ఆలయాలను ఈరకంగాఅభివృధ్దిపరచటం అవసరమా ?
>> Saturday, December 17, 2011
మనం ఇప్పుడు చాలాసార్లు వింటుంటాం .ఆలయాలను అభివృద్ధి పరుస్తున్నాం అనేమాటలు . దురదృష్టవశాత్తూమన ధార్మికక్షేత్రాలన్నీ \ ఎండోమెంట్ బకాసురుని చేతులలో చిక్కుకుని ఉన్నాయి . వీళ్లదృష్టిలో అభివృధ్ధి అంటే హుండి ఆదాయం పెరగటం . రకరకాలపూజల టిక్కెట్లు అమ్ముడుపోవటం . ఆథ్యాత్మికచింతనకన్నా ఆదాయవనరులను పెంచుకోవటమే వీళ్ల భావనలోఅభివృద్ధి . ఇక ఈరకం అభివృధ్ధి జరగటం మొదలవ్వగానే రాక్ష[జ]కీయులు ఆ భివృద్ధి లో పాలు "పంచుకోవాలని" ఎగబడతారు . అటుఆదాయం ఇటు అధికారం రెండూ ఉంటాయికనుక తమను ఫలానా ఆలయానికి ధర్మకర్తగా నియమించాలనే డిమాండ్లు పైరవీలు సాగిస్తుంటారు. మనదౌర్భాగ్యం కొద్దీ మన ఆలయాలకు ఎవరుధర్మకర్తగాఉండాలో నిర్ణయించే అధికారం కూడా విదేశీయులు విధర్మీయులచేతిలో ఉందిప్పుడు . కావాలంటే పరిశీలించండి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరీ కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లుకొట్టే మన నేతలరీతులు.
మనకేమో ఎప్పుడు హడావుడిగా వెళ్ళి మొక్కులుతీర్చుకొనివచ్చేసరికే సరిపోతుంది గాని ఆక్షేత్రాలుమనవనిగాని అక్కడ జరిగే అనాచారాలు అపచారాలనుఅడ్డుకోవటం కూడా మనబాధ్యతనే విషయంగాని గుర్తురాదు.అసలు వాటి గూర్చి పట్టించుకునే సమయంగానీ ఆలోచించాల్సిన అవసరంగాని లేవుగనుక మనం నోరెత్తం. ఇక వీళ్ల ఆగడాలకు అడ్డేముంది ? అందుకే నాకైతే ఈపుణ్యక్షేత్రాల అభివృధ్ధి అవసరంలేదేమోననిపిస్తుంది.
సరే ! ఈబాధంతా ఏమిటని మీరు విసుక్కుంటున్నారా ! విషయానికొస్తున్నాను .
ప్రస్తుతం హనుమదుపాసకుడైన ఓగొప్పసాధకుడు [నాకు గురుతుల్యులు ] మహాప్రముఖమైన ఓ హనుమత్ క్షేత్రం అభివృద్దిలోకి రాకపోవటం గూర్చి బాధపడుతూ ఆ క్షేత్రాన్ని అభివృధ్ధిపరచాలని కోరుతూ ఓ ఉద్యమం చేపట్టారు . వారి సంకల్పం గొప్పది . వారిశక్తి నాకు తెలుసు . కానీ ఇందుకు నామనసంగీకరించటంలేదు. అప్పటికీ వారితో చెప్పానుకూడా
గురువుగారూ ! అక్కడ వసతులు ఏర్పాటుచేస్తే ప్రకృతి అందాలన్నీ కనుమరుగవుతాయి. ఎప్పుడు అన్నివసతులుంటాయో అక్కడకు భక్తులు సాధకులకు బదులు విహార యాత్రికులతాకిడి ఎక్కువవుతుంది ,వీల్లకోసం వ్యాపారాలు మొదలవుతాయి ., ఇక అనాచారపరులు ,,డాంబికుల రద్దీతో అసలైన సాధకులకు ఈక్షేత్రంనుండి అందవలసిన శక్తిప్రసరణ ఆగిపోతుంది . ప్రస్తుతం మనం పుణ్యక్షేత్రాలలో చూస్తున్నవారిలో ఎనభైశాతంమంది శ్రధ్ధాసక్తులు తక్కువగాఉన్నవారే .[క్షమించాలి ఆ ఎనభైశాతంలో నేనూ ఒకణ్ణికావచ్చు] భక్తికంటే భయం ఎక్కువ ఉన్నవాళ్లు . ఓనమస్కారం పడెస్తే పోలా ! అనే మనస్తత్వం . కష్టాలకోర్వరు. సులభంగా దర్శనమయ్యే అవకాశం ఉంటే భక్తులనేకాదు భగవంతుణ్ణికూడా మోసం చేయటానికి వెనుకాడరు . దైవసాన్నిధ్యంలో ఉండాల్సిన వినయం, సహనం లేనివాళ్లు ఎక్కువ .
వీళ్ల ఆశను ,అవసరాలను సొమ్ముచేసుకునే వ్యాపారులు,దోపిడి ముఠాలతో ఆయాశక్తిక్షేత్రాలలో పవిత్రవాతావరణం కలుషితమవుతుంది. ఈ అభివృద్దే లేదనుకోండి , కావాలనుకున్నవాడు కేవలం స్వామి మీదనమ్మకమున్నవాళ్లు ఎలానూ వెళతారు . ఫలితం కూడా ఆలానే ఉంటుంది .మీరు పెద్దలు చెప్పదగ్గంతవాణ్ణికాను అని విన్నవించాను
కానీ స్వామి పట్ల వారికున్న ఆవేదన వలన వారు భక్తితో ఈ ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారు. పెద్దలు వారి భక్తి శక్తి అనన్యసామాన్యము .కనుక వారి సంకల్పం వృధాపోదు. కానీ నాకుమాత్రం ఆపచ్చని ప్రకృతి,మనసువెంటనే భగవంతునిపై లయమయే ప్రశాంతవాతావరణం కనుమరుగవుతాయేమోననే భయం మాత్రం పోవటం లేదు .
జైశ్రీరాం
1 వ్యాఖ్యలు:
అవునండీ. చాలా ఆలయాలని అభివృద్ధి పేరిట కంపరం కలిగించే రంగులతో, గ్రానైట్ రాళ్లతో, ఏసీలతో నింపి,షాపులతో ఒక షాపింగ్ కాంప్లెక్స్‌ని తలపించేలా అభివృద్ధి చేసి ప్రాచీన కట్టడాలకి ఆ విలువ లేకుండా చేస్తున్నారు.
Post a Comment