గురుకీర్తనమ్
>> Monday, September 17, 2012
గురుకీర్తనమ్

అరుణాచలం శివశక్తి స్వరూపమైన పార్వతీ పరమేశ్వరులుగా, భగవాన్ శ్రీ రమణమహర్షి స్కందులుగా, కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని గణపతిగా... ఇలా శివకుటుంబం భువిపై నిలచి, కైలాసమహావైభవాన్ని మన ముందు సాక్షాత్కరింపజేసింది. రమణులు, గణపతి మునిని 'నాయన' అని పిలవటంలో వారి వాత్సల్యం చిప్పిలుతుంది. తమిళదేశంలో నాయన అంటే గణపతి అని అర్థం. తపస్వి, మంత్రవేత్త, మంత్రద్రష్ట అయిన గణపతి ముని రమణులను కీర్తించిన తీరు ఒక రసాత్మకం అనుకుంటున్నప్పుడు సాధకిడి మనసు పులకాంకితం అవుతుంది. మనసు అణగుతుంది. అణకువతో నిర్మల, నిశ్చల సమాధిగతమవుతుంది. అనంత భావ సంపద, భావనారీతి, భావాతీత స్థితి, కలబోసుకున్న ప్రజ్ఞాన గీతమే శ్రీ రమణ మహర్షి చత్వారింశత్.
పరమాద్భుత కీర్తనం
1. పెనుచీకటి కావలనున్న తేజోరూపియైన ఈశ్వర దర్శనం చేయించావు. నీ దివ్యచరణారవిందాలకు వందనం. నీ చరితం పావనం. అది సర్వపాపహరం. నీవుకరుణానిధివి. అరుణాచలమే నా తలపు. భగవద్గీత నెరిగిన వాడవు. మహేశ్వరుడి మౌనరహస్య నీవు. 2. పండిత గణపతులకు నీవు గురువువు. గుణసాగరుడివి. మాయ వెనుకనున్న మహాతత్త్వం నీవు 3. అచలుడవు. ఇంద్రియములను జయించిన వాడవు. 4. ప్రాణం నిలుపుకోవటం కోసమే పొట్ట నింపుకుంటున్న వాడడవు. 5. జన్మసాగరాన్ని దాటిన వాడవు. నీ చల్లని చూపే అందరికీ అభయం.
6. యతి ధర్మాన్ని పాటిస్తూ అందర మతులను చక్కదిద్దు వాడవు. 7. మానావమానాలకు అతీతుడవు 8. అంతశ్రత్రువులను జయించిన ఆనందలహరీ విహారివి 9. అహంకార, మమతలను దాటిన వాడవు 10. ఆజ్ఞానంలో వున్న వారికి వెలుగు చూపే వాడివి 11. గోలోకవాసి వలే కౌపీన ధారివి 12. గుణాతీతుడవు, నైష్ఠిక బ్రహ్మచారివి 13. నెమలి వాహనం లేదు. స్నానం చేయటానికి దివిజ గంగ లేదు. పార్వతి లేదు. ప్రమథులు లేరు. అయినా మాయందున్న దయతో అరుణాచలానికి వచ్చావు. 14. ఆరు ముఖాలు వదిలి, వల్లీ దేవసేనలను వదిలి, మానుషవేషం ధరించినవాడవు
15. యోగివి, ప్రజ్ఞానివి, సాధువువి, గురువువి, అంతెందుకు అవనిపై అవతరించిన కార్తికేయుడివి. 16. బ్రహ్మకి, శివుడికి ఓంకారార్థం ఉపదేశించావు17. వ్యాస, శంకరుల వలె జగదాచార్యుడవు 18. ధర్మాచరణ సన్నగిల్లి, లోకాలు పాపాల పుట్టలుగా వున్న వేళ, భగవద్భక్తి పలచబడుతున్న వేళ, మానవదేహం ధరించిన నీవే సర్వులకూ శరణ్యం.19. వైరాగ్యం నీ సంపదైనా కరుణించటం మానలేదు. కర్మాచరణ లేకపోయినా ధ్యానం వీడలేదు. కోరికలెరుగని నీవు భక్తుల్ని రక్షిస్తునే వున్నావు. 20. వాదాలు నశించి వేదం నిలబడుతుంది. ధర్మం సమంగా వర్తిస్తుంది. సజ్జనులంతా ఒక్కటౌతారు. ఇదంతా నీ రాకవల్లనే. 21. నేను ఎరిగిన వాడవు. సర్వభూతములయందున్న వెలుగుగా చూచువాడవు. అనేకం నుంచి ఏకంలో నిలకడ చెందిన వాడు, గురుమూర్తియైన వాడవు.
22. లోకంలో వుంటూనే లోకాతీతంగా వెలుగొందిన వాడవు. 23. నీ శుభవీక్షణం పుణ్యప్రదం 24. నీవు గురుమూర్తివి. భేదమెరుగని అద్వైతస్ఫూర్తివి 25. జీవుడు, జగత్తు, జగన్నాథుడు ఒకటే అని బోధించావు. 26. నీ దివ్యబోధ నాకు అభేధ స్థితిని అనుగ్రహించింది 27. నీ కృపవుంటే నేనును అంతటా ఆత్మను అనుభవించగలను 28. పైకి కరుణగా కనిపిస్తున్నదంతా నీ హృదయకాంతే 29. నీ దేహకాంతి ఆత్మతళుకే 30. మనసును హృదయంతో కలిపి ఆనందరూపివైనావు 31. భగవంతుని కొలువులో వంటల వాడివై జ్ఞానాన్ని సిద్ధాన్నంగా వడ్డిస్తున్నావు. 32. పశుత్వాన్ని సంహరించి, పశుపతి తత్వం పెంచి హరుడికి నైవేద్యం ఇస్తున్నావు. 33. నీ కళ్లలోని వెలుగే సమస్తమైన చీకట్లను పోగొడుతుంది
34. నీ దివ్య పాద ద్వంద్వము సంసారులకు దయాద్వీపం 35. నీవు సాగించే సంశయహరణమంతా భవహరణమే 36. నీ నిరంతర మౌనంలోనే కాంతి శక్తి, నిష్ఠ సేదతీరుతున్నయ్. 37. నీచేసులలో శక్తి, ముఖమండలంలో మహాలక్ష్మి, మాటలలో సరస్వతి కొలువుతీరి వున్నారు. 38. నీకు దూరంగా వున్నట్లున్నా నీ కరుణకు పాత్రుడనైనాను 39. నీ కంటే ముందే ఎందరో మహామునులు అరుణాచలంలో వున్నారు. నీవు చేరుకున్న తర్వాతే అది రమణాచలమైంది
40. అనంతశాంతి, ఘనశక్తి, అద్భుత వైరాగ్యం, గాఢకరుణ, మాయాంతకమైన జ్ఞానం, మధురప్రవర్తన ఆరుముఖాలుగా వెలుగొందుతున్న నీవే మానవులకు ఆదర్శమయం. సాధకుడు, సాధన, సద్వస్తువు ఒకటే అనే అనుభవం పొందాలంటే ఎటువంటి గుణాలు, స్థితులు వుండాలో అవి రమణులయందు ఎట్లా ప్రకాశించాయో నిరూపించే పరమాద్భుత సమ్యక్ కీర్తనం ఇది.
- వి.యస్.ఆర్. మూర్తి
0 వ్యాఖ్యలు:
Post a Comment