భావాలు ఉంటాయి. ఒకసారి మన ఆలోచనలు, భావోద్వేగాలు క్రమబద్ధం అయిపోతే, మన ప్రాణ శక్తులు అన్నీ క్రమబద్ధం అయితే, ఏకంగా మన శరీరమే క్రమబద్ధం అవుతుంది. ఒకసారి ఈ నాలుగు అంశాలూ ఒక దిశగా క్రమబద్ధం అయితే చాలు. అప్పుడింక మనం కోరుకునే దాన్ని అవలీలగా సృష్టించగలుగుతాం. దానికో రూపం ఇవ్వగలుగుతాం. అందుకు మన సామర్థ్యం, ఒక తార్కాణంగా ఉంటుంది. అప్పుడు మనమే ఎన్నో విధాలుగా సృష్టికర్తలం అయిపోతాం. అందుకని, ఒక స్పష్టమైన ఆలోచనతో ' ఈ రోజు నేను ఎక్కడికి వెళితే అక్కడ, ఒక శాంతిభరితమైన, ప్రేమపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను!' అనుకుని ముందుకు సాగండి.
- సద్గురు jaggi vaasudev




0 వ్యాఖ్యలు:
Post a Comment