శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అతీంద్రియ శక్తులతో గూఢచర్యం

>> Sunday, August 5, 2012

అతీంద్రియ శక్తులతో గూఢచర్యం


అతీంద్రియ శక్తులు నిజంగా ఉన్నాయా?దివ్యదష్టితో ఎక్కడో జరిగే విషయాలను మనం తెలుసుకోగలమా?ఒకవేళ దివ్యదృష్టే ఉంటే దానిని ఎలా పొందాలి? దానికున్న పరిమితులేమిటీ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటానికి అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కూడా ప్రయత్నించింది దీనికోసంస్టార్‌గేట్ పేరిట ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు డైరక్టర్‌గా పనిచేసిన ఎడ్విన్ సీమే అనుభవాలే ఈ వారం ఓపెన్ డయాస్...
సీఐఏ ఆధ్వర్యంలో 1972 నుంచి 79 వరకూ స్టార్‌గేట్ ప్రాజెక్టును స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించాం. ఈ ప్రాజెక్టుకు మూడు ప్రధానమైన లక్ష్యాలను నిర్దేశించారు. అతీంద్రియ శక్తుల సాయంతో సోవియట్ యూనియన్, చైనా, వాటి మిత్ర దేశాల నుంచి అమెరికాకు రాగల ముప్పును ముందే పసిగట్టడం వీటిలో మొదటిది. అతీంద్రియ శక్తులపై సోవియట్ యూనియన్ చేస్తున్న పరిశోధనల గురించి గూఢచారి వర్గాలు అందించే సమాచారాన్ని విశ్లేషించి దాని విశ్వసనీయతను అంచనా వేయటం రెండోది. అతీంద్రియ శక్తులకు, మౌలిక భౌతిక, మానసిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలకు ఉన్న సంబంధంపై పరిశోధనలు చేయటం మూడో లక్ష్యం.. ఆర్థిక సాయం అందించటానికి ఆధునిక సైనిక వ్యూహకర్తలు తటపటాయించారు. ప్రచ్ఛన్న యుద్ధం ఊపుమీదున్న సమయంలో సెనేటర్ విలియం ఫ్రాక్సీమైర్ 'గోల్డెన్ ఫ్లీస్' అనే ఒక అవార్డును ప్రవేశపెట్టాడు. సిల్లీ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వాధికారులను ఎగతాళి చేయటానికి ఈ అవార్డును ఉపయోగించేవారు. అతీంద్రియ శక్తుల ప్రాజెక్టు మీద ఎవరికీ పెద్ద నమ్మకం ఉండేది కాదు. ఒక వైపు నమ్మకం లేకపోవటం, మరో వైపు గోల్డెన్ ఫ్లీస్ అవార్డు ఇస్తారెమోననే భయంతో ప్రభుత్వాధికారులు స్టార్‌గేట్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించటానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఈ కారణాల వల్ల స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ప్రాజెక్టును మూసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును సైన్స్ అప్లికేషన్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్ఏఐసీ)లో ప్రారంభించాం.

1981, డిసెంబర్ 17వ తేదీన ఇటలీలోని వెరోనా అనే ప్రాంతం నుంచి అమెరికా సైనిక బ్రిగేడియర్ జనరల్ డోజియర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మా దగ్గర పనిచేసే జాన్ మెక్‌మోనియాగే అనే పరిశోధకుడి ద్వారా జనరల్ డోజియర్ ఎక్కడ ఉన్నాడో అతీంద్రియ శక్తులను ఉపయోగించి తెలుసుకున్నాం. జాన్ తన దివ్య దృష్టిని( రిమోట్ వ్యూయింగ్) ఉపయోగించి డోజియర్ ఉన్న ప్రాంతాల చిత్రాలను గీశాడు. వృత్తాకారంలో ఉన్న ఒక పార్కు, దాని మధ్యలో ఉన్న ఒక చర్చి సమీపంలో డోనియర్ ఉన్నాడని జాన్ కనుగొన్నాడు. జాన్ అందించిన సమాచారం ఆధారంగా గూఢచారి విభాగపు అధికారులు అలాంటి భవనాల కోసం మ్యాపులు, చిత్రాల ద్వారా వెతికారు. పడువా అనే పట్టణంలో అలాంటి నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. తర్వాత ఆ ప్రాంతంలోనే డోజియర్‌ను గూఢాచార విభాగపు అధికారులు రక్షించగలిగారు. ఆ తర్వాత డోజియర్‌కు ఈ ప్రాజెక్టు గురించి సవివరంగా తెలియజేశాం. జాన్ దివ్యదృష్టితో చూసి చెప్పిన విషయాలు, డోజియర్ అందించిన వివరాలు ఒకే విధంగా ఉన్నాయి. దీనితో డోజియర్ ఈ ప్రాజెక్టు పట్ల చాలా ఆసక్తి చూపారు.

1986లో అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ అతీంద్రియ శక్తుల పరిశోధనపై ఆసక్తి చూపించటం మొదలుపెట్టింది. రక్షణ పరికరాలకు సంబంధించిన వివరాలను దివ్య దృష్టి ద్వారా తెలుసుకోవచ్చా? అనే విషయాన్ని పరిశోధించటానికి మాకో ప్రాజెక్టును అప్పగించారు. మేము చేస్తున్న ప్రాజెక్టు గురించి, దాని వెనకున్న ఉద్దేశాల గురించి ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ప్రాజెక్టులో పాల్గొనే పరిశోధకులకు కూడా తాము ఆయుధ వ్యవస్థ గురించి శోధిస్తున్నామనే విషయం తెలియదు. ఈ ప్రాజెక్టు నడిచే పద్ధతి కూడా చాలా ఆసక్తికరంగా ఉండేది. ప్రాజెక్టులో పాల్గొనే పరిశోధకులకు ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇచ్చేవాళ్లం. ఆ నెంబర్ ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడో పరిశోధకులు కనుగొనాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ నెంబర్ ఉన్న వ్యక్తి, ఎయిర్‌ఫోర్స్ అధికారులు ముందే నిర్థారించిన ఆయుధ వ్యవస్థల దగ్గర ఉండేవాడు. అతని పరిసరాలను పరిశోధకులు దివ్యదృష్టి ద్వారా చూసి చిత్రాలు గీసేవారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులు అందించిన కొన్ని పత్రాలను నింపేవారు. ఈ పత్రాల్లో కొన్ని టేబుల్స్ ఉండేవి. ఈ టేబుల్స్ విశ్లేషిస్తే... ఆ ఆయుధ వ్యవస్థ ఉన్న స్థలం గురించి, అక్కడ వెలువడుతున్న శక్తి గురించి, ఇతర అంశాల గురించి తెలుస్తుంది.

వాస్తవానికి ఎయిర్‌ఫోర్స్ అధికారుల వద్ద ఈ ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన వివరాలు ముందే ఉండేవి. తమ వద్ద ఉన్న సమాచారాన్ని, దివ్యదృష్టితో పరిశోధకులు రూపొందించిన సమాచారాన్ని పోల్చి చూడటానికి ఎయిర్‌ఫోర్స్ అధికారులు కంప్యూటర్లను ఉపయోగించేవారు. కంప్యూటర్లు ఈ సమాచారాలలో ఉన్న సామ్యాలను, తేడాలను తేల్చి చెప్పేవి. ఉదాహరణకు న్యూమెక్సికో ఎడారిలో శాండియా నేషనల్ లాబొరేటరీ ఉంది. దీనిలో 'ప్రాజెక్ట్ రోజ్' పేరిట అత్యంత శక్తివంతమైన మైక్రోవేవ్ ఆయుధ వ్యవస్థను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఆయుధ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొనే పనిని జాన్‌కు అప్పగించాం. జాన్ ఈ ఆయుధ వ్యవస్థకు సంబంధించిన టేబుల్స్ నింపాడు. ఎయిర్‌ఫోర్స్ వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూసినప్పుడు జాన్ 80 శాతం సమాచారాన్ని కచ్చితంగా అందించాడు.


కొత్తపుస్తకం
థింకింగ్ ఎన్యూ
సంపాదకులు ః సుధీర్ కాకర్ ,జెఫ్రీ జె క్రుపాల్ 

[ఆంధ్రజ్యోతి డైలీ నుండి]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP