శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విజయదీప్తి-సమయ'స్ఫూర్తి'

>> Saturday, September 8, 2012

విజయదీప్తి-సమయ'స్ఫూర్తి'


నవనవోన్మేషమైన కార్యసిద్ధిలో సమగ్రమైన విజయ అవగాహన ప్రధాన భూమికను పోషిస్తుంది. విజయపథంలో పురోగమించేందుకు కావలసిన బుద్ధికుశలత ఈ అవగాహనకు తోడై మన మనస్సును లతలా పెనవేసుకుంటుంది. కార్యసిద్ధికి విషయ అవగాహన, బుద్ధి కుశలతతోపాటు మనోయవనికపై ధీటైన సమయస్ఫూర్తి ప్రదీప్తమై ప్రభవిస్తేనే ఆ కార్యంలో జయభేరి మ్రోగించగలుగుతాం. కొందరు మాటల్లో సమయస్ఫూర్తిని ప్రకటిస్తే, కొందరు సాధనతో ఆకట్టుకుంటారు.

సమయస్ఫూర్తి అనేది ఒకరి ఉద్బోధల వల్లా, ప్రోద్బల ప్రబోధాల వల్లా ఆకళింపు చేసుకునేది కాదు. ఒక సందర్భంలో కానీ, ఒక సమయంలో కానీ మెదడులో ఒక రకమైన విద్యుల్లతల ప్రసారంలా అది వ్యక్తి మస్తిష్కానికి తట్టటం, వెంటనే సమయానుకూలంగా ప్రయోగించటం జరుగుతుంది. ఒక రకంగా దీన్ని మానవ అంతరంగంలో అప్రయత్నంగా జనించే అపూర్వ విద్యుత్తరంగం అనవచ్చు. ప్రతిభకు వ్యుత్పత్తిని జోడించి సమయస్ఫూర్తితో మురిపించి, మైమరపించి, అలరించేవాళ్లందరూ మహాత్ములు, ఉత్తముల శ్రేణికి చెందకపోయినా, ఖచ్చితంగా తెలివైనవాళ్ల కోవలో నిలిచి ఉన్నత పథాన విరాజిల్లుతారు.

కృష్ణుని నేర్పరితనం
మహాభారత యుద్ధంలో కర్ణార్జునుల మధ్య భీకర సంగ్రామం జరుగుతున్న సమయంలో కర్ణుడు శక్తివంతమైన నాగాస్త్రాన్ని అర్జునునిపై సంధించినప్పుడు రథసారథియైన శ్రీకృష్ణుడు సమయస్ఫూర్తితో అర్జునుని రథచక్రాలను ఐదు అంగుళాల లోతుకు భూమిలోనికి అణగదొక్కుతాడు. దానితో అర్జునుని కంఠానికి కర్ణుడు గురిపెట్టిన ఆ అస్త్రం గురితప్పి అర్జునుడి కిరీటం నేలకూలుతుంది.

ఈ ఘట్టంలో అర్జునుని రథసారథిగా కృష్ణుడు చూపిన సమయస్ఫూర్తి ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తుంది. ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నా, పార్థుడికి కీడు వాటిల్లుతుందనే స్పృహతో కృష్ణ పరమాత్మ తన నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. ధర్మయుద్ధంలో పరాక్రమిస్తున్న పాండవమధ్యముడైన విజయునికి అక్షయమైనరీతిలో రక్షయై నిల్చి తన స్ఫూర్తిని సమయోచితమైనరీతిలో కమనీయమైన తీరులో ప్రదర్శించాడు.

హనుమంతుని దూరదృష్టి
ఇక మాటల్లో మంచితనాన్ని చూపుతూనే ఎదుటివ్యక్తి గాయపడకుండా స్ఫూర్తి ప్రదర్శించవలసిన సందర్భాలూ కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. రామాయణంలోని ఒక ఘట్టం ఆంజనేయుని ఘటనాఘటన స్ఫూర్తికి పట్టం కడుతుంది. లంకలో అశోకవనంలో ఉన్న సీతాదేవిని దర్శించాక ఆంజనేయుడు ఆమెకు రాముని సందేశాన్ని, కుశలాదికాలను తెలియబరచి, ఆమెకు ఆహ్లాదం కలిగించి తిరిగి కిష్కిందకు ఆనందోత్సాహాలతో పయనమవబోతూ ఒక లిప్తకాలం పాటు ఆలోచించాడు. "ఇది నిజంగా మధురాతిమధురమైన క్షణమే.

సీతమ్మను దర్శించిన మహదానందం, మనోల్లాస ప్రభావం అటువంటివి. మరి, సీత జాడ కోసం పలు విధాలుగా అన్వేషిస్తూ, నిరతమూ పరితపిస్తూ జీవిస్తున్న నా ఏలిక శ్రీరామచంద్రుని క్లేశాన్ని తొలగించడమే గాక, నా రాకమీద పూర్తి విశ్వాసాన్ని కలిగించే గుర్తు ఏదన్నా సీతాదేవి నుంచి స్వీకరించి ప్రభువుకు సమర్పిస్తే బాగుంటుంది కదా'' అని మారుతికి అనిపించింది.

అనుకున్నదే తడవుగా, "ఓ సాధ్వీమణీ! నీ విభుడు శ్రీరామచంద్రునికి నీ ఆనవాలును చూపించే గుర్తుగా ఏదైనా ఇస్తే ఉత్తమంగా ఉంటుందమ్మా'' అంటూ ఆ కపిరాజు అడుగగానే ఒకింత దుఃఖంతోనే సీతాదేవి తన చూడామణిని ఆంజనేయునికి ఇవ్వడం జరుగుతుంది. ఆ చూడామణిని మారుతి నుంచి స్వీకరించి, తనివి తీరా తిలకించి, పులకించిన శ్రీరామచంద్రుడు మరుక్షణమే మహోద్వేగభరితుడై ఆనందాశ్రువులను రాల్చడం జరుగుతుంది. అంతేకాక, హర్షాతిరేకంతో మారుతిని గాఢాలింగనం చేసుకుని "నీవు నా ప్రియతమ సోదరుడైన భరతునితో సమానుడవు'' అని పలికాడు శ్రీరాముడు.

మహాత్ముని సమయస్ఫూర్తి
భారతదేశ ప్రభాసమానమైన చరిత్రలో సమయస్ఫూర్తిని ప్రకటించేవాళ్లు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఎందరో దేదీప్యమానంగా తారసపడతారు. అలనాడు కాళిదాస మహాకవి తన వాక్చాతుర్య మహిమతో, కార్యసిద్ధికి కావలసిన పాండిత్య గరిమతో అందరినీ ఆకట్టుకునేవాడట. ఇక వికటకవిగా పేర్గాంచి, కృష్ణదేవరాయల ఆస్థానంలో వినుతికెక్కిన అష్టదిగ్గజకవులలో ఒకడైన తెనాలి రామలింగని సమయస్ఫూర్తిని ఈనాటికీ కథలు కథలుగా చెప్పుకుంటున్నాం.

ఇక జాతిపిత మహాత్ముని సమయస్ఫూర్తిని ఆవిష్కరించే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక ఆంగ్లేయ దొర భారతీయులను నిష్కారణంగా పరాభవించడమే తన పరమావధిగా పెట్టుకున్నాడట. ఒకసారి ఆ దొర జాతిపిత గాంధీజీకి తటస్థపడ్డాడు. తన మాటల తూటాలను గాంధీజీ ముందు పేల్చాలనే కదనకుతూహలం అతిగా చూపిస్తూ, "మీ భారతీయులు విభిన్న వర్ణాల్లో ఉంటారు. మమ్మల్ని చూడండి. మేమంతా ఒకే రంగులో కనపడతాం'' అన్నాడట నవ్వుతూ అవహేళనగా. వెంటనే అందుకు ప్రతిగా గాంధీజీ, "అవును మీరన్నది అక్షర సత్యమే.

గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి. మరి గుర్రాలను చూడండి. రకరకాల రంగుల్లో దర్శనమిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఘనమైనదో మీకు చెప్పనక్కరలేదనుకుంటా'' అంటూ చురక వేసి తాపీగా వెళ్లిపోయారట. అంతే! ఆ దొరగారి తిక్క చటుక్కున కుదరటమే కాక, ఆనాటి నుంచి అనవసరంగా భారతీయులను నిందించడం మానుకున్నాడట. జాతిపిత అసమానమైన సమయస్ఫూర్తిని తేటతెల్లం చేసే ఇది ఒక ప్రశస్తమైన ఉదాహరణగా నిల్చిపోతుంది.

జయానికి సాధనం
సమయస్ఫూర్తి ఈ విధంగా ఉండాలని వచించగలిగేది, దాని లక్షణాలు ఇవీ అని నిర్వచించగలిగేదీ కాదు. మాటల్లో నిపుణత, చేతల్లో చతురత అందరికీ సాకారమయ్యే సాధనాలు కావు. అది ఒక అప్రయత్న పూనికలా, మేఘావృతమైన దివిలో విరిసే మెరుపులా మెరిసి ప్రహాదమయ్యే ఆహ్లాద కళిక. ఈ సమయానుకూల స్ఫూర్తి సమయానికి కార్యం సఫలమయ్యేందుకు లేదా ఎదుటివాడితో జరుగుతున్న సంభాషణలోనో, వాదనలోనో లేదా సమరంలోనో విజయం సాధించేందుకు ఉపకరించే మధురగుళిక! సమయస్ఫూర్తి సందర్భాన్ని అనుసరించి ఔచిత్యగరిమతో, మెరికలాంటి భావనతో మనసు అనే వీరుడు ధీరత్వంతో చటుక్కుని దూసే ఛురిక! సుజన జీవనుల విజయగాథలకు వికాసమద్దే తరళమైన పున్నమ చంద్రిక!

- వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP