శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరిత్ర 40-41,42 43

>> Friday, June 15, 2012

ఖాతాలో ఖర్చు కూడా వ్రాయలేదు. ఇంకొక 100 రూపాయల బాకీని గురించి మీ మాస్టర్‌గారు చెబుతారు. అవి ఏమైనాయో ఎక్కడ ఉన్నాయో నేను చెప్పను’’ అని చెప్పి ‘‘నీవు ముంగేరులో నన్ను గురించి చాలా ప్రచారం చేశావు. అక్కడనుంచి ఎవరెవరో వచ్చి దీక్ష తీసుకుంటామని ఒత్తిడి చేస్తున్నారు. నాకు ఇక్కడ ఉండటమే కష్టం అవుతున్నది.
అందువలన నీవు ఇంక ముంగేరులో ఉండలేవు. నీవు ముంగేరు వెళ్లి, చీఫ్ ఇంజనీర్‌గారిని కలిసి, షిల్లాంగ్‌కు కాని అస్సాంకు కాని వెళ్లిపోతానని విజ్ఞాపన పత్రం సమర్పించుకో’’ అన్నారు. అందుకు నేను వారికి నమస్కరించి ‘‘అయ్యా! నేను అందరికీ చెప్పలేదు. కేవలం ఇద్దరు ముగ్గురికే ఆ సంగతి చెప్పాను. అగ్నిని బూడిద కప్పియుంచలేదు కదా! మీ అద్భుత శక్తి, అలౌకిక కార్యకలాపాలు వాటంతట అవే వెల్లడి అవుతున్నాయి’’ అని విన్నవించుకొన్నాను.
దాని తరువాత ఒక భయంకరమైన బాధాకరమైన విషయమును వారు చెప్పారు. అది విని నేను చాలా బాధపడ్డాను. వారు చెప్పినది ‘‘అయిదారు సంవత్సరాలకు నేను ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను. ఈ సమాచారం నీకు ముందుగానే తెలుపుతాను. నీవు ఎక్కడ ఉన్నా అప్పుడు ఇక్కడికి రావాలి. ఇప్పుడు నీవు ఇక్కడ ఉండవద్దు. రేపే ముంగేరు వెళ్లిపో’’ అని.
రెండవ రోజు ముంగేరుకు వెళ్లాను. వైద్యశాలకు వెళ్లి మాస్టరుగారు, భాగ్చీ మహాశయులు అక్కడ ఉండటం చూశాను. నన్ను చూసి మాస్టర్‌గారు ‘‘ఉమాచరణ్‌గారు! మూడు నాలుగు రోజులుగా మీరు కనిపించలేదు. ఎక్కడికి వెళ్లారు?’’ అని ప్రశ్నించారు. రూపాయల గందరగోళం విషయాలు తెలుసుకుందామని వెళ్లానని సమాధానం చెప్పాను. ‘‘అయితే మీరు కాశీధామం వెళ్లారా?’’ అని భాగ్చీగారు అడిగారు. ‘‘అక్కడికి కాక మరెక్కడికి వెళ్తాను’’ అని ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు వారిద్దరు ఎంతో కుతూహలంతో ‘‘త్రైలింగస్వామివారు ఏమన్నా’’రని ప్రశ్నించారు. నేను రెండు రశీదులను చూపించాను. జరిగిన వృత్తాంతమంతా వివరించి చెప్పాను. వారిద్దరూ నిశే్చష్టుయ్యారు. ఇక మిగిలిన వంద రూపాయల విషయంలో మాస్టరుగారి కేకవిని మేమిద్దరమూ వారి దగ్గరకు వెళ్లాము. మాస్టరుగారు నవ్వుతూ వంద రూపాయల నోటు దొరికిందని చెప్పి, రంగుకు అతుక్కొని చిక్కుకుపోయిన రంగు అంటిన నోటును నా చేతిలో పెట్టారు. మేము ఆశ్చర్యపోయాము.
ముంగేరును విడిచిపెట్టలేక, ఒకసంవత్సరం ఆలస్యం చేసి, అస్సాం చీఫ్ ఇంజనీరుగారికి దరఖాస్తు పెట్టుకొన్నాను. పదిరోజల తరువాత 50 రూపాయల జీతము, 15 రూపాయలు భత్యముపైన నియుక్తిపత్రం పంపించి, శివసాగర్‌కు వెళ్లటానికి నన్ను ఆదేశించారు. ఈ విషయం తెలిసిన మాస్టర్‌గారు‘‘ఆ జీతమే మీకు ఇక్కడ ఇస్తాము కాని మిమ్మల్ని ఒదులుకోలేము’’ అని చెప్పారు. ఆవిధంగా నెల రోజులు గడిచిపోయాయి. అస్సాం నుంచి రెండు టెలిగ్రాంలు కూడా వచ్చాయి. రాదలుచుకోకపోతే రానని తిరుగు టెలిగ్రాంలో తెలుపమని కూడా వారు తెలిపారు. అప్పుడు తీసుకోవలసిన నిర్ణయం కోసం శ్రీ స్వామివారిని అడగటానికి కాశీధామం వెళ్లాను. స్వామివారు నేను చెప్పినదంతా విని, నన్ను అస్సాం వెళ్ళమనే ఆదేశించారు. ముంగేరులో ఉండటానికి వీలుపడదని కూడా చెప్పారు.
కాశీనుంచి ముంగేరుకు వెళ్లితే తిరిగి నా స్వగ్రామానికి వెళ్లలేనని ఆలోచించి, అక్కడినుంచే నా స్వగ్రామానికి వెళ్లి 8-10 రోజులుండి, అక్కడినుంచే శివసాగర్‌కు వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత అంతకుముందు స్వామివారు చెప్పినట్లు పూర్వజన్మలో నా స్వగ్రామం శివసాగర్ అని జ్ఞాపకం వచ్చింది. వారు చెప్పిన ప్రకారం పూర్వజన్మలోనే ఉండిన నా ఇంటిని వెదకి, ఆ కాలంలో నేను రెండో అంతస్తులో వ్రాసిన మూడు శ్లోకాలూ చూడాలని ఆ ఇంటికి వెళ్లాను. కాని అక్కడ ఉన్న గృహస్థును అడిగే సాహసం చెయ్యలేక తిరిగి వచ్చేశాను.
ఒక సంవత్సరం తరువాత నాకు శివసాగర్ నుండి ఘోలోఘాట్‌కు స్థానచలనం కలిగింది. 3, 4 నెలల తరువాత ఒక యువకుడు ఓవర్సీర్ పదవిలో అక్కడికే వచ్చి చేరాడు. మేమిద్దరమూ ఒకే ఇంటిలో ఉండటంవలన, మాకు స్నేహం పెరిగింది. మేము కలిసిన 3 నెలలలోపలే, ఆ యువకుని వివాహం, నా పూర్వజన్మ వృత్తాంతానికి సంబంధించిన శివసాగర్‌ని గృహంలోనే జరిగింది. కాని వివాహానంతరం ఒక సంవత్సరంలోనే ఉత్తరప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు ఆ యువకునికి బదిలీ అయింది.
దానితో ఆ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అప్పుడు నన్ను నేను పరిచయం చేసుకొంటూ ఆ యువకుని మామగారికి ఒక ఉత్తరం వ్రాశాను. అది చూసి ఆయన నన్ను తమ అల్లునికి దగ్గరి స్నేహితుడని భావించాడు. 4, 5 ఉత్తరములు వ్రాసిన తరువాత మీ ఇంటి రెండవ అంతస్తులోని దక్షిణ ద్వారమున్న గదిలో మూడు సంస్కృత శ్లోకాలు వ్రాయబడి ఉన్నాయని, మూడు శ్లోకాలు వ్రాసి పంపితే దానికి నేను ఎంతో కృతజ్ఞుడినై ఉంటానని, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలిసి వెళ్తానని ఉత్తరం వ్రాశాను. అందుకు సమాధానంగా నా స్నేహితుని మామగారు తిరుగు టపాలో ఆ మూడు శ్లోకాలను వ్రాసి పంపుతూ, ముంగేరుకు వెళ్లేటపుడు తప్పక కలిసి వెళ్లమని ప్రార్థిస్తూ జాబు వ్రాశారు. ఆ మూడు శ్లోకాలు ఇవి.
1.వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి!
తథా శరీరాణి విహాయ జీర్ణం
అన్యాని సంయాతి నవాని దేహి -్భగవద్గీత
2.రుచీనాం వైచిత్య్ర దృజు కుటిల నానాపథ జుషామ్
నృణా మేకో గమ్య స్త్వమసి పయసా మర్ణవ మివ
-పుష్పదంతుని శివ మహిమ్నస్తోత్రమ్
3.నిర్మస్య ప్రమేయస్య నిష్కళస్య శరీరిణః
సాధకానాం హితార్థాయ బ్రహ్మణోరూప కల్పనా
- స్మృతి
వాటి తాత్పర్యాలు:
1.మానవులలు జీర్ణవస్త్రాన్ని త్యజించి నూతన వస్త్రాన్ని ధరించునట్లుగా, దేహాధారణ చేయు జీవుడుకూడా జీర్ణ శరీరమును త్యజించి నూతన శరీరాన్ని స్వీకరిస్తాడు.
2.అనేక మార్గాలగుండా ప్రవహించిన నదులన్నీ సముద్రంలోనే లీనమైనట్లుగా, ఉపాసనా మార్గాలు వేరు వేరైనప్పటికీ చివరకు బ్రహ్మత్వాన్ని పొందటమే మానవుల అంతిమ లక్ష్యం.
3.బ్రహ్మ నిరహంకరణానుశీలుడైనప్పటికీ, నిత్యపరిశుద్ధుడైనప్పటికీ శరీర రహితుడైనప్పటికీ సాధకుల హితముకొరకు నానా రూపములను ధరించును.
పునర్జన్మను గురించి నాకు కలిగిన సందేహమును నివృత్తి చేయటానికే స్వామివారు నన్ను నా పూర్వజన్మ ప్రదేశానికి పంపించి, ఆ యువకునితో పరిచయం కల్గించి, పూర్వజన్మలో నేను వ్రాసిన ఆ మూడు శ్లోకాలనూ నాకు తెలియబరిచారు. స్వామివారి అనుగ్రహానికి ఇది ఒక ప్రబల నిదర్శనము.
ఆ తరువాత వంగ సంవత్సరం 1294లో ఆగ్రహాయన (మార్గశిర) మాసంలో స్వామివారి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ‘‘నేను ఒక నెల తరువాత శరీరమును త్యజిస్తాను.
శిష్యులకూ సేవకులకూ వర్తమానం పంపించాను. నీకు కూడా వర్తమానం పంపుతున్నాను. తప్పక రావలయును. మనవిపత్రం ఇస్తే నీకు తప్పక సెలవు దొరుకుతుంది’’ అని ఉన్నది. నేను మూడు నెలలు సెలవు కోసం మనవిపత్రం ఇచ్చాను. తొందరగానే నాకు సెలవు లభించింది. నేను ఇంటికి వెళ్ళకుండా కాశీధామం చేరుకొన్నాను. అక్కడకు వెళ్లగానే స్వామివారు శరీరమును త్యజించటానికి ఇంకా పదిరోజులే మిగిలి ఉన్నట్లు తెలిసింది. సదానందస్వామి, కాళీచరణ్‌స్వామి, బ్రహ్మానందస్వామి, భోలానాథ్ స్వామి, మరి ఇద్దరు పరమహంసలు, మంగళదాస్ ఠఆకూర్ అంతా అక్కే ఉన్నారు. శరీరమును త్యజించడానికి పూర్వము ఒకరోజు ముందు వరకు బాబాగాను మమ్మల్ని పిలిచి వివిధ విషయాలను ఉపదేశించారు. 
ఆ తరువాత ‘‘నేను పడుకొని నిద్రపోతాను. నా పొడవుకు సరిపడే ఒక పెట్టెను చేయించండి. నేను శరీరమును త్యజించగానే నన్ను ఆ పెట్టెలో పడుకోబెట్టి, పైన స్క్రూలు బిగించి, తాళం వెయ్యండి. పంచగంగా ఘాట్‌లో కొంత దూరంలో ఆ పెట్టెను నీటిలో వదిలి పెట్టండి. అంతిమ సంస్కారం చేయవలసిన అవసరం లేదు’’ అని చెప్పారు. శరీరమును త్యజించటానికి ముందు రోజున రేవులో ఒక నావను అద్దెకు తీసుకోవాలని, శరీర త్యాగము తరువాత ఆ పెట్టెను నావమీద పెట్టి అసీఘాట్ నుంచి వరుణా ఘాట్ వరకూ ఒకసారి త్రిప్పి, దానిని ఒక నిశ్చిత స్థానంలో నీటిలో నిక్షేపించవలయునని చెప్పారు.
ఏదైనా అడగదలిస్తే నేటి రాత్రివరకే అడగాలి. రేపుమాట్లాడటానికి వీలులేదని చెప్పారు. రాత్రంతా మేము వారివద్దనే కూర్చూని యున్నాము. ఎందరో బ్రహ్మచారులు, పరమహంసలు వారితో మాట్లాడడానికి వచ్చారు. ఎవరికి దేనిపైనా జిజ్ఞాస ఉన్నదో వారు దానిని గురించి తెలుసుకొన్నారు. నేను చేతులు జోడించి గురుదేవుని కొన్ని ప్రశ్నలు అడిగాను. ‘‘గురుదేవా! నా గతి యేమిటి? అందరి పనులు అయినాయి నా పని కాలేదు’’ అని విన్నవించుకొన్నాను.
దానికి స్వామివారు ‘‘నీవు ఏప్రకారం పనిచేస్తున్నావో ఆ ప్రకారమే చెయ్యి. దానిని మధ్యలో విడువద్దు’’ అని ఆదేశించారు. తరువాత కాళీచరణ్ స్వామిని పిలిచి ‘‘‘ఇతనిని నీవు ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. ఏ పరిస్థితులలోనూ ఇతనిని విడిచిపెట్టకూడదు. అవసరమైతే అప్పుడప్పుడు అతని ఇంటికి వెళ్లి అతను ప్రగతిని సాధించేటట్లు చూడాలి. అతని విముక్తి భారం మీమీదనే ఉన్నది’’ అని చెప్పారు.
మహాత్మా త్రైలింగస్వామి శరీరమును త్యజిస్తారని తెలిసి కాశీలో అంతా కలవరం మొదలైంది. అందరూ ఆ విషయానే్న చర్చించసాగారు. ఆ అపూర్వ సంఘటనను చూడాలని అందరూ కుతూహలపడసాగారు. రెండవ రోజున పెట్టె, పరుపు, దిండు, మొదలైనవన్నీ సిద్ధం చేయబడినాయి. ఒక నావను కూడా అద్దెకు తీసుకున్నారు. ఆ రోజున 8, 9 గంటలకు స్వామివారు తన గద్దెకు సమీపంలో ఉన్న గదిలో ప్రవేశించి, ఆసనంపైన కూర్చొన్నారు. ఆ గది ద్వారాలనన్నింటినీ మూసివేయమని, తలుపు తట్టిన శబ్దం వచ్చేవరకూ తెరవవద్దని ఆదేశించి, స్వామివారు సమాధి స్థితిని పొందారు. తలుపులన్నీ మూసివేసి మేము జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నాము. మూడు గంటలకు తలుపు తట్టిన శబ్దం అయింది. అప్పుడు తలుపులు తెరిచాము.
స్వామివారు బయటకు వచ్చి పెట్టెను తెరువమని ఆజ్ఞాపించారు. అందులో వారు యోగముద్రలో స్థిరంగా ఆసీనులయ్యారు. ఆ విధంగా క్రీ.శ.1887కు సరియైన వంగీయ సంవత్సరం 1294లో పుష్యశుక్ల ఏకాదశినాడు సాయం సమయం అవుతుండగా శ్రీ త్రైలింగ స్వామి వారు దేహత్యాగం చేశారు. అప్పటికి వారి వయసు 280 సంవత్సరాలు. మేమందరం కలిసి వారిని పెట్టెలో పడుకోబెట్టి, స్క్రూలు బిగించి, తాళం వేశాము. ఆ తరువాత పంచగంగా ఘాట్‌వద్ద నావపైకి ఎక్కించి, అసీఘాట్ నుంచి వరుణా ఘాట్ వరకూ ఊరేగించాము. నావ కదలగానే ఎంతోమంది స్వామివారి భక్తులు కూడా నావమీదికి ఎక్కారు. పర్వదినాలలో గంగాస్నానానికి గుమికూడినట్లు అన్ని ఘాట్‌లలోను జనం గుమికూడారు. సాయంకాలం నిర్ణీత సమయంలో పెట్టెను గంగానదిలో పంచగంగా ఘాట్‌లో వదిలిపెట్టాము. పెట్టె మునిగిపోయింది. దానితో నా ఆశలన్నీ కూడా మునిగిపోయాయి. నా హృదయం విదీర్ణమయింది. నా బలము, బుద్ధి, ఆశయములు అన్నీ పోగొట్టుకున్నట్లు భావన కలిగింది.
మహాత్మా త్రైలింగస్వామివారు ఎప్పుడూ మానవ కల్యాణానే్న కోరేవారు. ఎవరైనా వారి వద్దకువచ్చి ఏదో అడగవలెనని వస్తే, వారు ప్రశ్నించకముందే దానికి తగిన సమాధానం చెప్పేవారు. హిందూ ధర్మం యొక్క అంతిమ ఫలం ఆత్మతత్త్వ పరిజ్ఞానము, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. వాటిని పొందకపోవటంవల్లనే ఆధునిక హిందువులు తమ ధర్మంమీద విశ్వాసాన్ని చూపలేకపోతున్నారు.

 శ్రీ త్రైలింగ స్వామి వారు సాధనవలన ఆ సిద్ధిని సాధించారు. వారు ‘‘మీరు నిరాశాజీవులు కావద్దు. శాస్త్రంలో దేనిని చరమస్థితి అని చెప్పినారో, గట్టి ప్రయత్నంవలన మీరు కూడా దానిని పొందటానికి అర్హులవుతారు’’ అని ప్రబోధించేవారు. అట్టి స్థితిని సాధించిన శ్రీ స్వామివారి దైవీశక్తులను, అలౌకిక కార్యకలాపములను చూసిన జనమంతా స్వామివారిని కదిలే దైవంగా భావించారు.
ప్రపంచంలో ఎవరు దేనికి తగినవారో వారికి అలాంటి ప్రణాళికను సిద్ధం చేసి దానికి తగిన తత్త్వజ్ఞాన బోధ చెయ్యటానికి స్వామివారు స్వయంగా దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. జీవుడు తన మనస్సు యొక్క ధారణాశక్తిని అనుసరించి భగవంతుని శక్తిని తెలుసుకోగలుగుతాడు. త్రైలింగస్వామి వారు హిందూ బ్రాహ్మణులు. హైందవాచారాల కర్మల ద్వారానే పవిత్ర జీవనాన్ని వారు అలవరచుకొని, హిందూ ధర్మం యొక్క మహోత్కృష్టతను వారు చాటి చూపించారు. ఇతర మతాలలోని గుణదోషాలను వారు విమర్శించలేదు. వేరే మతాలను ద్వేషంతో చూడలేదు. శాంత స్వభావంతో హిందూ ధర్మసేవ చేశారు. ఆ విషయం వారి జీవన విధానాన్ని బట్టేవ్యక్తమవుతుంది. అత్యంత శక్తిమంతులైనా అన్ని విషయాలలోనూ పరమశాంతంగా ఉండేవారు. మానావమానాలను సమానంగా ఎంచేవారు. అందువలన వారిలో హింస ద్వేషం వంటివి ఏ మాత్రం ఉండేవి కావు. కనుక మానవుడు వారిని అనుసరిస్తే మానవోత్తముడు కాగలుగుతాడు.
భారతవాసులైన ఓ హిందూ సంతతి జనులారా! మహాత్మా త్రైలింగస్వామి వారి జీవితమును ఒకసారి పరీక్షించండి. నిస్వార్థ్భావంతో వారు ముక్తి సాధనమును వెదికి ఏవిధంగా ముక్తులయ్యారో పరిశీలించండి. అందరి ఉపాస్య దైవములకూ ఆపరబ్రహ్మకూ మధ్యన తేడా లేదని వారు భావించారు. అందుకు కారణం భగవంతుడు ఒక్కడే! సహజ జ్ఞానంతోను, సంతుష్టచిత్తంతోను భగవంతుని ఉపాసించేవారు ఎవరైనా సరే దివ్య జ్ఞానానుభూతిని పొందగలుగుతారు. దానికి విరుద్ధమైన మతాన్ని అవలంభించి వేరు వేరు దేవతలను ఉపాసిస్తే, ఎవరికీ ఆ దివ్యజ్ఞానం లభించదు.
మహాత్మా త్రైలింగస్వామి తమ సుఖదుఃఖాలను గురించి ఎలాంటి శ్రద్ధా తీసుకోలేదు. ఎందుచేతనంటే ఈ రెండు ప్రవృత్తులకూ ఎలాంటి సత్తా లేదు. ఏ ఒక్కటీ పరిపూర్ణమైనది కాదు. వారు తత్త్వజ్ఞానం పొందినా తరువాత వారి మనస్సులో పరమానందభరితమైన బ్రహ్మదర్శన సౌఖ్యమును పొందారు. వారు ప్రపంచాన్ని బ్రహ్మమయంగానే చూసేవారు. దుఃఖమనే పేరుగలది ఏదీలేదు. వారు జీవన్ముక్తులై ఒకే భావంతో జీవితమంతా గడిపారు. సుదీర్ఘమైన 280 సంవత్సరాల వయస్సులో కూడా వారు ఎప్పుడూ బాధను అనుభవించలేదు. ఆ వయస్సులోనూ వారు సుఖదుఃఖాలను రెంటినీ ఒకే నాణానికి బొమ్మ- బొరుసు లాంటివిగా భావించేవారు. ఆ విధంగా వారు జీవన్ముక్తిని సాధించారు. భగవంతుని చేరటానికి భక్తియే వాస్తవమైన మూలపదార్థము. అదే మొదటి ప్రణాళిక. శారీరక- మానసిక- ఆత్మ ప్రవృత్తులపైన జీవితము ఆధారపడి ఉన్నది. ఈ మూడింటి వికాసమే వాస్తవమైన భగవద్భావము. ఆ భావాన్ని వికసింపజేయటానికి తోడ్పడేది భక్తియే! వాస్తవానికి భక్తివలననే నిర్భరత కలుగుతుంది. సంపూర్ణ నిర్భరశీలమునుంచే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. నిష్కామ జ్ఞానమే భగవత్ప్రాప్తి. మనస్సు యొక్క స్థూలభావం నుంచి భగవంతుని స్థూలభావమును, మనస్సు యొక్క సూక్ష్మభావం నుంచి భగవంతుని సూక్ష్మభావమును, మనోలయం వలన ఈశ్వర ప్రాప్తిని పొందవచ్చును. మనస్సును బుద్ధితో పరీక్షిస్తూ ఎవరు నిరాకార నిర్గుణ రూపాన్ని ధరించలేరు. భావ వికాసము వలన భావమయుడైన భగవంతుని వివిధ రూపాలు కూడా వికసిస్తాయి. భావం యొక్క ఘనీభూతస్థితినుంచి మూర్తి ప్రకాశిస్తుంది. ఎవరు మనస్సుతో విశుద్ధసత్తాను, సరళభావాన్నీ పొంది తమ అధీనంలో ఉంచుకొంటారో వారు మాత్రమే భక్తి- ప్రేమలతో భగవంతుని దర్శించి కృతార్థులవుతారు.
- ఇంకాఉంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP