శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవతా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయబడుచున్నది ఇది సాధ్యమా?

>> Saturday, September 5, 2015

* దేవతలలో ఒకరయిన శుక్రాచార్యులు దేవ శత్రువులైన రాక్షసులకు గురుత్వం వహించటమేమిటి?
- యన్.రామలక్ష్మి, సికిందరాబాదు
దేవతలు, రాక్షసులు అని సినిమాలో చూపించినట్లుగా వింత విశేషాలతో విడివిడిగా లేరు. వారిద్దరూ ఒకే తండ్రి బిడ్డలు. ఆ తండ్రి పేరు కశ్యపుడు. ఆయనకు దితి అనే భార్యయందు కలిగిన సంతానమే దైత్యులు, లేక రాక్షసులు. అదితి అనే భార్యయందు కలిగిన సంతానమే ఆదితేయులు, లేక దేవతలు. అందువల్ల వారి తండ్రి వారిద్దరికీ ఉత్తములైన గురువుల్నే ఏర్పాటుచేశాడు. కానీ రాక్షసులు తమోగుణ ప్రవృత్తివల్ల ధర్మానికి దూరంగా జరిగారు. అది వారి దురదృష్టం.
* రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచిన వెంటనే, కొన్ని వేదమంత్రాలు చదవాలనీ కొందరి వాదన. ఇంతకీ ఆ మంత్రాలు తెలుపగలరు.
- యన్.సురేంద్ర, విశాఖపట్నం
మంత్రాలు కాదు, శ్లోకాలు. ఎవరికి ఏ ఇష్టదైవం వుంటుందో, ఆ దైవానికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు చదువుకొని ధ్యానించి, నిద్రించాలి. మళ్ళీ మర్నాడు నిద్రలేస్తూనే- ‘‘కరాగ్రే వసతే లక్ష్మీః- కరమధ్యే సరస్వతీ, కరమూలే తు గౌరీ స్యాత్- ప్రభాతే కరదర్శనం’’ అనే శ్లోకం చెప్పుకుని, మునుముందుగా తన అరచేతిని చూసుకుని, ఆ వెంటనే ఇష్టదేవతా శ్లోకాలు చెప్పుకుంటూ నిత్య కార్యక్రమాలకు ఉపక్రమించాలి.
* తెలిసి చేసిన తప్పులకు, పొరపాట్లకు పరిహారం ఏమిటి? - రామారావు, మిర్యాలగూడ
మానవులు చాలారకాల తప్పులను తెలిసే చేస్తారు. అది ఒక దురదృష్టం. అలాంటి పాపాలకు విహిత పరిహారాలను మరింత సమధిక శ్రద్ధతో చేసుకోవటమే కర్తవ్యం. దానితోపాటు ఈ పాపాలను మళ్ళీ చేయననే దృఢ నిశ్చయాన్ని స్వీకరించటం ఎంతో ముఖ్యం! చేసిన తరువాత గూడా ఇవి తప్పులని తెలియని పాపాలకు నిత్య భగవన్నామస్మరణమే ప్రాయశ్చిత్తం.
* దేవతా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయబడుచున్నది ఇది సాధ్యమా? - వి.బాలకేశవులు, గిద్దలూరు
ఒక శక్తి మరో శక్తిగా మారటం లోకంలో వున్న విషయమే. ఉదాహరణకు విద్యుచ్ఛక్తి చలనశక్తిగామారి ఫ్యాను తిరుగుతోంది. ఐతే, దీనికి వైర్ వైండింగ్ వగైరా ప్రక్రియ కొంత కావాలి. అలాగే మహర్షి నిర్దిష్టమైన ప్రక్రియలో వేద మంత్రోచ్ఛారణ చేస్తే, ఆ శబ్దశక్తి దేవతా ప్రాణశక్తిగా మారటం సాధ్యమే.
* పాంచాలిఅంటే పంచభర్తలకు భార్య అనా అర్థం?
-సుధ, హైద్రాబాదు
పాంచాలమనేది ఒక దేశం. ఆ దేశాన్ని ఏలే రాజు పాంచాలుడు. అతని పుత్రిక పాంచాలి. అంతేగానీ పంచభర్తలకు సంబంధం లేదు.
* గురువుగారి ఉపదేశం లేకుండా మహామంత్రాలను జపించవచ్చునా? - రామారావు, నెల్లూర్
మంత్రం ఎంత గొప్పదైనా యోగ్యుడైన గురువుదగ్గర్నుంచి యోగ్యమైన విధానంలో దానిని ఉపదేశంగా స్వీకరించకపోతే దానికి మంత్రత్వమే ఉండదని మంత్రశాస్త్రం చెబుతోంది. కనుక, ఉపదేశ పూర్వకంగా జపాద్యనుష్ఠానాలు చేయటమే ఉత్తమం.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ధర్మసందేహాలు
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.

1 వ్యాఖ్యలు:

Zilebi September 6, 2015 at 7:07 PM  

దేవతా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయబడుచున్నది ఇది సాధ్యమా? -

తల్లి తనుబాలు తో పిల్లవాడి ప్రాణం 'పటిష్టం' గా చేసేంత సాధ్యం గా సాధ్యం.

జిలేబి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP