శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అత్యాశ ఆపదలకు మూలమని వీళ్ళు చదవలేదా ?

>> Monday, November 14, 2011

ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈవ్యాసం చదివాక అత్యాశ ఎంతవినాశకరమో మనకు చెప్పిన చదువులెందుకు వంతబట్తటం లేదో ఆశ్చర్యమే ! ఎక్కడున్నది లోపం .కోల్పోయిన మనదైన చదువులవిలువ ఈతరం తెలుసుకుంటుందా ? లేక కలిమాయలోపడి పదిమంది నోటికాడిది ఒక్కరేపోగేసుకోవాలనే రాక్షసప్రయత్నాలతో వినాశనంవైపుసాగుతూనే ఉంటుందా ?
-------------------------------------------------------


ఆంధ్రజ్యోతి నుండి ఈక్రింది వ్యాసం చదవండి]

అత్యాశతో అష్టకష్టాలు
తరాలు తిన్నా తరగని సంపద
ఇంకా కావాలన్న దురాశ

గాలి, కోనేరు, కల్మాడీ, రాజా, కనిమొళి
రాజగోపాల్, శ్రీలక్ష్మి.. అందరిదీ అదే అంతు

హైదరాబాద్, నవంబర్ 13 : "దురాశ దుఃఖమునకు చేటు'' ..అనే పాఠాన్ని వారెవ్వరూ చిన్నప్పుడు చదువుకొని ఉండరు! అందుకే ఉన్నదాంతో తృప్తిపడక ఆశగా అంతులేని సంపద పోగేసుకుంటారు! నాలుగు రాళ్లు వెనకేసుకొని సుఖంగా ఉందామన్న సామాన్యుల తరహా ఆశ కాదది.. మంది సొమ్ము తామొక్కరమేబొక్కేయాలన్న దురాశ!

నాలుగు ముద్దలు తింటే తీరే ఆకలి కాదది.. ఎంత వెనకేసినా తీరని తనివి! తరాలు తిన్నా తరగనంత సంపద ఉన్నా.. ఇంకా ఏదో కావాలనే ఆబ! గనుల దొంగ గాలి జనార్దనరెడ్డి నుంచి.. విల్లా మాయల కోనేరు ప్రసాద్ దాకా.. అందినకాడికి రెండుచేతులా దోచుకుని ఇప్పుడు శ్రీకృష్ణజన్మస్థానంలో ఊచలు లెక్కబెడుతున్న ఆశపోతు మాయల మరాఠీలందరిదీ అదే తంతు!!

"నా జీవితం నాశనమై పోయింది. కుంగిపోయాను. 40 ఏళ్లుగా దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నా ఒక్క మచ్చా లేదు. ఇప్పుడు కస్టడీలో పరిస్థితి దారుణంగా ఉంది. తాగడానికి శుభ్రమైన నీళ్లు కూడా లేవు. అయ్యప్పమాలలో ఉన్న నాకు కనీసం పూజ చేసుకునే అవకాశం లేకుండా పోయింది'' ..ఎమ్మార్ అక్రమాల కేసులో అరెస్టై సీబీఐ కస్టడీకి చేరిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ దీనాలాపన ఇది! కోర్టులో న్యాయమూర్తి ఎదుట కన్నీటిపర్యంతమై చెప్పుకొన్న వ్యథ. కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారి ఇవాళ తనకో చాప, ఫ్యాను, మంచినీళ్లు ఇస్తే చాలని మొరపెట్టుకుంటున్నారు.

నిన్నటిదాకారాజభోగాలు అనుభవించిన ప్రసాద్‌ను చూసి కుటుంబ సభ్యులూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఒక్క కోనేరు మాత్రమే కాదు.. దేశంలో ఇటీవలి కాలంలో బోనెక్కుతున్న దొరబాబులంతా ఇలా 'డబ్బు' చేసినవాళ్లే! ఎంత తిన్నా ఆశ చావక ఇంకా ఇంకా తినీతినీ చివరికి కథ అడ్డం తిరిగి చట్టానికి దొరికిపోయినవారే! రాజా, కల్మాడీ, కనిమొళి, గాలి జనార్దన్‌రెడ్డి, కోనేరు ప్రసాద్, రాజగోపాల్, శ్రీలక్ష్మి... ఇలా చెప్పుకుంటూపోతే ఈ చిట్టా చాంతాడంత. 'నేరం నాది కాదు ఆకలిది' అని మనకో సినిమా ఉంది.

వీళ్లెవరూ అలా ఆకలితో నేరాలు చేసిన వాళ్లు కారు. మరొకరి ఆకలి తీర్చడానికి నేరాలు చేసిన అపర రాబిన్‌హుడ్‌లూ కారు. దురాశకు నిలువెత్తు ప్రతిరూపాలు. అంతులేని డబ్బు ఆకలితో ఆర్థిక నేరాలకు బరితెగించిన స్వార్థపరులు. అంతా సమాజంలో ఆర్థికంగా ఉన్నత వర్గాలకు చెందినవారే! కోట్లకు పడగలెత్తిన శ్రీమంతులే. వీరిలో కొందరైతే నోట్లో బంగారు చెంచాలతో పుట్టిన కోటీశ్వరుల వారసులే! ఉన్నదాంతో తృప్తిపడక అధికారాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు వేట సాగించారు. ఉదాహరణకు.. సురేశ్ కల్మాడీనే తీసుకుందాం.

కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతికి పాల్పడి దేశం పరువుతీసిన ఈయన.. అప్పటికే కోటీశ్వరుడు. ఇక.. టెలికం మాజీ మంత్రి ఏ రాజా కూడా కోటీశ్వరుడే. కనిమొళి అయితే.. ఒక రాష్ట్రాన్ని ఏలిన రాజకీయ కుటుంబానికి వారసురాలు. రూ.వేల కోట్లకు పడగలెత్తిన కరుణానిధి కుమార్తె. గనుల గాలి జనార్దనరెడ్డిదీ ఇదే కథ. గాలి వాదన ప్రకారమే చూస్తే.. ఓబుళాపురం గనుల లీజుకు ముందే ఆయన శ్రీమంతుడు.

కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనాపాఠీ. అటువంటి వ్యక్తి చట్టం కళ్లుగప్పి అక్రమాలకు పాల్పడి, రూ.కోట్లు కొల్లగొట్టి, ఇవాళ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. జైల్లో ఇప్పుడీయన మొక్కని దేవుడు లేడు! పూజించని రాయీరప్పా లేదు! సాష్టాంగం పడితే కనీసం పావుగంట దాకా ప్రార్థన ముగించట్లేదంటే మానసికంగా ఎంతగా దెబ్బతిని ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వీరంతా వ్యాపారులు. ఆర్జనే ధ్యేయంగా వ్యవహరించడంలో ఆశ్చర్యం లేదు.

కానీ.. లక్షణంగా లక్షలు సంపాదించుకోగలిగిన పెద్దపెద్ద హోదాల్లో పనిచేసిన రాజగోపాల్, శ్రీలక్ష్మి తదితర అధికారుల దురాశ మరీ దారుణం. ప్రజలకు సేవ చేయాల్సిన ఐఏఎస్ అధికారుల దురాశకు ఏం పేరు పెట్టాలి? గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ పదవీ విరమణ చేశాక కూడా.. తన పాత పాపాలకు ఫలితం అనుభవిస్తున్నారు.

ఇక శ్రీలక్ష్మి.. అనారోగ్యం సాకుతో బయటకు కనపడకుండా దాక్కుంటూ సీబీఐ అధికారులు తననెప్పుడు అరెస్టు చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఈ పెద్ద మనుషులెవ్వరూ "దురాశ దుఃఖమునకు చేటు'' అని చిన్నప్పుడు బడిలో చదవలేదా? అని అనుమానమేస్తుంది. చదివే ఉంటే ఇవాళ వారి కథల్లో ఇలా విషాదఘట్టాలు ఉండేవి కావేమో బహుశా! కనీసం వీరి కథలైనా అక్రమార్కులకు కనువిప్పు కలిగిస్తే వ్యవస్థ బాగుపడుతుందనడంలో సందేహం లేదు.

1 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ November 14, 2011 at 8:44 AM  

గాలి జనార్దనరెడ్డి ఓబుళాపురం గనుల లీజుకు ముందే ఆయన శ్రీమంతుడు.
ఎనభైవ శతకంలో తాడిపత్రిలో ఎన్నోబుల్ ఇండియా చిట్ కంపెనీలో పనిచేస్తూ సైకిల్‍లో తిరిగేవాడట.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP