శత్రువు తలవంచిన వేళ..
>> Friday, October 21, 2011
శత్రువు తలవంచిన వేళ..
తరాలుగా కాశీ, కోసల రాజులకు శత్రుత్వం ఉండేది. వారిపై వీరు, వీరిపై వారు దండెత్తి రాజ్యాలను ఆక్రమించటం జరిగేది. ఒకప్పుడు బ్రహ్మదత్తుడు కాశీ రాజయ్యాడు. అదే సమయంలో దీధితి కోసల రాజుగా ఉండేవాడు. కోసల రక్షణ దళం బలహీనంగా ఉందని గ్రహించిన కాశీరాజు బ్రహ్మదత్తుడు కోసల పైకి దండెత్తి వచ్చారు.
యుద్ధరంగంలో ఆయనతో తలపడటం గానీ ఆయన్ను జయించడం గానీ ఏ మాత్రమూ సాధ్యం కాదని భావించిన కోసల రాజు దీధితి గర్భవతి అయిన తన భార్యను తీసికొని రహస్యమార్గం ద్వారా కోట నుంచి తప్పించుకున్నాడు. కాశీరాజు నుంచి తప్పించుకోవాలంటే కాశీలోనే దాగుంటే శ్రేయస్కరమని భావించాడు. నగరంలోని కుమ్మరి వీధికి చేరాడు. ఒక కుమ్మరి ఇంట్లో దంపతులు తలదాచుకున్నారు. అగ్నిశేషం, శత్రుశేషం ఉండరాదని భావించిన బ్రహ్మదత్తుడు తన సైనికులతో కాశీనగరం మినహా పరిసర ప్రాంతాలన్నిటినీ క్షుణ్ణంగా గాలించాడు. తన రాజధానిలోనే తన శత్రువు తలదాచుకుంటాడని ఎలా ఊహించగలడు? కొన్ని దినాల తర్వాత దీధితి భార్య అందమైన మగ శిశువును ప్రసవించింది.
ఆ బిడ్డకు దీర్ఘాయువు అని నామకరణం చేశారు. దీర్ఘాయువు పదహారు సంవత్సరాల వయసు వాడయ్యాడు. దీధితి అతనికి సమస్త విద్యలు నేర్పించాడు. ఒక రోజు దీర్ఘాయువుతో "బాబూ! మనం కుమ్మరులం కాము. నేను కోసల రాజును. కాశీరాజు బ్రహ్మదత్తుడు మన రాజ్యాన్ని ఆక్రమించుకోవటం వల్ల మనకు ఈ స్థితి వచ్చింది. నిజానికి నీవు కోసల రాజ్యానికి వారసుడవు,'' అని జరిగిన కథనంతా చెప్పాడు. ఎలాగో ఇన్నాళ్లు కాశీరాజు కంటపడకుండా జీవించాము. ఇక మాకు ఇక ఏమైనా పరవా లేదు. కానీ నీవు మా ఆశాజ్యోతివి. ఎక్కడికైనా దూరంగా సురక్షిత ప్రాంతానికి వెళ్లు'' అని చెప్పాడు. తమను వీడిపోతున్న దీర్ఘాయువును చూడగలిగినంత దూరం వరకు చూశారు దీధితి, ఆయన భార్య.
ద్వేషం చల్లారేది మైత్రితోనే
సుకేశుడు కోసల రాజుకు మంగలిగా పనిచేసే వాడు. ఒకనాడు కుమ్మరి వీధిలో పోతూ ఒక ఇంటి ముందు కుండలను ఏకాగ్ర చిత్తంతో తయారు చేస్తున్న వ్యక్తిని చూసి అతడు కోసలరాజు దీధితి అని గుర్తుపట్టాడు. తిన్నగా కాశీరాజాశ్రయాన్ని పొంది విషయాన్ని తెలిపాడు. దీధితిని బంధించి తీసుకురావలసిందిగా సేనాపతిని ఆదేశించాడు. కొన్ని నిముషాల్లోనే దీధితిని, ఆయన భార్యను బంధించి తెచ్చి బ్రహ్మదత్తుని ముందుంచాడు సేనాపతి. " వీరిద్దరిని చేర్చి కట్టి, ఒక బండి మీద ఊరేగించి, వధ్యశాలకు తీసుకెళ్లి వధించండి'' అన్నాడు బ్రహ్మదత్తుడు. కాశీ నగరాన్ని వీడి వెళ్లి చాలా రోజులై ఉన్నందున తన తల్లిదండ్రులను చూడాలనిపించి దీర్ఘాయువు నగరానికి తిరిగి వచ్చాడు. అక్కడ తనకు కనిపించిన దృశ్యం అతన్ని నిశ్చేష్టుని చేసింది.
బండి పైన గొలుసులతో బంధింపబడి వధ్యశాలకు తీసుకుపోతున్న తల్లిదండ్రులు. తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కోపం ముంచుకొచ్చింది. ఒళ్లు మండిపోయింది. పిడికిలి బిగించాడు. అలాగున్న దీర్ఘాయువును గుర్తు పట్టాడు దీధితి. అప్పటికే గౌతమ బుద్ధుని బోధనలు విన్న దీధితికి ఎలాంటి ఆందోళనా లేదు, మరణమంటే భయమూ లేదు. కోపంతో ఊగిపోతున్న కుమారుడిని చూసి " ద్వేషం ద్వేషంతో చల్లారదు. మైత్రితోనే చల్లారుతుంది. హింసకు హింసయే జవాబు కాకూడదు. అహింసయే పరమ ధర్మము. అవును అహింసయే పరమ ధర్మము '' అని గట్టిగా అరిచాడు జనులంతా వినేట్టు. దీర్ఘాయువు ఎంతో చింతిస్తూ పక్కకు తప్పుకున్నాడు ఎవరూ తనను గుర్తించక ముందే.
కాశీ రాజు బ్రహ్మదత్తునకు మాత్రం ఇంకా మనశ్శాంతి లేదు. తనకు అందిన సమాచారం ప్రకారం తన శత్రువు దీధితి కుమారుడు ఇంకా సజీవంగా ఎక్కడో ఉన్నాడు. వాడిని సంహరిస్తేనే శత్రుశేషం ఉండదు. అందాక గాఢనిద్ర అతనికి పట్టదు. ఒకరోజు రాత్రంతా మగత నిద్రతో బాధపడిన బ్రహ్మదత్తునకు తెల్లవారుజామున సుఖనిద్ర వచ్చింది. అప్పుడే గజశాల నుంచి వినపడిన వేణుగానం ఆయన సుఖాన్ని రెట్టించింది. అలా హాయిగా కొంతసేపు నిద్రించిన రాజుకు ఎంతసేపో విశ్రాంతి తీసికొన్నట్టనిపించింది. కళ్లు తెరచి ఆ వేణుగానం చేసిందెవరని భటులనడిగాడు. అతడు శుభగుప్తుడని, ఈ మధ్యే గజదమన విద్యను నేర్చుకోవటానికి వచ్చాడని తెలుసుకున్నాడు. బ్రహ్మదత్తుడు అతనిని పిలిపించుకొని, అతని వేణుగానాన్ని మరీ మరీ విని ఆనందించాడు.
శుభ సందేశం
శుభగుప్తుడు కొద్దిరోజుల్లోనే రాజుగారికి చాలా సన్నిహితుడై ఆయన ఎక్కడికి పోతే అక్కడికి వెంట పోయాడు. ఒకసారి వేటకు వెళుతూ శుభగుప్తుడినే తన రథసారధిగా తీసుకెళ్లాడు బ్రహ్మదత్తుడు. అనుకోకుండా రక్షక దళానికి దూరమై అడవి మధ్యలోకి వెళ్లారు బ్రహ్మదత్తుడు, శుభగుప్తుడు. వేటాడి బాగా అలసిపోయిన బ్రహ్మదత్తుడు విశ్రాంతి తీసికోదలిచాడు. శుభగుప్తుడు రథాన్ని ఆపి ఒక చెట్టు కింద నీడలో తాను కూర్చొని తన ఒడిలో తల ఉంచి హాయిగా నిద్రపోమ్మని రాజుగారిని కోరాడు. నిజానికి శుభగుప్తుడే దీర్ఘాయువు. తన తల్లిదండ్రులను చంపిన బ్రహ్మదత్తుడిని చంపాలనే ప్రతీకార వాంఛతో రగిలిపోయాడు.
అయితే తన తండ్రి చివరి మాటలను ఆ అడవి అంతా మేఘ గంభీర ధ్వనితో ప్రతిధ్వనించినట్టు తోచింది. అంతలో ఎంతో గాబరా పడుతూ బ్రహ్మదత్తుడు లేచి "శుభా! చాలా భయంకరమైన కల వచ్చింది. నా శత్రువు దీధితి కొడుకు దీర్ఘాయువు వచ్చినట్లు, నన్ను చంపబోతున్నట్లు కల పడింది.'' అన్నాడు వణుకుతున్న దేహంతో. అప్పుడు దీర్ఘాయువు అతని తలను ఒక చేత్తో నిమురుతూ"రాజా ! ఆ దీర్ఘాయువును నేనే. నీ వల్ల మా రాజ్యానికి, వంశానికి తీరని అపకారం జరిగింది.
అతి క్రూరంగా నా తల్లిదండ్రులను చంపించావు. ప్రతీకార జ్వాల నాలో రగిలింది. అయితే మా తండ్రిగారి సందేశము నా చేతులను కట్టి పడేసింది. ఇప్పుడు అవసరమైతే నా ప్రాణాలనైనా మీకు అర్పించుటకు సిద్ధంగా ఉన్నాను గానీ మీ ప్రాణాలను తీయటానికి నా మనసు అంగీకరించటం లేదు.'' అన్నాడు తన చెవులను తానే నమ్మలేని బ్రహ్మదత్తుడు "ఏమిటి మీ నాన్న గారి సందేశము?'' అని అడిగాడు. " ద్వేషం ద్వేషంతో చల్లారదు. మైత్రి వల్లనే చల్లారుతుంది. రాజా ! ఇదే మా తండ్రి గారి అంతిమ సందేశము!''
బుద్ధం... శరణం
పవిత్ర మూర్తి బుద్ధ భగవానుని హృదయాలయం నుంచి వెలువడిన అమృతపు చినుకులు ఎవరి చెవిన పడితే వారిని ఇట్టే మార్చి వేయగల అత్యంత శక్తివంతమైన దివ్య మంత్రాలు. దీధితిని మార్చినట్టే, దీర్ఘాయువును తీర్చిదిద్దినట్టే బ్రహ్మదత్తుడిని కూడా ప్రేమమూర్తిగా మార్చివేశాయి. కోసల రాజ్యాన్ని దీర్ఘాయువుకిచ్చి సాగనంపుతూ "మిత్రమా ! నీ వేణుగానం ఎంతో మధురం. నాకు వీనులవిందు చేసింది. మీ తండ్రి సందేశం మధురాతి మధురం.
నా హృదయాల్ని ప్రేమరసంతో నింపి రంజింపజేసింది. మన ఇరు వంశాల మధ్య ఇక మీదట ప్రేమబంధమే ఉంటుంది తప్ప ద్వేషానికేమాత్రం చోటు ఉండదు. నీలాంటి ఉత్తమరాజు పాలనలో కోసల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురు గాక! అని చెప్పి సగౌరవంగా సాగనంపాడు కాశీరాజు బ్రహ్మదత్తుడు. ఈ సంఘటనను ఉదాహరిస్తూ ఒకనాటి భిక్షు సమావేశంలో బుద్ధభగవానుడు " ఈ లోకంలో ఎప్పుడు గానీ వైరం చేత వైరం శమించలేదు. మైత్రీభావం వల్లనే వైరములు శమిస్తాయి ఇదే సనాతన ధర్మం'' అని బోధించాడు.
[ఆంధ్రజ్యోతి నుండి]
2 వ్యాఖ్యలు:
నెగ్గడం మిత్రత్వానికి ఉన్న సహజ లక్షణం
Very nice post.
Post a Comment