శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కంచె ఐలయ్యగారి ప్రకారం--- ప్రతి హింసే పరిష్కారమా?

>> Saturday, August 4, 2012

ప్రతి హింసే పరిష్కారమా?
- యద్దనపూడి వెంకటరత్నం యాదవ్

మనుషుల మనసుల్లో మానవత్వం పరిమళించకుండా సంఘంలో సహజీవనం సాధ్యం కాదు. అందుకు మేధావులు, విజ్ఞులు - సమాజానికి శాంతిని, ప్రేమను బోధించాలే గానీ, పగ, ప్రతీకారాలను కాదు... హిందూ మతంలో ఐలయ్యకు నమ్మకం లేకపోతే, ఆయన ఆ హిందూ దేవుళ్ళను ప్రార్ధించడం మానుకోవచ్చు. అంతేగానీ శతాధిక హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ దేవుళ్ళను హేళన చేసే హక్కు ఐలయ్యకు లేదు.

'కుల దొంతర్లలో పై కులం క్రింది కులం వారిని ఎందుకు చంపగలుగుతుంది? కింది కులం పై కులం వారిని ఎందుకు చంపలేదు? ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది?' - లక్షింపేట దళితుల హత్యాకాండ నేపథ్యంలో 'దళితులు ఏం చెయ్యాలి?' (జూలై 13, 'ఆంధ్రజ్యోతి') అన్న వ్యాసంలో కంచె ఐలయ్య వ్యాఖ్యలవి. కారణాలు ఏమైనా లక్షింపేట హత్యాకాండ ముమ్మాటికీ అమానవీయమే. ఈ హత్యాకాండను సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. ముఖ్యంగా బీసీలు, అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన ఈ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దురాగతం ఆధారంగా ఐలయ్య తనకు మాత్రమే సాధ్యమైన హిందూ మత వ్యతిరేక వ్యాఖ్యలతో చెలరేగిపోవడం అత్యంత దురదృష్టకరం. అసలు 'చంపడం' అనేదే అమానవీయమైన విషయమైనప్పుడు, చట్టపరంగా నేరమైనప్పుడు, ఎవరు ఎవరిని చంపినా అది ప్రజాస్వామ్య దేశంలో శిక్షార్హమే కదా!

'పై కులంవారు, క్రింది కులం వారిని చంపగలుగుతున్నారు' అంటున్నారు ఐలయ్య. ఆయన చెప్తున్నదే వాస్తవమైతే నిచ్చెన మెట్ల వ్యవస్థలో పై మెట్టుపై ఉన్న బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు - తమ కన్నా క్రింది మెట్టుపై ఉన్న శూద్రులను చంపుతూ ఉండాలి కదా! మరి అలా జరుగుతుందా? లేదు కదా! కారంచేడు, చుండూరు సంఘటనలు - శూద్ర కులాల్లో ప్రాబల్య వర్గాల వారి దాడులనేవి గమనార్హం. లక్షింపేట ఘటన ఒకే కులానికి చెందిన తూర్పు కాపులు చేసిన దాడిగా చూడాలి.

అంత మాత్రన దాన్ని బీసీలందరికీ అనువర్తింప చేయడం ధర్మం కాదు. తరతరాలుగా కుల వృత్తులలో మ్రగ్గిపోయి, దళితులతో పాటు అణచివేతకు గురై, అన్ని రంగాలలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయి, దీనంగా హీనంగా బ్రతుకుతున్న బీసీ వర్గాలన్నిటినీ, ప్రాబల్య వర్గాల సరసన జమకట్టి, బీసీలు - దళిత వ్యతిరేకులన్నట్లు చిత్రించడం అన్యాయమైన విషయం. ఒక వ్యక్తి దురుసుతునానికి గానీ, ఒక కులం దురుసుతునానికి గానీ, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ శక్తి సామర్థ్యాలు, వారి ఆలోచనా ధోరణులు కారణమవుతాయి తప్ప, ఐలయ్య చెప్తున్నట్లు ఆధ్యాత్మిక బలం కారణం కానే కాదు.

నిజమైన ఆధ్యాత్మిక బలమున్న వ్యక్తులు, మానవ సహజమైన అసూయా ద్వేషాలకు, భౌతిక ఆధిపత్య భావాలకు అతీతంగా ఉంటారని, వారు సర్వ మానవ శ్రేయస్సును ఆకాంక్షిస్తారనే ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా, ఆధ్యాత్మిక బలానికి వక్ర భాష్యం చెప్తున్న ఐలయ్య విశ్లేషణ అర్థరహితం. ఆయన లెక్క ప్రకారమైతే ఆధ్యాత్మిక బలం బ్రాహ్మణుల్లోనే అధికం కదా! మరి ఆ బలంతో, వాళ్ళు ఎవరినీ చంపడం లేదు కదా! దీన్ని బట్టి ఐలయ్య వ్యాఖ్యలు శుద్ధ తప్పు అని అర్థమవుతుంది.

'ఆస్తులు, చదువు, అధికారాన్ని అనుభవించే సత్తా కూడా దొంతర్ల వారీగానే ఉంటా'యని ఐలయ్య అన్నారు. మన రాష్ట్రంలో అగ్రకులాలైన బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు (వివిధ రంగాలలో) ఏ స్థాయిలో ఉన్నారు? శూద్రకులాలలోని ప్రాబల్య వర్గం వారు ఏ స్థాయిలో ఉన్నారు? ఆయన చెప్తున్నట్లుగా పై కులం వారే అన్నీ అనుభవిస్తున్నప్పుడు, రాజ్యాధికారం కూడా బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండాలి. కానీ కనుచూపు మేరలో వారికి ఆ అవకాశమే కనిపించడం లేదే!

'కుల హత్యలకు పరిష్కారం రాజ్య రెస్పాన్స్‌లో లేదు' అంటున్న ఐలయ్య ప్రజాస్వామ్యదేశంలో దీనికి పరిష్కారం - ప్రతి హింసలో ఉందని చాటదలుచుకున్నారా? రక్తానికి రక్తం, హింసకు హింసే పరిష్కారమైతే - మరి మన రాజ్యాంగానికి, మన చట్టాలకు అర్థమేమిటి? ఏ కులానికా కులం 'కులసేన'ను ఏర్పాటు చేసుకొని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ, హత్యాకాండను కొనసాగించినప్పుడు దాన్ని ప్రజాస్వామ్యం అనగలమా? బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, డాక్టర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా ఉండి, 389 మంది భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు రూపొందించిన మన రాజ్యాంగానికి విలువేలేదని ఐలయ్య చెప్పదలుచుకున్నారా? ఈ వికృత భావాలను విజ్ఞులు, ప్రజాస్వామిక వాదులు ఆమోదించగలరా?

ఎంతో ఆవేదనలో, దుఃఖంలో ఉన్నప్పటికీ లక్షింపేట ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సైతం, నేరస్థులను చట్టపరంగా విచారించి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారే గానీ, ప్రతిహింసను గురించి గానీ, దళిత మిలీషియాలను గురించి గానీ, దళితులు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం - వారి సంయమనానికి నిదర్శనం. ఐలయ్య మాత్రం ఎల్లలులేని వెర్రి ఆవేశంతో విపరీత వ్యాఖ్యానాలు చేయడం క్షంతవ్యం కాదు. ఒక హత్య, మరో హత్యకు దారితీస్తుందే గానీ, శాంతినీ, క్రాంతినీ ప్రభవింపనీయదని చరిత్ర చెబుతున్న చేదు నిజం. ఈ చరిత్ర తెలిసికూడా, చట్టాన్ని ధిక్కరించి ఆ విపరీత వికృత పరిస్థితులను ఈ రాష్ట్రంలో సృష్టించాలని ఐలయ్య కోరుకుంటున్నారనుకోవాలా? ఒక గ్రామంలో జరిగిన అమానవీయ సంఘటనను భూతద్దంలో చూసి, బీసీలంతా దుర్మార్గులన్న భావనను ప్రచారం చేయడం మంచిది కాదు. అణగారిన వర్గాలు, ఒకరినొకరు అపనమ్మకంతో చూపుకుంటూ ఘర్షణాత్మక పరిస్థితులు రూపుదాల్చడం ఈ వర్గాల సమష్టి ప్రయోజనాలకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.

మనసుల్లో ఆత్మీయానురాగాలు లేనప్పుడు కులాల మ«ధ్యే కాదు, ఒకే కులంలోనూ, ఒకే ఇంట్లోనూ యుద్ధాలు జరుగుతాయి. ఒకే కులంలోని యాదవులు తమలో తాము పోట్లాడుకొని నాశనం కాలేదా? అన్నదమ్ములైన పాండవులు, కౌరవులు యుద్ధంచేసి నాశనమై పోలేదా? ఒకే మతస్థులైన ముస్లింలు అనేక దేశాల్లో తమలో తాము కొట్టుకుంటూ చనిపోవడం లేదా? ఎక్కడి దాకో ఎందుకు - రాయలసీమ ప్రాంతంలో ఒకే కులం వాళ్లు తమను తాము చంపుకోవడం లేదా? ఈ మారణకాండకు కారణమెవరు? మనుషుల మనసుల్లో మానవత్వం పరిమళించకుండా సంఘంలో సహజీవనం సాధ్యం కాదు.

అందుకు మేధావులు, విజ్ఞులు - సమాజానికి శాంతిని, ప్రేమను బోధించాలే గానీ, పగ, ప్రతీకారాలను కాదు. ఐలయ్య చెప్పిన 'ఇజ్రాయిల్ - ఈజిప్టు' ఉదాహరణ ఒక కథేగానీ, చరిత్ర కాదని ఆయన తెలుసుకోవాలి. ఇది కథ కాదనడానికి ఆయన ఏ విధమైన చారిత్రక ఆధారమైనా చూపగలరా? హిందూ దేవుళ్ళ కథలను, ఇతిహాసాలను కట్టుకథలని కొట్టిపారేస్తున్న ఆయన, తాను చెప్పే కథను మాత్రం - చరిత్ర అని చెప్పడం హాస్యాస్పదం. దేవుడు లేక దైవ సంబంధమైన కథలు, ఆయా మతాల వారి విశ్వాసానికి సంబంధించినవిగా భావించి గౌరవించాలే గానీ, ఆయా మతాల వ్యక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం అత్యంత దారుణం. ఈ వికారం ఐలయ్య ఒక్కరికే సుసాధ్యం.

"హిందూ దేవుడి పేరుగా ఉన్న 'నరసింహుడు' చెడ్డపేరుగా చూడబడదు'' అంటూ "ప్రతి పై కులస్తులూ తమ క్రింది కులస్తులకు 'నరసింహులే''' అంటున్నారు ఐలయ్య. కమ్మ, రెడ్డి, వెలమ, కాపులు మొదలైన శూద్ర కులస్తులకు, అగ్రకులస్తులైన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులస్తులు - నరసింహులుగా కనిపిస్తున్నారని ఐలయ్య చెప్పగలరా? అందుకు ఒక్క ఉదాహరణ చూపగలరా? 'నరసింహుడు' అనే హిందూ దేవుడి పేరు చెడ్డపేరుగా ఎందుకు కనిపించాలో ఆయన సమాజానికి వివరించాలి. వర బలంతో విర్రవీగుతూ, సన్మార్గులను హింసించే హిరణ్య కశ్యపుని వంటి రాక్షసుణ్ణి సంహరించేందుకు, విష్ణుమూర్తి-నరుడు, సింహం కలిసిన నరసింహుడిగా అవతరించి, హిరణ్య కశ్యపుణ్ణి సంహరించడం - అందరికీ తెలిసిన కథే. హిరణ్య కశ్యపుడి కన్నకుమారుడే నరసింహస్వామిని ప్రస్తుతించినప్పుడు, నరసింహుడు ఎలా చెడ్డవాడో, ఆయన పేరు ఎలా చెడ్డదో - ఐలయ్య ఈ సమాజానికి వివరించాలి.

"దేవుళ్ళే 'నరసింహులు'గా ఉన్నప్పుడు, వారిని అనుసరించే మానవులు నరరూప దయ్యాలౌతారు'' - అనడం ఐలయ్య బరితెగింపుకు నిలువెత్తు తార్కాణం. హిందూ దేవుళ్ళలోని ప్రతి అవతారం పరమార్థం - దుష్టశిక్షణ, శిష్టరక్షణ మాత్రమే. 'ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అని చెప్పిన శ్రీకృష్ణ భగవానుని దివ్యబోధను అర్థం చేసుకోగలిగితే, హిందూ దేవుళ్ళ, హిందూ మతం గొప్పతనం, పవిత్రత - అర్థమవుతాయి. ఇంతటి పవిత్రమైన హిందూ ధర్మానికి విరుద్ధంగా వెకిలి వ్యాఖ్యలు చేయడం - ఐలయ్య ఒక్కరికే చెల్లింది.

హిందూ మతంలో ఆయనకు నమ్మకం లేకపోతే, ఆయన ఆ హిందూ దేవుళ్ళను ప్రార్ధించడం మానుకోవచ్చు. అంతేగానీ 100 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ దేవుళ్ళను హేళన చేసే హక్కు ఐలయ్యకు లేదు. ఏ ఇస్లాం దేశంలోనైనా, ఏ మతస్తుడైనా, ఇస్లాం మతాన్ని కించపరిచే చిన్న వ్యాఖ్య చేస్తే, అతడు మరునాటి సూర్యోదయాన్ని చూడలేడనేది జగద్విదితం.

దళితులకు భూమి, ఇళ్లు, చదువు కావాలంటున్నారు ఐలయ్య. ఇవి కావాల్సింది కేవలం దళితులకే కాదు, ప్రతి పేదవాడికీ కావాలి. అయితే వీటిని చట్టబద్ధంగా, రాజ్య పరిమితులకు లోబడి సాధించుకోవాలి. ప్రజలందరికీ సమన్యాయం చెయ్యడం - ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం. ఐలయ్యకు చేతనైతే, దళితుల కన్నా ఎంతో వెనుకబడి ఉన్న బీసీల సర్వతోముఖాభివృద్ధికి ఉద్యమాలు చేసి, పోరాడి, బీసీల ఆరాధ్య దైవంగా ఎదగాలి. అంతే గాని, హిందూ మతంపై, హిందూ దేవుళ్ళపై అనవసరపు వ్యాఖ్యలు చేసి బీసీలకు తలవంపులు తేవద్దని, ఆయన తన తెలివితేటలను, సమయాన్ని జీవితాన్ని అనవసరమైన విషయాల కోసం వృధా చేసుకోవద్దని, బీసీలు కోరుకుంటున్నారు.
- యద్దనపూడి వెంకటరత్నం యాదవ్
అధ్యక్షులు, బీసీ మేధావుల సంఘం

5 వ్యాఖ్యలు:

voleti August 4, 2012 at 10:02 PM  

అలాంటి చెత్త వెధవలు రాసే రాతలకు మీరు స్పందించక్కరలేదు..ఇంత పెద్ద ఆర్టికల్ రాసి వీళ్ళకి మీరు ప్రాధాన్యత కల్పించిన వాళ్ళు అవుతారు.. అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల... చెత్త కుప్పల పక్క నుండి ముక్కు మూసుకుని వెళ్ళాలే గాని, వాసన పీల్చి మనం బాధ పడకూడదు.. మంచి గంధం లాంటి హిందూ మతానికున్న పవిత్రతను చెడగొట్టే దుర్వాసన లు ఎన్ని వున్నా..గంధం చెరగదు.. అరగదు.. మీలాంటి మంచి మనసున్న భక్తులు వున్నంత కాలమూ..

dhupam abhi June 2, 2013 at 11:11 AM  

దుర్గేశ్వర గారూ హిందువులుగా మనం చేస్తున్న తప్పులే కంచె ఐలయ్య వంటి అజ్ఞానులను. మేధావులను చేస్తున్నాయి. కులం,వర్ణం రెండూ ఒకటే అంటూ మనం అపోహలకు గురవుతున్నాము. వాస్తవానికి కులం, వర్ణం అనేవి వేరు వేరు అంశాలు. వాటిమధ్య తేడాలను మనం ప్రజలకు తెలియజెప్పక పోవడం వల్లనే ఐలయ్య వంటివారు పేట్రేగి పోతుంటారు. పై వ్యాసం లో వెంకటరత్నం యాదవ్ గారికి కూడా రెండింటికి తేడా తెలిసినట్లు లేదు.

రావణుడు రాక్షసుడా, రాజ్యాన్ని పాలించాడు కాబట్టి క్షత్రియుడా, బ్రహ్మజ్ఞాని కాబట్టి బ్రహ్మణుడా?

మొదట క్షత్రియుడుగా వున్న విశ్వామిత్రుడు తరువాత బ్రహ్మర్షి అయ్యాడు మరి ఆయన క్షత్రియుడా? లేక బ్రహ్మణుడా? మరి ఆయన కులం ఏమిటి?

ఎవడు శూద్రుడుగా పుడతాడు, ఎవడు ద్విజుడవుతాడు? ఎవడు విప్రుడవుతాడు? ఎవడు బ్రాహ్మణుడవుతాడు? అని మన ధర్మ శాస్త్రాలలో చాలా విపులంగా వుంది. వాటిని విపులీకరించి చెప్పాలిసిన మనం ఎప్పుడైతే మన స్వార్థం కొరకు వర్ణాలను కులాలను చేశామో ఆ వెను వెంటనే అవమానాలను కూడా వెంట పెట్టుకోవాల్సి వచ్చింది.

మనం ఏదైతే చెస్తామో దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు కదా...

Chandrasekhar Durge July 2, 2013 at 5:01 AM  

ప్రియమైన సోదరులారా , అందరు ఎవరికీ తోచింది వారు చాల బాగా చెప్పారు. "రామాయణం" కాని "నేను హిందువునెట్లయిత?" కాని రెండు కుడా గ్రంధాలే . ఒకటి వాల్మికి గారు వ్రాసారు ,రెండవది కంచ ఐలయ్య గారు వ్రాసారు. మనం చదివే పద్ధతి మీద అర్థం తెలుస్తుంది రచయిత యొక్క భావం. నమ్మకంతో చదివితే అ పుస్తకాలలో ఏముందో అదే నిజం అనిపిస్తుంది కాని కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . రెండు పుస్తకాలు ఒకే ధోరణిలో చదవాలి కాని చాలామంది అల చెయ్యరు . రామయనంను కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే రావణుడు అహింస వాది గాను రాముడు హింస వాది కనిపిస్తాడు. ఎలాగంటే రాముడు మరియు లక్ష్మణుడు కలిసి సుర్పనఖ యొక్క ముక్కు కోసి ఒక ఆడవారి మీద హింస ప్రవృత్తి అని చెప్పవచు , అదే ఈరోజు అయితే మహిళాలోకం రాముని కటకటాల పలు చేసే వారు. అదే రావణుడు చిసింది చుస్తే , సీతా ని అపహరించినాడు (kidnap ) చేసాడు తన చెల్లె కి చేసిన అపమానానికి , కాని సీతా మీద ఎలాంటి మాన , ప్రాణాలను , శారీరక హింసలు కాని పెట్టలేదు , రావణుడు ఒక ప్రజాసామ్య పాలనను పాలించాడు కాబట్టి మహిళలకు ఉద్యగాలు ఇచ్చినాడు ఆరోజులలో , లంకిణి ఒక security officer , ఆమెను చంపి లంక కాలు పెట్టినారు , అంటే మహిళలను హిమ్చ్సించే నాటే .
ఫై విధనగా ఎవరికీ తోచింది వారు చెప్పడానికి ఒక కారణం వుంది నీను ఎవరిని తప్పు పట్టాను ఎందుకంటే మనం చదేవే చదువు మీద బ్రాహ్మన్ వాదాం రుద్దబడి వుంది . మనిషి మనిషి గ బతకండి , ఎ పుస్తకమైన నమ్మకం తో చదవకండి , మీ మనసు తో వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . జై భీమ

durgeswara July 2, 2013 at 10:19 AM  

పిచ్చికుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట . ఇలాఉంది మీవిశ్లేషణ చన్ద్రశేఖర్ గారూ

శ్యామలీయం July 2, 2013 at 10:46 AM  

చంద్రశేఖర్

వింతవాదనలు టానికి బాగానే ఉంటాయి. కాని వాటిలో పస ఉండదు.

రామలక్ష్మణులు సీతను చంపవచ్చిన శూర్పణఖను ప్రాణాలతో వదిలారు విరూపను చేసి. అది మీ దృష్టిలో హింసావాదం. మరి యేమి చేసి ఉండాలో మీ‌మెప్పు పొందటానికి?

రావణుడు సీతను హింసించలేదని మీ‌ వాదం. మానసికంగా హింసించటం హింసకాదన్న మాట మీ‌ ఉద్దేశంలో. అతడు సీత పట్ల అంతటితో ఆగటానికి కారణం అతడి ఔదార్యం కాదు - బ్రహ్మ శాపభయం. పూర్వం పుంజికస్థల అనే అప్సరసను అతడు అత్యాచారం చేసి వివస్త్రగా వదిలితే ఆవిడ బ్రహ్మకు మనవి చేసుకుంది అలాగే పోయి. దానితో మఋఏ స్త్రీనైనా బలవంతం చేస్తే తలపగిలి మరణిస్తావని బ్రహ్మగారు శపించారు.

ఇకపోతే విశ్లేషణాత్మకంగా చదవటం అంటే మీ బోంట్లు మొదట మూలగ్రంధాలను అధ్యయనం చేయాలి మరెవరికో వంతపాడటం‌ కాదు చేయవలసింది.

రావణుడు ప్రజాస్వామ్యం పాటించాదనటానికి ఏ‌ ఆధారమూ లేదు. కాస్త రామాయణం చదివితే రావణుడు యెవరిమాటా వినే రకం‌ వాడు కాదని సులువుగానే బోధపడుతుంది మరి.

ఎవరూ ఏవాదమూ మీమీద రుద్దటం లేదు. మీరే తగినంత భాషాజ్ఞానం సంపాదించి మూలాలు అధ్యయనం చేసి స్వయంగా నిజానిజాలు గ్రహించండి. పైపై చదువుతో కాదని కూడా ముందే గ్రహించుకోండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP