నమో నారశింహా ! నమొ నమో భక్తపాలా !
>> Sunday, December 25, 2011
గోవిందమాలధరించి స్వామిని సేవించాలని ఎంతోకాలంగా ఉన్నకోరికను స్వామి అనుగ్రహించి తీర్చారు. మాలవిరమణకు గురువారం మార్గశిర లక్ష్మీవారపూజలు ముగించుకుని నేరుగా తిరుపతి వెళ్లాను. శుక్రవారం తెల్లవారకముందే తిరుచానూరు లో వున్న మన అమ్మ అలవేలుమంగమ్మసన్నిధికిచేరాను . అయితే అక్కడ శుక్రవారాభిషేకాలు జరుగుతున్నందున ఎవరినీ కనీసం ఆలయ ఆవరణలోకికూడా రానివ్వటంలేదు . లోపల విఐపీలు వున్నారు మరి !
ఆ టికెట్ తీసుకుందామంటే లేదంటున్నారు . బ్రతిమిలాడగా బ్రతిమిలాడగా కనికరించిన కానిస్టేబుల్ బాబులు లోపలకెళ్ళి ఆవరణలో కూర్చోటానికి అనుమతిచ్చారు. ఆవరణ లో కూర్చుని అమ్మను స్థుతిస్తూ కూర్చున్నాను . వీడి ఏడుపు చూడలేననుకుందో ఏమోగాని అమ్మ కరుణాంతరంగ కదా ! లోపల అభిషేకాలు ముగిశాక ఆసేవచేపించినభక్తులకు ప్రసాదంగా అమ్మకు అభిషేకంలో అలమిన పసుపు గంధం ప్రసాదం ఇస్తారు] ఆప్రసాదం లభించిన కరుణామయుడగు ఒక భక్తుడు వచ్చి నాచేతిలో కొద్దిగా అమ్మ ప్రసాదంగా పసుపు ఇచ్చాడు. ఆ తరువాత అమ్మకు పసుపుకుంకుమలు సమర్పించి తిరుమల వెళ్లాను .చక్కగా స్వామి వారు చిరునవ్వులతో దర్శనమిచ్చారు . ఈనవ్వుచాలుస్వామీ ! కోటిజన్మలైనా ఎదురుచూడటానికి అని నమస్కరించుకుని అలా ప్రదక్షిణమార్గంలో నడుస్తూ యోగనారసింహుని వద్దకు చేరాను అక్కడ ఒక ఎలుక స్వామివారికి అలంకరిమ్చిన పూలమాలను కొరుకుతూ ఉంది. బయటనుంచి ఇష్షు ఉష్షూ ...అన్నాకూడా ఏమాత్రం లెక్కచేయలేదు . ఏందుకో అప్పుడు మనసులో అనిపించింది. ఈర్ష్యాద్వేషాలనే ఎలుకలు నీభౌతికావరణాన్ని ఎంతగా కొరుకుతూ కలవరపరుస్తున్నా చలించకుండా ఉండగలగటమే యోగం.అదే నారసింహ యోగమని అదే స్వామి బోధ అనిపించింది. బయటకు రాగానే మాతమ్ముడు ఫోన్ చేశాడు.అన్నా ! నువ్వు బయలుదేరి ఉదయానికి పెంచలకోన వెళతావా ? నారసింహస్వామి దర్శనంతోపాటు అక్కడ యోగినీమాత విజయేశ్వరీ దేవి ప్రస్తుతం వచ్చి ఉన్నారు వారితో నీవుమాట్ళాడె ఏర్పాటు చేస్తాను అనడిగాడు. పీఠం లో పూజకు ఇబ్బందిగా ఉంటూంది ఇప్పుడు ఇంటికెళతాలే మరోసారి చూద్దామని చెప్పివదిలేశాను. ఒంగోలులో ఉన్న శ్రీనివాసరెడ్డికి కి ఫోన్ చేశాను నువ్వేమన్నా దరిశి వెళుతున్నావా నేను తెల్లవారేసరికి ఒంగోలులో ఉంటాను నేను నీతోపాటుబండిలో వస్తాను అనడిగాను.
స్వామీ ! నేను అహోబిళం వెళ్లాలని బయలుదేరుతున్నాను ,మీరొస్తారా ? అనడిగాడు. ఒక్కక్షణం అర్ధంకాలేదు. ఏమిటీ ఇదేదో స్వామి పిలుపులా ఉందే అనిపించింది . మొన్న కురిచేడులో హనుమదభిషేకాలుచేస్తున్నప్పుడు పైననే ఉన్న నరసింహుని దర్శిమ్చుకోవటానికి వెళ్లలేకపోయాను. మొన్న పెద్దవరం లో హనుమత్ పూజనాడుకూడా పక్కనే ఉన్న దేకనకొండ నరసింహునికొండ నుదర్శిద్దామనుకున్నా కుదరలేదు.వారంక్రితం మంగళగిరి నుండి స్వామివారు మిగిలిన పానకం భక్తులు తెచ్చి ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి విజయవాడ వెళ్ళివస్తూ కూడా చూడలేకపోయాను .
ఇప్పుడేమో రమ్మని పిలుపు ఓహో ! స్వామి కరుణ ఎంతటిదోకదా ! వేడినవారికి దర్శనమీయవు,వలదనని నిన్ను వారించు వారిని వదలక వెంటా తిరిగెదవయ్యా ! అనే పాట గుర్తుకొచ్చింది.
సరే ! నాలుగింటికే ఒంగోలు చేరాను అక్కడనుండి శ్రీనివాసరెడ్డి ఆయన మితృడు శ్రీనివాసరావుగారు వచ్చి నన్ను కారెక్కించుకున్నారు . వెళుతూ గిద్దలూరులో ఉన్న మితృలకు సమాచారమిచ్చాను నేనుఅటువైపు వస్తున్నానని .
వార్త రిపోర్టర్ కృష్ణారావు గారు నేనూ వస్తాస్వామీ అన్నారు. అక్కడకెళ్లాక శ్రీనివాసరావు గారి మితృడు గోరంట్లయ్యగారు కూడా వస్తానని బయలుదేరారు. యాదృచ్చికంగా ఆయన కృష్ణారావు గారికి మితృడట ఆయన కూడా రవ్వవరం పీఠానికి రావాలనుకుంటూన్నామని చెప్పారు .ముందుగా నలమల కొండలలో ఎదురైన నారసింహక్షేత్రాన్ని దర్శించాము .ఆతరువాత కాశినాయన ఆశ్రమం లో భోజనంచేసి అక్కడవున్న యోగనరశింహుని ఆతరువాత ఎగువ అహోబిళంలో స్వామిని దర్శించాము. అకాశాన్నంటుతున్నట్లున్న ఆగిరిశిఖరాల మధ్య స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం నాకు. ఎక్కడ కెళ్ళినా అమ్మ లక్ష్మీదేవి ఎంత దివ్యతేజస్సులువెదజల్లుతూ వున్నదో చెప్పలేను. అమ్మ ముందుకూర్చుని విష్ణుసహస్రనామ పారాయణం చేసుకుని ప్రసాదం కోసం నిలబడగా హఠాత్తుగా అర్చకస్వామి అమ్మ మెడలో చిన్నపూలమాల తెచ్చి నామెడలో వేశారు. అమ్మ అనుగ్రహానికి కళ్లవెంట నీళ్ళుతిరిగాయి . బిడ్డపట్ల అమ్మకుండే ప్రేమ ఇంకెవరికుంటుంది ? అమ్మ ప్రేమ అలాకురిపించింది ఈ దీనునిపై.
అక్కడే మాలావిరమణ చేసి అటునుండి దిగువ అహోబిళంలో లక్ష్మీనరసింహుని దర్శించుకున్నాము .అక్కడ చాలా గొప్పగా జరుగుతున్న విష్ణుయాగస్థలికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తూ ఆ నల్లమల కొండల నారసింహక్షేత్రంలో హనుమత్ రక్షాయాగం [నాలుగవ ఆవృత్తికి సంకల్పం చేసుకున్నాము] .నవనారసింహ క్షేత్రాలన్నీ దర్శించే కార్యక్రమాన్ని రూపొందించమని మితృలందరూ కోరగా అలావెళ్లాలని నిర్ణయం జరిగింది. అప్పుడు వీలైనవారు వస్తే తీసుకెలతాము. !
2 వ్యాఖ్యలు:
/వేడినవారికి దర్శనమీయవు,వలదనని నిన్ను వారించు వారిని వదలక వెంటా తిరిగెదవయ్యా ! అనిపాడిన బాలమురళీకృష్ణగారి పాట గుర్తుకొచ్చింది/
హరి హరీ! కృష్ణప్రేమ అనే చిత్రంలో 'మోహన రూప గోపాలా' అని సుమధురంగా ఆలపించింది నవరసాలశాల మన ఘంటసాలండి స్వామీ, ఘంటసాల! బాల మురళి అంటారేమిటండి? ఆ మాత్రం పోల్చుకునే శక్తి మీకు అమ్మ/అయ్య ఇవ్వనందుకు చింతిస్తున్నాను. ఇదేం బాగోలేదు.
'నమో నారసింహా నమో భక్త పాలా' అని ఎలుగెత్తింది ఎవరో చెప్పండి? పిఠాపురమో, పేకేటో అంటారేమో, వద్దులేండి, నేనేచెబుతా... అదీ ఘంటసాలే. సింహాచలము, మహా పుణ్య క్షేత్రము - ఇదీ ఆయనే. :))
నిజమేనండి మీరు చెప్పినది నిజం.నేనే పొరపాటుపడి అలావ్రాశాను
Post a Comment