మన బిడ్డలకు సకలశుభాలు కలిగించాలని ఆ భోళాశంకరుని కీర్తిద్దాం .... ప్రార్థిదాం
>> Tuesday, November 1, 2011
అపమృత్యువును తొలగించి ఆపదలను బాపువాడు ఆదిదేవుడు పరమశివుడు. ఆర్తితో తనను తలచినవారి కెల్ల కొంగుబంగారమై నిలుస్తాడు. అందుకోసం ఆయన మనం ఏదో గొప్పగా పూజలు చేస్తారేమో నని ఎదురుచూడడు. తననుతలచినచాలు ప్రసన్నుడైపోతాడు. భక్తులంటే అంతప్రీతి ఆభోళాశంకరునకు .
మనం బిడ్డలను మాత్రమే కనగలం వారి జాతకాన్ని కనలేముకదా ! మనమెంత జాగ్రత్తలు తీసుకున్నా వారి జాతకాన్ననుసరించి వచ్చే ఇబ్బందులు,ఆపదలు నివారించలేము . కనుక మనబిడ్డలను కాపాడేబాధ్యత ఆపరమశివునిపైనే మోపాలి మనం .అందుకు ఆ కరుణామయుని హృదయం కరిగేలా స్తుతులు చేయాలి .
అందుకు ప్రమాణం కూడా ఉన్నది.
పూర్వం మృకండుమహర్షి సంతానంలేక పలువ్రతాలు తపస్సులుచేసినా అల్పాయుష్కుడైన కుమారుని సంతానంగా పొందగలిగాడు . అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆయువుతీరనున్నదని తెలిసిన సమయానికి ఆతల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు . తీవ్రంగా దుఃఖిస్తున్న తల్లిదండ్రులను కారణమడిగిన మార్కండేయుడు తల్లిదండ్రుల దుఃఖాన్ని తొలగించాలనుకుని దానికి తాను దీర్ఘాయుష్మంతుడనవటం వలనమాత్రమే సాధ్యము అని అనుకున్నాడు. శివునాజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు కనుక ఈ అపమృత్యువును తొలగించమని ఆయననే ప్రార్ధించటం మొదలెట్టాడు. తీవ్రతపస్సులో మునిగిన ఆయన జీవితకాలం ముగియగానే యమదూతలు వచ్చారు. కానీ ఆయనను తీసుకెళ్లటం సాధ్యంకాక తమప్రభుకు తెలుపగా సాక్షాత్తూ యమధర్మరాజే స్వయంగా వచ్చారు. ఎన్నివిధాలుగా చెప్పినా శివపూజముగియనిదే రానని మొండికేసిన మార్కండేయునిపై పాశం విసరగా ఆయన శివలింగాన్ని కౌగిలించుకున్నాడు .ధర్మానికి మాత్రమే బధ్ధుడైన యమధర్మరాజు బలం ప్రయోగించగా శివలింగమే కదిలింది. భక్తుని బాధను చూసి సహించలేని ఆ పరమశివుడు కృద్ధుడై ప్రత్యక్షమై తనత్రిశూలం యమునిపై ప్రయోగించారు . ....... మార్కండేయుని భక్తికి మెచ్చి అతన్ని చిరంజీవిగా జీవించేలా వరమిచ్చాడు .అదీ స్వామి కరుణ .
కనుకనే మనం ఇప్పటికీ జన్మదోషాలున్న పిల్లలకు నవగ్రహపూజలు శాంతులు జరిపించి రుద్రాభిషేకములు చేపిస్తాము .
కాబట్టి ఈ క్లిష్టతరపరిస్థితులలో మన బిడ్డలకు సకలశుభాలు కలిగించాలని ఆ భోళాశంకరుని కీర్తిద్దాం .
1 వ్యాఖ్యలు:
మంచి విషయాలు చెప్పారు.తిర్నాలెప్పుడండి?
Post a Comment