శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధర్మానికి వారసులు కావాలి!

>> Thursday, June 14, 2012


ధర్మం క్షీణిస్తుంది! ధర్మం అడుగంటుతుంది..! ధర్మం అంతరించిపోతుందని ఆవేదన చెందుతూ కూర్చుంటే ధర్మం వృద్ధి చెందుతుందా? ధర్మాన్ని రక్షించడమంటే ధర్మాన్ని ఆచరించడమే! అందుకే ధర్మాన్ని రక్షించాలనుకునేవాళ్లకంటే ధర్మాన్ని ఆచరించేవారే మనకు కావాలి.

వస్తువు పాడుకాకుండా రక్షించుకునేందుకు ప్రయత్నిస్తాం! ఏదైనా ఇబ్బందితో సతమతమౌతున్న వ్యక్తిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం! కానీ, ధర్మాన్ని రక్షించుకోవాలంటే, అది కంటికి కనపడేది కాదు, అందుబాటులో దొరికే వస్తువూ కాదు. ధర్మానికి వస్తువులాంటి రూపమూ లేదు. మనిషిలాంటి ఆకృతీ లేదు. ధర్మమనేది ఓ పటిష్ఠమైన వ్యవస్థ. అది ఒక సైద్ధాంతిక తత్త్వం. దీనిని రక్షించాలనుకునేవాళ్లు ముందుగా దానిపట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. అవగాహనతో మాత్రమే పరిమితి చెందక, దానిని ఆచరించిననాడే ధర్మానికి స్థిరప్రతిష్ఠ చేకూరుతుంది. కాబట్టి ధర్మరక్షణ...ధర్మరక్షణ అంటూ నినాదాలు చేయడం కాకుండా ధర్మాన్ని అవగాహన చేసుకోవడం, అవగతమైనదాన్ని ఆచరించడం, దానిని ఇతరులకు అందించడమే ధర్మరక్షణకు ప్రధానమైన అంశాలు.

దర్మాచార్యులదే బాధ్యత
సమజాంలో చదువుకున్నవాళ్లు, సంపన్నులు మాత్రమే హిందువులనుకుంటే చా.....లా ప్రమాదమేర్పడుతుంది. హిందుత్వభావన అట్టుడుగు వర్గాలలోనుండి స్పందన కలగాలి. అట్టడుగు స్థాయివారిలో హిందూ శబ్దం పట్ల, హిందూ ఆచార వ్యవహారాల పట్ల కనీసం హిందూత్వం పట్ల కూడా అవగాహన లేకపోవడం శోచనీయాంశం. ఇందుకు కారణాలు ఏవైనా, ఎన్నయినా, ప్రస్తుతం హిందూధర్మం ప్రతిష్ఠకు ధర్మాచార్యులే బాధ్యత వహించాలి. నడుం బిగించాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, మండలాలు ఇలా...మూలమూలలా హిందుత్వాన్ని, హైందవ ధర్మాన్ని పెంపొందించే దిశగా అట్టడుగు వర్గాలలో అవగాహన కలిగించగలిగితే ప్రతి ఒక్కరూ హిందూత్వాన్ని సొంతం చేసుకోగలరు.

జీవన విధానమే ధర్మం
ప్రయాణించే ఓ వ్యక్తి మార్గమధ్యంలో నాలుగురోడ్ల మధ్యలో నిలబడి అటూ, ఇటూ దిక్కులు చూసి ఏదైనా ఫరవాలేదు అనుకుని ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేస్తే, తాను చేరవలసిన గమ్యాన్ని ఎన్నటికీ చేరలేడు. ప్రప్రథమంగా తాను చేరాలనుకునే గమ్యం పట్ల, గమ్యాన్ని చేర్చే మార్గం పట్ల కూడా సరైన అవగాహన కలిగి ఉండాలి. జీవిత లక్ష్యాన్ని చేరేందుకు సూచించిన మార్గమే ధర్మం! దీనినే జీవనవిధానం(లైఫ్ స్టయిల్) అని అంటారు. ఇది ఓ పటిష్ఠమైన వ్యవస్థగా ఏర్పాటు చేసి మనకు అందించారు ఋషులు. అటువంటి ఈ ధర్మాన్ని అవగాహన చేసుకుని, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమన్వయ పరచగలిగే దార్శనికుడే ధర్మాచార్యుడు. ఇతడే సమాజానికి సరైన దిక్సూచి కాగలడు.

ధార్మికులు కనుమరుగు
వర్తమాన సమాజంలో దార్శనికులైన ధర్మాచార్యులు, ధార్మికులు తరిగిపోతున్నారు. తద్వారా ధర్మానికి వారసులు కనుమరుగౌతున్నారు. ధనానికి వారసులు కుప్పలు తెప్పలుగా తయారవుతున్నారు. కోటానుకోట్లకు పగడలెత్తి దానిని కాపాడుకునేందుకు, తపనతో వారసులను తయారు చేసుకునే పనిలో తలమునకలయ్యింది ప్రస్తుత సమాజం. అందుకే ధన వారసుల సంఖ్య నేడు సమాజంలో గణనీయంగా పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో 10 రూపాయలకు, 100 రూపాయలకు ఉన్న విలువ నేడు వెయ్యి రూపాయల కాగితానికి లేనేలేదు. ఈ ధనదాహం తీరడం లేదు. పాపం పండినట్లు డబ్బులు గుట్టలుగా పోగుచేసి, ధనాన్ని కూడబెట్టి దానికి వారసులను తయారుచేస్తున్నామే కాని ధర్మాన్ని ఆచరించి, ధర్మాన్ని భావితరాలకు అందించే ప్రయత్నంలో మనం విఫలమౌతున్నాం. ఇందుకు ఎవరినో విమర్శించి లాభం లేదు. మనలోని లోపాన్ని గుర్తించి, ఆ లోపం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించాలి.

పూర్వ వైభవం రావాలంటే...
- ధర్మాన్ని ఆచరించే ధార్మికులను, దార్శనికులైన ఆచార్యులను పరిరక్షించుకోవాలి.

- ధర్మానికి వారసులు తయారుకావాలి.

- ధర్మాకార్యాలను ప్రతి ఒక్కరూ శాయశక్తులా వ్యక్తిగతంగానో లేక సామూహికంగానో నిర్వర్తిస్తూనే ఉండాలి.

- ధర్మకార్యాలను చిత్తశుద్ధితో, పారదర్శకతతో నిర్వర్తించే సంస్థలకు, వ్యక్తులకు పూర్తిగా సహాయ సహకారాలను అందించాలి.

- ధర్మానికో, ధర్మాచార్యులకో, ధార్మిక సంస్థలకో సంక్షోభమేర్పడినపుడు అండగా నిలబడి అన్ని విధములా సంరక్షించుకోవాలి.

- అజ్ఞానంతో, అవగాహనారాహిత్యంతో, ప్రలోభాలకు లోబడో తన ధర్మాన్ని విడిచి పర ధర్మాన్ని ఆశ్రయించే పరిస్థితుల నుండి మన తోటివారిని రక్షించుకోవాలి.

- స్వధర్మాన్ని విడచి పర ధర్మాన్ని, పర మతాన్ని ఆశ్రయించడం ఘోరమైన 'అధర్మం'. కావున ఈ అంశాన్ని దశదిశలా చాటాలి.

- ధర్మాన్ని అవగాహన చేసుకునేందుకు వీలుగా సకల వాంఙ్గ్మయాలకు సారభూతమైన 'భగవద్గీత'ను ప్రతీ ఒక్కరికి చేరువ చేయాలి.

ఏ రంగంలో వారైనా ఇందుకు ప్రతీ ఒక్కరూ దృఢమైన సంకల్పంతో ధర్మరక్షణకు భాగస్వాములు కావచ్చు. ఈ అంశాలను ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం మొదలుపెడితే, భారతదేశం మరలా తన పూర్వపు వైభవాన్ని తప్పక అతి త్వరలో సంతరించుకుంటుంది. దీనికి రిటైరయిన వారి ప్రోత్సాహము, సహకారము పూర్తిగా ఉపయోగపడుతుంది. రిటైరయిన తర్వాత సినిమాలకు, సీరియళ్లకు పరిమితమై కాలక్షేపం చేసే వారి భావాలలో మార్పు రావాలి.

ధార్మికులుగా నిలబడదాం
ప్రస్తుతం మన రాష్ట్ర జనాభాలో చదువుకుంటున్నవారు సుమారుగా 25 శాతం మంది ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నవారు 35 శాతం మంది ఉన్నారు. పసిపిల్లలు, నిరుద్యోగులు, రోగులు, అభాగ్యులు, భిక్షగాళ్లు, వీధుల్లో తిరిగేవారు 10 శాతం మంది ఉంటారు. 20 శాతం మంది రిటైరయినవారున్నారు. మిగతా 10 శాతం మంది వృద్ధులున్నారు. మొత్తం వెరశి 8 కోట్ల జనాభాలో 20 శాతం మంది రిటైరయినవాళ్లు ధర్మం పట్ల ఆలోచించగలిగితే, కనీసం 1 కోటి మంది అయినా ధార్మికులుగా నిలబడగలరు.

వీరు ధర్మం పట్ల అవగాహన పొంది, ధర్మం కోసం వారి శేష జీవితంలోనే కొంతభాగాన్ని కేటాయించగలిగితే, విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లో తప్పక ప్రభావం చూపుతుంది. తద్వారా హిందూధర్మం పట్ల సరైన అవగాహన కలిగించి వారిలో యోగ్యమైన వ్యక్తిత్వానికి బాట వేయవచ్చు. ఈ విధమైన పరిణామం ప్రారంభమైతే, మన రాష్ట్రంలో సుమారు 60 శాతం మంది అనగా సుమారు 5 కోట్ల మందికి పైగా ధర్మాచరణ పట్ల ఆసక్తి చూపేవారి సంఖ్య పెంపొందుతుంది.

అప్పుడే ఈ ధర్మం పట్ల సరైన అవగాహన కలిగించే అవకాశమేర్పడుతుంది. ఈ అవినీతి, కుంభకోణాలు, దుర్మార్గాలు, దురాచారాలు, దోపిడీలు, అసాంఘిక కార్యాలు, నేరాలు, ఘోరాలు, మతమార్పిడులు, మత హింసలు, మారణహోమాలు తగ్గి స్వచ్ఛమైన, అచ్చమైన భారతీయతతో పూర్వపూ ప్రతిష్ఠను సంతరించుకుని సంస్కారవంతులతో భారతావని శోభిస్తుంది.
- స్వామి పరిపూర్ణానంద సరస్వతి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP