శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గల్ఫ్ లేఖ .. మతాంతరీకరణలు - మొహమ్మద్ ఇర్ఫాన్

>> Sunday, December 18, 2011

గల్ఫ్ లేఖ

మతాంతరీకరణలు
- మొహమ్మద్ ఇర్ఫాన్

విశ్వంలోని పురాతన నాగరికతలలో హైందవ నాగరికత ఒకటి. హైందవ సమాజం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రపంచంలోని అనేక ఇతర మతస్థులకు ఆశ్రయం కల్పించింది. ఇరుగు పొరుగు రాజ్యాలు, దూరదేశాల నుంచి వచ్చిన ముస్లింలు, జొరాస్ట్రియన్లు, యూదులు, క్రైస్తవులు అందరికీ ఆశ్రయం ఇచ్చి ఆయా మతాలు భారత ఉపఖండంలో వర్ధిల్లడానికి హిందూ ఉదారత దోహదపడింది. హిందూ మతానికి ఉన్న ఓర్పు, సహనం ఇతర మతాలకు లేవని చెప్పవచ్చు.

అయితే గల్ఫ్ దేశాలలో హిందూ మతాన్ని పూర్తిగా అణగదొక్కుతున్నారు. తమ ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికై అప్పులు సప్పులు చేసి గల్ఫ్ దేశాలకు ఆంధ్రులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ వారిలో అనేక మంది మోసపోతున్నారు. కఠోరమైన పనులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొందరు మెరుగైన బ్రతుకుదెరువు కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో మతమార్పిడి చేసుకొంటున్నారు. గల్ఫ్ దేశాలలోని జైళ్ళలో, ఆసుపత్రులలో సంవత్సరాల తరబడి పడిఉంటున్న భారతీయులలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. వారిని చేరదీసి ఉపకారం చేసి గత్యంతరం లేని పరిస్థితులలో మతం మారేట్లు చేస్తున్నారు.

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న విదేశీయులలో ఫిలిప్పీన్స్ క్రైస్తవులు, భారతీయ హిందువులు మతమార్పిడికి లక్ష్యంగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గల్ఫ్ దేశాలలోని భారతీయ ఎంబసీలలో పేర్లు, మతం మార్పిడికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అత్యధికులు పేర్ల మార్పిడి చేసుకోకుండానే నూతన మతాన్ని స్వీకరిస్తున్నారు. సౌదీ ఆరేబియాలో హిందువుల అంతిమ క్రియలు నిషేధం. కనీసం హిందూ దేవతల ఫోటోలను కూడా ఆ దేశంలో అనుమతించరు.

ఇతర మతాల కంటే ఒక్క హిందువుకు మాత్రమే ప్రాణ నష్టం కేసులలో నష్టపరిహారం అతి తక్కువగా చెల్లించే విధంగా సౌదీ అరేబియా చట్టాలున్నాయి. దీనికి తగినట్లుగా లౌకిక భారతదేశంలో బిజెపితో సహా అన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకూ సౌదీలో కేవలం ముస్లింలనే భారతీయ రాయబారిగా నియమిస్తున్నాయి. భారతదేశానికి సన్నిహిత దేశమైన యు.ఏ.ఇలో మిగిలిన అరబ్ దేశాల కంటే హిందువులు ఎక్కువ ఉన్నారు. యు.ఏ.ఇ స్థానిక జనాభాలో 17 శాతం హిందువులున్నారు. యు.ఏ.ఇ ఆర్ధికాభివృద్ధిలో వీరిపాత్ర గణనీయంగా ఉంది.

అయినా దుబాయిలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం విస్తరణకు నోచుకోలేదు. ఈ దేవాలయాన్ని బ్రిటీష్ హయాంలో గుజరాతీ సింధూ అయిన షరాఫ్ బాయి ఒక చిన్న గదిలో నిర్మించారు. రంజాన్ మాసంలో ఉపవాసం వేళలలో హిందూ భక్తులకు ప్రసాదం కూడా ఇవ్వరు. కృష్ణ మందిర్‌గా ప్రాచుర్యం పొందిన ఈ దేవాలయంలోనే గురుద్వారా కూడా ఉంది.

హిందువుల దహన సంస్కారాలకు దుబాయి, ఆబుదాబి మున్సిపాలిటీలకు పర్యావరణ కాలుష్య పన్ను చెల్లించడం అనేది మరో నగ్న సత్యం. గుజరాతీ సంతతికి చెందిన హిందువులు పౌరసత్వం కలిగిన ఒమాన్ గల్ఫ్‌లోని మిగతా వాటి కంటే అత్యంత ఉదార దేశం. కానీ ఒమాన్‌లోని సలాల వద్ద కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కార్మికులు 14 మంది (అందరూ హిందూ మతస్తులే) మరణిస్తే కనీసం పట్టించుకొనే వారు ఎవరూ లేకపోయారు. గల్ఫ్‌లో హిందువుల దుర్భర ధార్మిక జీవితానికి ఈ కొన్ని ఉదాహరణలు చాలు.

గల్ఫ్‌లో ఇస్లాం అధికారిక మతం కావడంతో సంఘ్‌పరివార్ కార్యకలాపాలు కేవలం ఉన్నత ఉద్యోగాలు చేసే కొందరిలో భజనలు వరకు మాత్రమే పరిమితమయ్యాయి. క్రింది స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కార్మికులకు దీనితో సంబంధం లేదు. విశ్వహిందూ పరిషత్ వారికి ఈ విషయం తెలిసినా ఆ సంస్థ వారు ఇక్కడి సామాజిక పరిస్థితుల వల్ల దీన్ని అడ్డుకోలేక మౌనంగా మిన్నకుండిపోతున్నారు. సహచర తెలుగు వ్యక్తి విలవిలలాడితే ఏ తెలుగువాడు పట్టించుకోడు. అదే ఎక్కడో ఇథియోపియా, బ్రిటన్ లేదా మన దేశంలోని గోవా లేదా కేరళ క్రైస్తవులు మాత్రం వీరిని పట్టించుకొంటారు, ఆదరిస్తారు. వారి సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు.

సౌదీ ఆరేబియాలో మతం మార్పిడి చేసుకొన్న వారికి పోలీసులు ప్రత్యేకమైన సర్టిఫికెట్ ఇస్తూ రెసిడెన్సీ వీసాలో కూడా దీన్ని ఎండార్స్ చేస్తారు. వ్యభిచారం, జూదం, మానవ హక్కుల ఉల్లంఘన అన్నింటికి కేంద్రంగా ఉన్న దుబాయి సమాజ ఉదారవాదం, హిందువు అనే విషయానికి వచ్చేసరికి మారిపోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రాస్ అల్ ఖైమా, అబుదాబి, షార్జా, దుబాయి ఎమిరేట్లలో దీని కార్యకలాపాలు అధికంగా ఉంటాయి.

దుబాయి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇస్లాం పుచ్చుకొని ఖురాన్ కంఠస్ధం చేస్తే శిక్షా కాలాన్ని తగ్గించేందుకు దుబాయి రాజు షేఖ్ మొహ్మద్ మఖ్తూం హుకుం జారీ చేశారు. దుబాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్లాహీ సెంటర్ మతమార్పిడి చేస్తుంది. దివంగత అబుదాబి రాజు షేఖ్ జాయాద్ అల్‌నహ్యాన్ తన పేరిట అల్ అయిన్‌లో మతమార్పిడి కేంద్రాన్ని స్థాపించారు. కువైట్‌లో 28 సంవత్సరాలుగా ఐపిసి అనే సంస్ధ అన్యమతస్థులను ఇస్లాంలో చేర్చడానికి కృషి చేస్తోంది. ఖతర్‌లోని ఇస్లామిక్ సంస్ధ ఫనార్ ప్రతి సంవత్సరం వేయి మందికి పైగా ఇతర మతస్తులను ఇస్లాంలో చేర్పిస్తుంది.

గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఆంధ్రుల సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే విద్యాధికులైన ఉన్నత ఉద్యోగులలో, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన చెందిన హిందూ, ముస్లిం ఇతర మతాలకు చెందిన వారిలో మతమౌఢ్యం బాగా ఉంది. అదే గ్రామీణ ప్రాంతాలకు చెందిన హిందు, ముస్లిం కార్మికులలో మాత్రం సంతృప్తికరమైన సాన్నిహిత్యం, సద్భావన ఉంది.
మహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)


1 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni December 19, 2011 at 10:24 AM  

MANCHI VISHAYAM SHARE CHESAARU. THANK YOU VERY MUCH.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP