శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగవాన్ భావధార

>> Monday, June 4, 2012

భగవాన్  భావధార

సందర్భవశాత్ భగవాన్ రమణులు, భక్తుల ప్రశ్నలకు జవాబుగా, సందేహాలకు సమాధానంగా వెలిబుచ్చిన భావాలు అతి గంభీరాలు, అనుభవ కేదారాలు, ఆనంద మందారాలు!

గురువు బయటా ఉన్నాడు, లోపలా ఉన్నాడు. బయట బోధకుడుగానూ, లోపల అంతర్వాణిగానూ ఉన్నాడు. గురువు, ఈశ్వరుడు, ఆత్మ ఒకటే. అవి మూడు స్థితులు. నిజానికి ఆత్మవిచారమూ గురువే, ఆయన అనుగ్రహించేదే. ఆ అనుగ్రహమే గురువు.

ఆత్మానుభవం కోసమే పోరాటం... "అసలు నేను''ను పట్టుకునే దాకా జరిగేదంతా పోరాటమే. పోరాటమంతా అసలుకాని దానితోనే. అంటే ఆత్మానుభవం కోసం చేసే ప్రయత్నమే. పొందేదాక పోరు తప్పదు. ఈ సాధనను సరియైన దారిలో నడిపించే గురువు లోపలే ఉన్నాడు. ఆయన మానవదేహంలోనే ఉండాలని లేదు. ఏ రూపంలో ఉన్నా గురుతత్త్వం ప్రధానం. సర్వ మతాల బోధ శాంతిని అనుభవించమనే. సమర్పణ శరణాగతి, వినయం శాంతికి మార్గాలు. మానవుడి స్వభావం శాంతే. ఆనందమే. మనతో మనం నిరంతరం కూడి ఉండగలిగితే అదే అసలైన శాంతి. పరాయి వస్తువుతో కూడి ఉన్నందున, శాంతిని అనుభవించలేకపోతాం.

నీట నిండా మునిగీ దాహం తీరటం ఎట్లా అని వగచే స్థితి అవిద్యే కదా! మంచు కొండలలో మౌనం పాటించి పుణ్యతీర్థాలలో స్నానమాడి పుణ్యక్షేత్రాలను దర్శించి వీటివలన శాంతి లభించిందని తృప్తిపడే కన్నా నీలో నీవు, నీతో నీవు ఉండగలిగితే పరమశాంతి తథ్యం. దేహం, మనసు, ఆత్మ ఈ మూడు కూడితే మనం. అందులో ఆత్మ దేనితో కలవదు. దేహం - మనసు విడిగా మనలేవు. కనుకనే దేహం వలన మనస్సు అంటే అది చేసే పనుల వలన, మనసు వలన దేహం యాతనకు గురవుతుంటాయి. ఆత్మ మాత్రం అన్ని స్థితులలోనూ అన్నివేళల స్థిమితంగా ఉంటున్నది. ప్రాపంచిక ఆలోచనలో నుంచి కర్మలో నుంచి మనమెంత దూరంగా ఉండగలిగితే మనం ఆనంద శాంతులను అంత దగ్గరగా అనుభవించగలం.

ఆత్మాన్వేషణ... ఆనంద సాధన గాని, శాంతికాముకత గానీ, నిజానికి ఆత్మాన్వేషణే. ఎందుకంటే, ఆత్మే సచ్చిదానందం కనుక. నిరంతరం మార్పు చెందుతుండే దేహానికే జననం, మరణం. మార్పెరుగని ఆత్మకూ ఈ రెండూ లేవు. అది నిత్యం, సత్యం, శాశ్వతం. మరణం అంటే మార్పే. కాలాతీతమైన ఆత్మకు మూడు కాలాలంటూ లేవు. మరణసమయంలో జీవుడు మనోభూమికలో ఏ ఆలోచనను నిలుపుకుంటాడో ఆ ఆలోచనలకు అనుగుణంగా మరొక జన్మ ఎత్తుతాడు. మూల వాసనలు నశించనంతవరకు ముక్తి లేదు. జన్మలు ఉన్నంత వరకు కర్మలు తప్పవు.

కర్మలు ఉన్నంత వరకు జన్మలుంటాయి. ఆత్మానుసంధానమే అసలు ముక్తి. జీవించి ఉండగా కలిగితే అది జీవన్ముక్తి. ఇంతకీ ఆత్మానుసంధానం సాధించటమెలా? ఆత్మానుసంధానమంతా ఒక అద్భుత అంతరంగ ప్రక్రియ. జరుగుతున్నదీ ఏం జరుగుతున్నదో కనబడుతున్నదీ... ఇదంతా ఒక ఆట. ఆటను చూస్తున్నది దేహం, మనసు. అనుభవిస్తున్నవీ ఆ రెండే. కానీ ఆటను అనుభవానికి అతీతంగా కేవలం సాక్షిగా ఉంటున్నదే, అది ఆత్మ. అదే మనం. ఆత్మానుభవం కోసం చేసే ఎడతెగని సాధనే అసలు సేవ.

ఆత్మలేనిదెక్కడ?... గురువు, భగవంతుడు, ఆత్మ లేనిదెక్కడ? గురువుతో సన్నిహితత్వం అంటూ ఏమీలేదు. తామరపువ్వు చుట్టూ కప్పలుంటాయి. ఏ అనుభవం లేకుండా ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి తేనెను అనుభవిస్తుంటాయి. ఇది అంతే. దైవం మాట్లాడవలసిన పనిలేదు. పని జరగటం ప్రధానం. ప్రయత్నించగలిగితే మౌనం ద్వారా ఎంత పని జరుగుతుందో తెలుస్తుంది. మౌని నుంచి వెలువడే మౌనతరంగాలు సర్వ సృష్టిని కదిలించగలవు.

సాధననే పరమచరమంగా భావించి ఆగిపోవటం వృధా. ఏ సాధనైనా ఆత్మానుభవానికి దారితీయాలి. అహం నశించటమే ముక్తి. అహం, తన కార్యకలాపాలను కొనసాగించటానికి దేహం కావాలి. దేహంతో కూడి ఉన్నంతసేపూ అహం 'బంధన'ను కల్పిస్తుంది. అహం వీడటమే ముక్తి. ఇన్నిన్ని అనుభవాలకు మూలమైన మనస్సును ఎరిగి, దాని స్వస్థానంలో కలుపుకోగలిగితే అంతా సచ్చిదానందమే. అదే అసలు ముక్తి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP