శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ప్రపంచము బ్రహ్మము

>> Monday, November 14, 2011

ప్రపంచము బ్రహ్మము

ప్రాణము, ప్రాణధారియైన జీవుడు అనాది. జీవుడికి ఆధారం ఆత్మ కనుక, జీవాత్మగా గుర్తించబడుతున్నాడు. జీవుడిది ప్రసవం. కర్మ, ప్రాప్తి, ప్రారబ్ధం వున్నవి కనుక జీవుడిది బంధనతో, నిబంధనతో కూడిన రాక. ఇవేవీ లేని ముక్తుడూ ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు. వాడిది ప్రవేశం, అనుప్రవేశం, ప్రభవం! కనుక మనవంటి జన్మఎత్తినట్లు అనిపించినా, మనకున్నటువంటి అంగాంగీ భావంతో ఉన్న శరీరధారిగా కనిపించినా, ప్రపంచంలో వుంటున్నా, 'బ్రహ్మము వలె సంచారం' చేస్తాడు. కర్మలు చేస్తున్నట్లున్నా కర్మానుభవం వుండదు. అందువలన కర్మబంధన లేదు. ఇవన్నీ వున్న జీవుడి వలె తరచుగా ఈ ప్రపంచంలోకి రాదు. రావటానికి బలమైన కారణం ఉంటే గాని, బ్రహ్మము ఈ సంసారంలో ప్రవేశించదు.

తారకమంత్రం
మానవదేహం ధరించి, జీవాత్మగా వుండి, ప్రాపంచిక కార్యకలాపాలను సాగించి, ప్రజ్ఞతో, ప్రతిభతో కొనసాగించి, కాలము, ప్రారబ్ధమూ కలిసివస్తే మంచి పనులు చేసి, అనాహతం వరకు చేరుకుని, అహంకారం చేత, ప్రమత్తత చేత, మదము చేత, అవిద్య చేత, అస్పష్టత చేత, అక్కడ నుంచి మూలాధారంలో పడిపోవటం, యెగభ్రష్టత! చేరవలసిన బ్రహ్మస్థానం చేరుకుని, నిరతిశయానందమగ్నుడై, ముక్తుడై, పరముక్తి స్వరూపంగా వుండి కూడా, ఈ సంసారానికి అంటే ప్రపంచానికి ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా, బ్రహ్మము తనను తాను ఈ సంసారంలోకి ప్రవేశపెట్టుకుని, ప్రభవించటం భ్రష్టయోగిత్వం! యోగభ్రష్టుడు బద్ధుడు. భ్రష్టయోగి నిబద్ధుడు. శుద్ధబుద్ధాత్మకమైన సాకార చైతన్యం.

ఈ రెండు స్థితులూ జీవులుగా వచ్చి, వుండి వెళ్లేవే! కాకపోతే జీవుడు ప్రభావానికి లోబడి వస్తాడు. బ్రహ్మము, స్వభావంలోకి అంటే ఆత్మభావంలోకి జీవుడిని నడిపించటానికి వస్తాడు. నడవవలసింది జీవుడే! అనాదిగా వున్న సంసారం, పరిణామం చెందుతూ, ప్రభావానికి లోనౌతూ, జీవుడిని ప్రవృత్తి మార్గంలో నడిపిస్తుంది. నివృత్తి మార్గంలోకి వెళ్లటమే జీవుడి ప్రధాన కర్తవ్యం. అంటే తన మూలాల్లోకి తాను వెళ ్లటమే. దానికి సంసారమే కార్య భూమిక. సంసారమొక దివ్యక్షేత్రం. అదే కురుక్షేత్రం.

జీవుడు తనలో ఉన్న సహస్ర దుర్గుణ క్షోణిని జయించుకుంటూ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనబడే సులక్షణ ఆయుధాలను వాడుకుంటూ, తనపై తాను యుద్ధం సాగించాలి. విజయం సాధించాలి. తన శరీరాంతర్గతమైన వర్గాలను నిర్మూలనం చేసి, అయోధ్యగా మార్చుకోవాలి. ఆత్మారాముడిని, యోగీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. భ్రమరకీటక న్యాయంలో జీవుడు రాముడు కావాలి. జీవుడు సర్వానందరూపమైన కృష్ణుడు కావాలి. తనను తాను ఎరగాలి. ఎరుకలో సర్వమూ బ్రహ్మమనే నిశ్చితానుభవంలో నిలకడ చెందాలి. అదే తారకం. ఇదేమీ జరగకపోవటమే మారకం.

జీవుడూ బ్రహ్మమే
సంసారం ఒక సాధారణ భూమిక. ఇది బ్రహ్మమయం. పాలలో వెన్నను పట్టుకున్నట్లు సంసారానికి మూలమైన బ్రహ్మమును సాధించుకోవాలి. బ్రహ్మముగా జీవించాలి. బ్రహ్మముగా పరముక్తిని ఈ ప్రపంచంలో అనుభవించాలి. తన మూలము బ్రహ్మమన్న స్పృహ కలిగినపుడు, తన బంధము బ్రహ్మముతోనే వుండాలి గాని, భ్రమాత్మకమైన ప్రపంచంతో కాదు. ప్రపంచం బ్రహ్మమేనని భావించిన వాడికి, ఈ స్పర్థలేదు. అట్టివాడు ఆనందస్వరూపుడు. తాటికాయ కోయాలంటే తాటిచెట్టు ఎక్కాలి. కోసుకున్న తరువాత కిందకు దిగాలి. తాటిచెట్టు నీడ నేలమీద పరుచుకుని వున్నా, కాయలన్నీ అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తున్నా, కాయ లభిస్తుందా? ఆ విధంగానే బ్రహ్మమే ప్రపంచంగా ఉన్నా, ప్రపంచాతీత సాధనాఫలంగా బ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ కనిపిస్తున్న ప్రపంచానికి బ్రహ్మమే మూలం. ఇపుడు కనిపిస్తున్నదంటే, ఇది ఇంతకు ముందే వున్నది.

ఇపుడు అభివ్యక్తమైంది. కనుక ప్రపంచం అనాది. ఇపుడున్నది కనుక మధ్యలోనూ వున్నది. ఇది ఇట్లాగే ఉండదు కనుక అంతమెరుగనిది. అది, మధ్యాంత రహితం కనుక యిది సత్. సృష్టికి మూలము బ్రహ్మము. బ్రహ్మము కానిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు. కనుక బ్రహ్మమే ప్రపంచంగా ప్రకాశిస్తున్నది. మూలపీఠం బ్రహ్మం. ఆధారపీఠం ప్రపంచం. ప్రపంచంలో భాగమైన జీవుడు బ్రహ్మమే. అనాదియైన ప్రపంచం రాబోయే కాలంలోనూ అభివ్యక్తమౌతుంది కనుక రూప, నామ భేదం వున్నా ప్రపంచం బ్రహ్మ స్వరూపంగా కనపడుతున్నది.

దేశం, ప్రదేశం, నైసర్గికంగా అనేక పేర్లతో, అనేక జాతులతో, అనేక భాషలతో, అనేక భావాలతో వున్నా, సమస్త సృష్టీ బ్రహ్మరూపమే. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా వెలుగుతున్న కాలస్వరూపం బ్రహ్మమే. శ్రీ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణాది స్వరూపాలు బ్రహ్మమే. అనంతకోటి గురు స్వరూపాలు, అవతార మూర్తులు బ్రహ్మమే. అంతెందుకు? మిన్ను, మన్ను బ్రహ్మమే.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP