శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగ స్వామి చరిత్ర -34,35,36

>> Wednesday, June 6, 2012

కొంతసేపటికి వారు నన్ను కండ్లు మూసుకొమ్మని చెప్పారు. నేను కండ్లు మూసుకొని కూర్చున్నాను. అప్పుడు వారు ‘‘ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము?’’ అని ప్రశ్నించారు. నేను కండ్లు తెరచి చూచాను. మేము ఆశ్రమంలో ఉన్నాము. వారు గద్దెపైన పడుకొని యున్నారు. నేను వారి ప్రక్కనే కూర్చొని యున్నాను. ఆ విచిత్ర సంఘటనను చూసి ఆశ్చర్యపోయాను. అది దేవతలకు కూడా అసాధ్యమైన పని. మరి మనుష్యులకు ఎలా సాధ్యమైంది అనుకొన్నాను. అది గమనించి వారు అది ఏమంత ఆశ్చర్యకర విషయం కాదన్నారు.
‘‘మానవులు నిజమైన సంపూర్ణ మానవత్వం పొందితే ఏ కార్యమును అయినా చేయగల్గుతారు. ఇంతకుపూర్వం నీవు చూసిన సంఘటనను కేవలం సత్యముపైన విశ్వాసము కల్గటానికి నీకు చేసి చూపించాను. మీరు కూడా ఇలాంటి పనులు చేయగలరు’’ అని చెప్పి స్వామివారు ఇంటికి వెళ్లమని ఆజ్ఞ ఇచ్చారు. నేను ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకున్నాను. కాని ఆనాడు జరిగిన సంఘటనను గూర్చి ఆలోచిస్తూ పడుకోవటంవలన నిద్రపట్టలేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది.
మర్నాడు మాఘసప్తమి. ఆ రోజున మేమిద్దరం ఆనందంగా గంగాస్నానం చేసి యాథాస్థానంలో ఆశ్రమంలో కూర్చున్నాము. ఆ సమయంలో నా మనస్సులో ఒక అనుమానం పొడసూపింది. అది నా గురువులు అయిన వీరిలోనే ఇంతటి అతీత శక్తులుంటే వారి గురుదేవులలో ఎంతటి శక్తులున్నాయో అని. అందువలన స్వామివారి జీవిత చరిత్రనే పూర్తిగానే తెలుసుకోవలెనన్న కోరికను విన్నవించుకున్నాను. కాని వారు నా మాటను పట్టించుకోలేదు. అయినా నేను పదే పదే అడగటంవలన తమ గురువులను గురించి తమ రెండవ శిష్యుడైన మహాత్మా కాళీచరణ్‌ను అడిగి తెలుసుకోమని చెప్పారు.
మహాత్మా కాళీచరణ్ స్వామివారితో నాకు ఆ ఆశ్రమంలోనే పరిచయం అయింది. అంతేకాదు, ఎంతో దగ్గరి సంబంధం ఏర్పడింది. నేను వారిద్వారా స్వామివారి జీవితంలో బాల్యం నుంచి కాశీలో నివసించే వరకు అన్ని విషయాలను తెలుసుకున్నాను. వారు నన్ను ఎంతో ప్రేమగా చూశారు. ఇప్పుడు వారు హరిద్వార్‌లో ఉన్నారు.
గురుదేవులు గొంగళిపైన నిదురించేవారు. దానినే కప్పుకొనేవారు. అది చూచి నాకు చాలా కష్టమనిపించింది. నేను రెండు శాలువాలను ఒక దుప్పటిని కొని తెచ్చి వారికి ఇచ్చాను. వారు శాలువాలు చూసి చాలా కోపించి నేలపైకి విసరివేశారు. కోపోద్రిక్తమైన వారి ముఖమును చూసి నేను చాలా భయపడ్డాను. వారి పాదములు పట్టుకుని క్షమించమని వేడుకున్నాను. వారు శాంతించిన కొద్దిసేపటికి నేను ‘‘మీకు ఎలాంటి వస్త్రాలు కప్పుకోవటానికి కావాలో చెప్పండి’’ అని ప్రార్థించాను. అప్పుడు వారు తమకు ఒక గొంగళి మాత్రం తెచ్చి యిమ్మని చెప్పి ఇంటికి వెళ్లమని ఆదేశించారు. నేను ఇంటినుండి తిరిగి వచ్చునపుడు రెండు మంచి కంబళ్లను, ఒక ఆసనమును కొని తెచ్చి యిచ్చాను. వాటిని చూసి స్వామివారు ఏమీ అనలేదు.
దానివలన నాకు కొంత ధైర్యం కలిగింది. ఒక గొంగళిని నేలమీద పరచమని ఆదేశించి మెల్లిగా గద్దె దిగి వచ్చారు. రెండవ గొంగళిని కప్పుకున్నారు. ‘‘ఇది బాగుంది. నీవు తెచ్చిన శాలువాను నువ్వే వాడుకొ’’మ్మని ఆదేశించారు. నాకు చాలా సంతోషం కలిగింది. నేను దుప్పటిని మంగళదాసుకు ఇచ్చి, శాలువాను మాత్రం తీసుకున్నాను. స్వామివారు శాంతించటం చూచి నేను కూడా సాంత్వనము పొందాను. ఈ విధంగా రోజూ రెండు పూటలూ వస్తూపోతూ మాఘ- ఫాల్గుణ మాసములు, చైత్రశుక్ల దశమి వరకు గడిపాను. ఏకాదశి రోజున యథాపూర్వకముగా నేను గురుదేవుల వద్ద కూర్చొని యున్నాను. దర్శనము కోసం వచ్చే భక్తులందరూ వెళ్లిపోయిన తర్వాత స్వామివారు ‘నీవు యే యే సంఘటనలను చూశాలో, ఏయేమాటలు విన్నావో, వాటిని నమ్మకం లేని వారికి ఎవ్వరికీ చెప్పకూడదు.
 ధర్మావలంబనము చేస్తూనే మనుష్యులు ప్రపంచంలో వికసించాలి. ప్రతి సమయంలోనూ సచ్చరిత్ర కలవాడై ధర్మమును ఆచరించాలి. జీవితంలో అసలు పని అయిన ఉపాసనము ఎప్పుడూ విడువకూడదు. నేను నీకు చేయవలసిన పనులను వ్రాయించాను, చెప్పాను, వివరించాను. ఇక ఇప్పుడు ఈ ఆశ్రమంలో నీవు ఉండవలసిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత నీ ఉద్యోగానికి వెళ్లు. ఈ ప్రపంచంలోకి మరల మరల తిరిగి రాకూడదనే కోరికను పెంచుకో. ఆ భగవంతుని వద్దనే నీవు ఉండవలెను. నీకు వివాహం అయినది కదా. దానిని కూడా నీవు అనుసరించవలెను. కనుక నీవు ఇక్కడ ఉండటానికి వీలులేదు’’ అని స్వామివారు చెప్పారు.
నాకు హరిద్వారము వెళ్ళవలెనని కోరిక ఉన్నది. ఇప్పుడు వెళ్లితేనే వెళ్లగలను. లేకపోతే నా జీవితంలో ఎప్పుడూ వెళ్లలేను అని అనుకున్నానను. కాని ఇప్పుడు అధికమాసం కావటంవలన వెళ్లలేనని విన్నవించుకున్నాను. అక్కడినుండి ప్రయాగకు వెళ్ళమని స్వామివారు సెలవిచ్చారు. ‘‘అయోధ్యలోని సరయూనది తీరంలో రామదాసు ఉన్నారు. వారిని దర్శించి ప్రయాగలోని సూరదాస్ బాబాను దర్శించు. ఆ తర్వాత హరిద్వారమునకు వెళ్ళు’’ అని ఆదేశించారు. చైత్ర సంక్రాంతికి ముందు రోజు నేను అయోధ్యకు వెళ్లటానికి స్వామివారి అనుజ్ఞను పొందాను. ఆ తర్వాత స్వామివారికి నా సందేహము ఒకదానిని వెలిబుచ్చాను. అది ‘‘నేను పాప విముక్తుడను అయినానో లేదో ప్రమాణపూర్వకంగా తెలియచెప్పండి’’ అని వేడుకొన్నాను. నా విశ్వాసం కోసం వారు ‘‘అప్పుడు నీ అరచేతిలో ఒక పొర ఊడిపోతుంది’’ అని చెప్పారు. (వాస్తవానికి నేను హరిద్వారము నుండి ముంగేరుకు తిరిగి వచ్చి తరువాత నా రెండు అరచేతులలోని చర్మము కాలిన తర్వాత ఎలా ఊడిపోతుందో అలా ఊడిపోయింది. దానిని చాలామంది చూశారు కూడా). అప్పుడు నేను గురుదేవుని చరణధూళిని నుదుట ధరించి వారికి నమస్కరించాను. వారు నన్ను ఆశీర్వదించి ‘‘ఎప్పుడైనా, ఏదైనా సందేహం కలిగినపుడు నీవు ఒంటరిగా నా దగ్గరకు రా’’ అని చెప్పారు. నేను హరిద్వార్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ చరణ సన్నిధికి వచ్చే భాగ్యమును కలిగించండని’’ వేడుకొన్నాను. ‘‘అప్పుడు నీవు ఒకటి రెండు రోజులు కాశీలో ఉండు’’ అని చెప్పారు. ఆ తరువాత నేను వారికి నమస్కరించి సెలవు తీసుకొన్నాను.
గురుదేవుల ఆజ్ఞానుసారం చైత్ర సంక్రాంతి చివరి రోజున ప్రాతఃకాల వేళకు నేను అయోధ్యాయాత్రను పూర్తి చేశాను. అయోధ్యలో మూడు రోజులు ఉండి, స్వామివారు సెలవిచ్చిన ప్రకారం మహాత్మా రామదాస స్వామివారిని సరయూనదీ తీరంలో దర్శించి తరించాను. వారు ధ్యానమగ్నులై ఉన్నారు. వారి మాటలు వినవలెనని కోరికతో నేను అక్కడనే కూర్చొని యున్నాను. రెండు గంటల తరువాత కనులు తెరిచి చూసి ‘‘నీ పని పూర్తి అయినదికదా! ఎందుకు కూర్చున్నావు’’ అని అడిగి, తిరిగి కన్నులు మూసుకొన్నారు. వారు ఇక ఏదీ మాట్లాడరని భావించి నేను అక్కడినుండి వెళ్లిపోయాను.
మర్నాడు నేను ప్రయాగ వెళ్లాను. అక్కడ 7 రోజులుండి, నా కర్తవ్యమును పూర్తిచేసుకొని, ఒకరోజున గురుదేవుల ఆజ్ఞానుసారం మరి ఇద్దరి వ్యక్తులతోకలిసి సూరదాస్ బాబాగారి దర్శనమునకు వెళ్లాను. గంగాతీరమునకు వెళ్లే త్రోవలో ఒక చిన్న నది ఉన్నది. దానిని దాటి వెళ్ళటానికి ఒక వంతెన ఉన్నది. దానికి ఒక ప్రక్కన మహాత్మా సూరదాస్ బాబాగారు ధ్యానమగ్నులయి కూర్చొని యున్నారు. దాదాపు మూడు గంటలువారి వద్దనే కూర్చున్నాను. కాని వారు ధ్యానమును వీడలేదు. అక్కడ ఉన్న కొంతమంది ఈ విధంగా చెప్పారు. ‘‘సిపాయిల తిరుగుబాటుకాలం ముందునుంచీ శీతాకాలము ఎండాకాలము అనే భేదం లేక, సంవత్సరం పొడుగునా రాత్రింబవళ్లు ఇదే విధముగా కూర్చొని యున్నారు’’ అని. సిపాయిల తిరుగుబాటు జరిగే రోజున కొందరు సిపాయిలు వచ్చి ‘‘ఇక్కడే యుద్ధము జరుగుతుంది.

 ''కనుక మీరు మరొకచోట కూర్చుండి ధ్యానం చేసుకోండి’’ అని చెప్పారు. కాని సిపాయిలు ఎంత పెద్దగా అరచినా ధ్యానముద్రలో ఉన్న బాబాగారికి వారి మాటలు వినపడలేదు. అప్పుడు వారు ఒక అగ్గిపుల్లను వెలిగించి వారి భుజముపైన పెట్టారు. ఒక అరగంట తర్వాత బాబాగారు ధ్యానమునుండి యథాస్థితికి వచ్చి ‘‘మీరు నాపై ఎందుకు అత్యాచారం చేస్తున్నార’’ని సిపాయిలను ప్రశ్నించారు. దానికి సిపాయిలు ‘‘ఇక్కడ యుద్ధం జరుగుతుంది. కనుక మీరు వేరే ప్రదేశాన్ని చూసుకోండి’’ అని సమాధానం చెప్పారు. అప్పుడు సూరదాస్ బాబాగారు ‘‘ఒకవేళ తుపాకి గుళ్ళతో నాకు మృత్యువు సంభవిస్తే మీలో ఎవ్వరూ దానిని ఏ విధముగానూ ఆపలేరు. మీరు యుద్ధం చేసుకోండి. నా గురించి ఆలోచించవద్దు. నేను ఈ ప్రదేశము విడిచి వెళ్లను’’ అని బదులు చెప్పి తిరిగి సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు. అక్కడ యుద్ధం జరిగింది కాని వారికి ఎలాంటి హాని జరుగలేదు. భుజనముపై అగ్గిపుల్లతో కాల్చిన మచ్చ మాత్రం ఉన్నది. అయినా వారు సమాధి స్థితిని వీడలేదు. వారు చాలా శుష్కించియున్నారు. కేవలం ఎముకల పైన చర్మము అతికించినట్లు వారున్నారు. సంధ్యా సమయం వరకు మేముండి ఆ తర్వాత అక్కడినుండి ఆగ్రాకు వెళ్లాము. అక్కడ మూడు రోజులుండి తాజ్‌మహల్ చూశాము. తరువాత మధురలో 7 రోజులుండి బృందావనమును చూసీ, ఢిల్లీ మీదుగా హరిద్వార్‌కి వెళ్లాము. అక్కడ బాబాగారి రెండవ శిష్యుడైన మహాత్మా కాళీచరణ్ స్వామివారిని దర్శించాము. వారి అనుగ్రహంవలన ‘కన్‌ఖళ్’లో ఉన్న మరి నలుగురు మహాపురుషులను చూశాము. తరువాత గంగా ఘాట్‌లో స్నానం చేయుటకు వెళ్లినపుడు బాబాగారి మూడవ నాల్గవ శిష్యులైన మహాత్మా బ్రహ్మానంద స్వామి మహాత్మా భోళానాథ్ స్వామివారల పరిచయం కలిగింది. హరిద్వార్‌లో మేము గురుదేవుల అనుయాయులం నలుగురము కలిసి ఒకరితో ఒకరు ఒక నెల రోజులు గడిపాము. వారితో నాకు చాలా సన్నిహితత్వము కలిగింది. వారు నా యోగక్షేమమును ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటామని మాట ఇచ్చారు. అంతేకాక అప్పుడప్పుడు కలుస్తూ ఉందామని కూడ చెప్పారు.
కొన్ని క్షేత్రములను దర్శించిన తరువాత నేను తిరిగి కాశీధామము చేరాను. మొట్టమొదట నేను ఆశ్రమమునకు వెళ్లి గురుదేవులకు దండప్రణామములు చేసి వారి సమీపంలో కూర్చున్నాను. స్వామివారు నన్ను చూచి ‘‘నీ పనులన్నీ ముగిసినవి కనుక నీవు ఈ కాశీధామమును వదిలి ముంగేరు వెళ్లు’’ అని చెప్పారు. ‘‘మీరు 3 నెలలు సెలవు తీసుకొని వచ్చారు. కాని 8 నెలలు గడిచిపోయినాయి. ఇక ఇక్కడ ఒక రోజు కూడా ఉండటం కుదరదు. రేపు తప్పక వెళ్లిపోవాలి. మీ ఉద్యోగం గూర్చి మీరే మాత్రమూ చింతించవద్దు. మీ ఉద్యోగం నుండి మిమ్మల్ని ఎవరూ తొలగించలేరు’’ అని కూడా చెప్పారు.
స్వామివారి ఆజ్ఞ తీసుకుని వారి పాదధూళిని నుదుట ధరించి అక్కడినుండి బయలుదేరాను. మంగళదాస్ ఠాకూర్ వద్దకు వెళ్లి, వారితో చాలాసేపు మాట్లాడిన తర్వాత, నమస్కరించి వారినుండి కూడా సెలవలు తీసుకొని మర్నాడు ముంగేరికి ప్రయాణమయ్యాను.
మహాత్మా త్రైలింగస్వామివారితో నాకు శిష్య సంబంధము ఏర్పడిన రోజుననే స్వర్గవాసిని మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఆల్‌కాట్‌లు బొంబాయి వచ్చి థియోసాఫికల్ సొసైటీని స్థాపించి, యోగవిద్య యొక్క అద్భుత శక్తులను ప్రచారం చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు అలౌకిక కార్యములు చేసి చూపి, ఆసిద్ధులను లోకులకు తెలియజెప్పేవారు. అలాంటి యోగసిద్ధులు ఆమెకు ఎట్లా కలిగినాయని స్వామివారని ప్రశ్నించగా అవన్నీ యోగసిద్ధులు కావని, అదంతా కనుకట్టు అనీ చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగానే కొన్ని రోజుల తరువాత కుసుమ అనే ఆమె, బ్లావట్‌స్కీకి అనుయాయిగా ఉండి, మద్రాస్ నగరంలోని ఆమె రహస్య స్థావరాన్ని రహస్య విషయాలు బయటపెట్టింది. అది ప్రపంచానికంతా తెలిసి, ఆమె అల్లరిపాలయింది.
- ఇంకాఉంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP