బంగరుపళ్ళెములున్నా మట్టిమూకులోనే తింటావాస్వామీ ! ఎంతకరుణ ప్రభూ ! భక్తులపై నీకు !
>> Saturday, October 22, 2011
తిరుమలలో శ్రీవారు తోమని పళ్ళేలవాడుగా బిరుదముపొందటానికి కారణమైన ఓ మహాభక్తుని గూర్చి చెప్పుకుందాం
పూర్వం శ్రీవారు అర్చామూర్తిగా వెలసిన తొలినాళ్లలో తొండమాన్ చక్రవర్తి స్వామివారి పాదపద్మాలకు బంగారు తులసీదళములతో సహస్రనామార్చన చేపించేవాడట . కొంతకాలానికి ఇలా సువర్ణతులసీ దళాలతో పూజజరిపే భక్తుడు నేనుగాక ఇంకెవరూ లేరుకదా? అనే అహం వచ్చి చేరింది మనసులో. లీలామానూష విగ్రహుడాయె స్వామి. మరుసటిరూజునుంచీ ఉదయాన్నే తలుపులు తెరచి చూస్తే రాజుగారి సువర్ణదళాలు పక్కకు నెట్టివేయబడి బంకమట్టితో చేసిన పూలు స్వామి వారి పాదాలపై కనపడసాగాయి. ముందు ఆశ్చర్యపోయినా ,పరిశీలించి పరిశోధించినా ప్రయోజనం లేక ప్రతిరోజూ ఇలానే జరుగుతుండటంతో రాజుకు విషయం అర్ధమైంది. స్వామివారికి తన సేవకంటే ఈ బంకమట్టిపూలే ఇష్టమవుతున్నాయని.ఉక్రోషం ,అవమానభారంతో కన్నీటితో స్వామిని ప్రార్ధించాడాయన స్వామి సన్నిధికి చేరి.
తొండమానా ! నాకు అత్యంత ఇష్టులైన భక్తులనేకులున్నారు. వారిలో భీముడనే కుమ్మరి ఆలయానికి అవసరమైన కుండలను తయారుచేస్తూ ఇంటిలోనే నన్ను కొయ్యబొమ్మగాచేసి తానుచేసిన మట్టిపూలతో ఏమరక నన్ను సేవించుకుంటున్నాడు .నీవిప్పుడు చూస్తున్నవి ఆపూలే ! నేను భక్తులకు వశ్యుడనయ్యా ! వాని భక్తికి బందీని. వాని మట్తిపూలే నాకు అత్యంత ప్రీతిపాత్రం అని నిర్మొహమాటంగా చెప్పేశాడు .సంపదల గర్వంతో అహంకరించినవాని హృదయంలో నేనుండను ,,, ఆభక్తుని దర్శించాలంటే వెళ్లు ఇక్కడకు ఉత్తరంగా ఒక యోజనదూరంలో కుగ్రామంలో అతనున్నాడు .అని ఆదేశించారు స్వామి .
వివేకి యగు తొండమానుడు రాజోపచారాలు వదలి పాదచారుడై రయమునవెడలి భీముని దర్శించి మహాభక్తుడైన భీములవారికి నమస్కారం అనిచెప్పి అలసటతో తెలివితప్పి పడిపోయాడు. ఆశ్చర్యపోతున్న భీముని ఎదుట కోటి సూర్యకాంతులతోజస్సుతో స్వామివారు ప్రత్యక్షమవ్వగాఆ పరమభక్తాగ్రణి స్వామివారిని పరిపరివిధాలప్రార్ధించి స్తుతించి,ఆనందంతో తబ్బిబ్బవుతూ ఆనందం అయోమయం ఇత్యాది లక్షణాల మానసిక స్థితిలో స్వామి పాదాలుపట్టుకుని ఆనందభాష్పాలు రాలుస్తున్నాడు.
స్వామివారు భక్తుని లాలిస్తూ ,ఏమికావాలో కోరుకొమ్మనారు.
తండ్రీ ! ఎన్నిజన్మల పుణ్యాలఫలం నాది ? నాకేమీవద్దు .నాడుయశోదమ్మచేసిన పుణ్యమెంతదో ఆవిడ గోరుముద్దలు తిన్నావు. ఇంతకష్టపడి నాకోసం వచ్చావు . నాకన్నతండ్రీ ! నాచేతితో రెండు ముద్దలు తినిపిస్తాను తినవా ? అని ప్రార్ధించాడు. భక్తసులభుడాయె స్వామి ! ఆకలెస్తోంది త్వరగా పెట్టమన్నాడు . అసలే భక్తిపారవశ్యంతో లోకం తెలియనిస్థితిలో ఉన్న ఆపరమ భక్తుడు తనకోసం వండుకున్న సంగటిని మట్టిమూకుడులో వడ్డించుకుని వచ్చి ప్రేమపూర్వకంగా కొసరికొసరి తినిపించాడు . స్వామికూడా ఆప్యాయంగా తిన్నారు. ఈలీలను చూస్తున్న దేవతాగణాలు పుష్పవృష్టి కురిపించాయి . స్వర్గం నుంచి వచ్చిన దివ్యవిమానంలో ఆకుమ్మరిదంపతులను తీసుకుని వెల్లేలా ఆదేశించి వారికి సాయుజ్యాన్ని ప్రసాదించారు స్వామి.
నాటినుండి నేటివరకు ప్రతిరోజూ "ఓడు"అనే మూకుడు లోనే స్వామివారికి నివేదన జరపబడుతున్నది. బం<గరుపల్లేలలో తెచ్చిన్ అహారమైనా కులశేఖరపడివరకే తీసుకెళ్లబడుతుంది. లోపలకు మాత్రం పగలగొట్తబడిన కుండ లోమాత్రమే స్వామిదగ్గరకు తీసుకెళ్ళి నివేదన జరిపితేనే స్వీకరిస్తున్నాడా దయామూర్తి ,భక్తజనవశ్యుడైన శ్రీవారు. కురువనంబిగాకొనియాడబడే ఆభక్తుని ప్రేమకు చిహ్నంగా తోమనిపళ్ళేలవాడు అనే బిరుదమును స్వీకరించాడాయన .
2 వ్యాఖ్యలు:
భలె వారండి మీరు - ఇది స్వామి వారి కరుణ కాదు , మన భక్తుల నిర్వాకం ! అసలె మా స్వామి వారు కుబేరునికి బకాయి. బంగరు పల్లెం చూపిస్తె అదెక్కడ మా స్వామి వారు స్వాహా చెస్తారొ అని వీరి భయం! ఆందుకె బంగారు పల్లెలున్నా, వారి దాక పోనివ్వటం లెదు ఈ భక్తశిఖామణులు ! ఎంతైన మన 'కొంగూ బంగారం కదండి మరి!
నిజమేసుమండీ !
Post a Comment