రాముడు గొప్పా ? రామనామము గొప్పదా ?
>> Sunday, October 30, 2011
భగవంతుడూ, ఆయన నామమూ వేరుకావు. అలాగే, రాముని కంటే రామనామమే గొప్పది. నిర్మలమైన మనస్సుతో రామనామాన్ని నిశ్చలంగా జపిస్తూ వున్న హనుమంతునిపై ఆ శ్రీరాముడే బాణం వేసినప్పటికీ అది ఆయనను ఏమీ చేయలేకపోయింది. అలాగే వేలకొలది బంగారు నాణాలకీ, నగలకీ, సంపదకీ సరితూగని శ్రీకృష్ణుడు రుక్మిణి భక్తితో భగవన్నామాన్ని రాసిన తులసీదళాన్ని త్రాసులో వేయగానే, చటుక్కున బరువు సరితూగింది.
ఈ రెండు ఉదాహరణల నుంచి మనం చాలా తెలుసుకోవాలి. అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి ప్రయోజనం ఏమిటి? భవమనే ఈ నదిని దాటటం ఎలాగో తెలుసుకోవటమే ఆవశ్యకం. పక్షి కంటిని మాత్రమే ఎవరైతే చూస్తారో వారు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలరు. భగవంతుడు ఒకడేసత్యం, తక్కినదంతా అసత్యం అని ఎవరు గ్రహిస్తారో వారే ఉత్తములు. సేవించబడేవాడూ హరియే, సేవిస్తున్నవాడూ హరియే అన్న భావన పూర్ణజ్ఞానానికి నిదర్శనం. మొదట సచ్చిదానందాన్ని పొందాలి. ఆ తర్వాత ఆయనే సమస్త జీవజగత్తులుగా అయివుండటం దర్శించవచ్చు. నధులన్నీ చివరకు ఆకాశతత్వంలో లీనమవుతున్నాయి.
ఒక్క దాన్లోనే భగవంతుని దర్శించేవాడు పరిమితుడైన జ్ఞాని. కానీ యోగి మార్గం వేరు. అతడు పరమాత్మను చేరుకుంటాడు. తిరిగి రాడు, ఆ పరమాత్మలోనే కలిసిపోతాడు. భక్తులలో కూడా మూడు తరగతులున్నాయంటూ వారి గురించి ఇలా వివరించారు రామ కృష్ణ పరమహంస.
చాలా మామూలు భక్తుడు ఆకాశాన్ని చూపుతూ 'దేవుడు అల్లదిగో, అక్కడుంటాడు అని ఆకాశాన్ని చూపుతాడు. మధ్యశ్రేణి భక్తుడు, భగవంతుడు ఎక్కడో లేడు, హృదయంలో అంతర్యామిగా నిండి వున్నాడంటాడు. ఉత్తమ భక్తుడు వీరికి భిన్నంగా - అంతటా ఆ భగవంతుడే నిండివున్నాడు, మనకు కనిపిస్తున్నదంతా ఆ భగవంతుని విభిన్న రూపాలేనంటాడు. భగవద్దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి. వినటం వేరు, చూడటం వేరు. వినటం వల్ల పదహారణాల విశ్వాసం కలుగదు, చూసిన తర్వాత నమ్మకపోవడమంటూ వుండదు. భగవంతుని దర్శనంతో కర్మత్యాగం సంభవిస్తుంది.
ధ్యానానికి నియమాలేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ గంగాతీరం ఎంత పవిత్రమైనదో, మురికిగా వున్న స్థలం కూడా అంతే పవిత్రమైనది. ఇదంతా భగవంతుని స్వరూపమని పేర్కొనబడుతోంది. కనుక దేవుని ధ్యానించటానికి చోటును వెతుక్కోనక్కరలేదు. హృదయమే భేషయిన స్థానం. నీకు ఇష్టం వచ్చినచోట కూర్చొని హాయిగా ధ్యానం చేసుకోవచ్చునంటారు.
3 వ్యాఖ్యలు:
చాలా చక్కటి పోస్ట్ అండి.
అయితే, ఈ టపా చదివిన తరువాత " దైవము దైవనామము " విషయంలో నాకు ఇలా కూడా అనిపించిందండి. ( ఇక్కడ వ్రాస్తున్నందుకు దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దండి. )
రాములవారి నామమూ గొప్పదే. రామనామమూ గొప్పదే. తప్పనిపరిస్థితిలో రాములవారు హనుమంతుల వారిపై బాణం వేసినా ..........రామునికి హనుమంతునియందుగల అపారమైన వాత్సల్యం వల్ల హనుమంతునికి ఏమీ హాని జరగలేదు. అనీ,
ఇక శ్రీకృష్ణ తులాభారం సంఘటన నుండి ......... సంపద, ఆడంబరంతో కూడిన భక్తే అవసరంలేదు. నిరాడంబరమైన ప్రేమ భక్తి ఉన్నా చాలు భగవంతుని మెప్పించవచ్చు అని కూడా మనం నేర్చుకోవచ్చు అనీ అనిపించిందండి.
తప్పులుంటే దయచేసి క్షమించండి..
ఇలా చెప్పాలనుకున్నానండి. ....... రాములవారూ గొప్పవారే...........రాములవారి నామమూ గొప్పదే అని.
ఓం రాం రామాయ నమః చాలా చక్కగా వివరించారు.
Post a Comment