ఏమిటమ్మా నీలీల ! ఏసీ కార్లెక్కిస్తావు, అంతలోనే కసువులూడ్చిఎత్తేపని చేపిస్తావు ?? !
>> Wednesday, December 28, 2011
నినునమ్మినవారికెన్నడు నాశములేదుకదమ్మ ఈశ్వరీ ! అని జగన్మాత దయను వర్ణించాడు భక్తకవి పోతనామాత్యుడు . అమ్మ అనుగ్రహం అలా మనపై స్థిరమవ్వాలంటే అమ్మ అనుగ్రహానికి పాత్రమయ్యేలా మన నడవడిక ఉండాలేమో ! లేకుంటే అలా ఉండేలా శిక్షణనుకూడా ఇస్తుందేమో ఆతల్లి. నాకెందుకో అమ్మ శిక్షణ ఒక్కోసారి మింగుడుపడదు.కానీ గత్యంతరం కూడాలేదుకదా !
మొన్న తిరుమల యాత్రకు వెళ్ళివస్తుండగా ఓ మితృడు స్వామీ ! అహోబిలం వెళ్ళటానికి బయలుదేరుతున్నాము వస్తారా ? అనడిగాడు . అందులోనూ ప్రయాణానికి ఇబ్బందిలేకుండా ఏసీ కారు . బాగుంది ...బాగుందని బయలుదేరాను ప్రయాణబడలికకూడా మరచి. ఆతరువాత దారిలో మరిద్దరు మితృలు కలవటం .చాలాసంతోషంగా ప్రయాణం . ఉండదుమరి ? ఎంతగౌరవం ? ఎంతగౌరవమని ....!! ఇకసాయంత్రానికి వాళ్లు మహానందివైపు వెళుతూ నేను ఇంటికి వెళ్లాలనగా దారిలో దింపి సెలవు తీసుకున్నారు . ఇక మరోగంటలో నేను కిటకిటలాడుతున్న రైలు పెట్టెలో కూర్చోటానికి జాగాలేక నిలబడే జోగుతున్నాను . నాస్థితికి నాకే నవ్వొచ్చింది . ఇందాకేమో కార్లో కూర్చోపెట్టి తిప్పావా ? ఇంతలోనే నీది "ఏ "క్లాసుకాదురా" సీ " క్లాసే గుర్తుంచుకో! అంటూ ఇలా నిలబెట్టావా తల్లీ ! అని మనసులో అమ్మను తలచుకున్నాను .
ఇప్పుడేనా ? !!! ఇంకా చూడు ..అన్నట్లనిపించింది
ఇక వినుకొండలో ట్రైన్ దిగి రాత్రి ఒంటిగంటకు గజగజ లాడే చలిలో బైక్ మీదప్రయాణం చేసి ఇంటికి చేరాను. ఇక పొద్దున్నే పూర్తిగా నిదురకూడా పోకుండానే లేచి చీపురు పట్టుకున్నాను . తప్పదు మరి ? పీఠంలో సేవాబాధ్యతలప్పించివెళ్లానుకదా మా తమ్మునికి ,వానికి కూడా జ్వరం .దాంతో వాడొక్కడే చేయలేడుకదా తప్పదు.
మామేనత్త [దేవీభక్తురాలు ] వచ్చి ఉన్నది ఇంటివద్ద నేను తిరుపతి వెళితే తోడు ఉండటానికి. సాయంత్రం వేళ పీఠం లో గోడలకు ఉన్న బూజు దులుపుతూ,కసువులూడ్చుకుంటూ ఉంటే నవ్వుతూ ఏరా ! అబ్బాయ్ గురువుగారు కసుఊడవటం బాలేదే ? అన్నది మామేనత్త నవ్వుతూ ఎగతాళిగా .
నిజమేనత్తా ! ఏంటో గురువుగారూ అని పిలిపిస్తుంది ...గడ్డిపోచకింద తీసేస్తుంది . ఏమిటో ? అమ్మలీల . అన్నాను నేనూ నవ్వుతూ .
అలా ఊడుస్తూ .పూజా సామాగ్రి శుభ్రపరచుకుంటూ నాలోనేనే ప్రశ్నించుకుంటూన్నానుఅమ్మనుద్దేశించి . అమ్మా ఇప్పుడు చూడాలి గురువుగారి వైభోగం ...అయినా ఏమిటమ్మా ! సి క్లాసు గాడ్ని సి క్లాసులో ఉంచక ఏ క్లాసు లో కూర్చోబెట్టడమెందుకు ? మరలా నీది సీ క్లాసే నని ఎగతాళి చేయడమెందుకు ?
ఏ క్లాసైనా అది నాప్రసాదమేనని గుర్తుంచుకునేందుకు . నీస్తాయేమిటో నువ్వెప్పుడన్నా మరచిపోయి నా అనుగ్రహానికి దూరంకాకుండా ఉండేందు ..... అని అమ్మ అంటూన్నట్లుగా మనసులో ఓసమాధానం మెరుపులా మెరిసింది.
నాకేక్లాసూ వద్దమ్మా ! నీ కాళ్లదగ్గర పడిఉండే భాగ్యం దూరంకాకుంటేచాలు అని నమస్కరించుకున్నాను .
మరునాడోక ఫోన్ . స్వామీ ! నేను ఓకొత్త వ్యాపారం ప్రారంభించుకోబోతున్నాను .దానిని ప్రారంభం మరో ఇద్దరితోపాటు మీతోకలిపి. ఆహ్వాన పత్రికలలో మీపేరు వేసుకుంటున్నాను అని .
వద్దులే ?
మీరు కాదనవద్దు
వద్దులేస్వామి !
కాదనకండి స్వామి ! బ్రతిమిలాడారాయన
సరే ! పిలచేది నన్నా ? అమ్మనా ?
ఆ......!!!!! అమ్మనే
కదా ? అప్పుడు అమ్మపీఠానికి ఆహ్వాన పత్రిక పంపు . అందులో అమ్మపీఠంలో సేవచేసే ప్రధానసేవకుడని వ్రాసుకో చాలు .అదే మనస్థితి . అని అసలు విషయం చెప్పానాయనకు అసలు నిజం.
3 వ్యాఖ్యలు:
"నినునమ్మినవారికెన్నడు నాశములేదుకదమ్మ ఈశ్వరీ !"
నిజమేనండీ అమ్మ దయ వుంటే అన్నీ వున్నట్లే..
అమ్మ దయ గురించి చక్కగా చెప్పారు.
భక్తునికి -భగవత్ సేవకులకి నిరంతర ఆత్మశోధన అత్యంత అనివార్యం అయిన ఆభరణం.దానిని ఎప్పుడూ ధరించి ఉన్నవారికే భఘవత్ కృపా-కటాక్షాలు మరి.ఎవరు నిద్రలో సైతం ఈ ఎరుకను కలిగిఉంటాడో వాడే యోగి.ఆత్మశోధన చేసుకోలేనివారు దేవుని ప్రేమకు పాత్రులుకాలేరు.
ఏ క్లాసులో ఉన్నా భోగానికి లొంగకుండా, బాధకు కృంగకుండా ఉండాలని చెప్పడం ఆ తల్లి ఉద్దేశ్యం.
Post a Comment