శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బ్రహ్మానుభవం

>> Tuesday, October 18, 2011

బ్రహ్మానుభవం

ఆకాశం అన్నిటికంటే అధికమైనది. వాయువు, అగ్ని, నీరు, భూమి దాని నుంచి పుట్టినవే. ఇవన్నీ తిరిగి దానిలో లయిస్తున్నవే. ఆవృతం పూర్తయ్యే వరకు ఇవన్నీ వస్తువులుగా కొన్ని కంటికి కనిపిస్తయ్. గాలి మాత్రం కంటికి కనిపించకుండానే, అన్నింటినీ కదిలిస్తుంటుంది. అన్నిటా, అంతటా వ్యాపించి ఉంటుంది. అందువల్ల ఆకాశం, కనిపించే శూన్యం, కనిపించని పూర్ణం. కనుక ఆకాశం బ్రహ్మమే.

బ్రహ్మమంటే అంతా తానై ఉన్నదని అర్థం. గాలి బ్రహ్మమే. గాలి అంటే ప్రాణం. జీవి, ప్రాణం వల్లనే ఉండి, ప్రాణం పోగానే లేనట్లుగా ఉంటుంది. ప్రాణం ఉంటే జీవం, లేకపోతే మరణం. జీవి ఉనికికి, అస్తిత్వానికి ప్రాణం కారణమవుతున్నది. మేల్కొని ఉన్నప్పుడున్న ఇంద్రియ కార్యకలాపాలన్నీ నిద్రావస్థలో ప్రాణంలోనే లీనమైఉంటున్నాయి. అంటే ప్రాణం అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటున్నది. ఇవన్నీ బ్రహ్మమునకు ఉన్న లక్షణాలే కనుక ప్రాణమూ బ్రహ్మమే.

ప్రాణమంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ జనజగత్తుల కోసం అపేక్ష లేకుండా వినియోగం కావాలి. ప్రాణమే ఆయువు. ఇంద్రియాలన్నీ ప్రాణం వలనే కర్తవ్యం సాగిస్తున్నాయి. జీవి పుట్టుక, మరణానికి ప్రాణమే కారణం. కానీ ప్రాణానికి మరణం లేదు. పుట్టుకా లేదు. ఇవి ఆత్మస్థితులే. అందువల్ల ప్రాణమూ బ్రహ్మమే.

ఉపాసన చివరలో కలిగే అనుభవం ఏమిటి? నామ, రూప, గుణాతీతమైన అనుభవం కలగటమే. అన్నీ పోగా మిగులుతున్నది చైతన్యమే. చైతన్యం అంటే బ్రహ్మమే. కనుక ప్రాణము, పదార్థము, అనుభవము అంతా బ్రహ్మమే. సమస్త సృష్టీ బ్రహ్మమయం అనుకోగల స్థితే బ్రహ్మానుభవము.
దివ్యానుభవం
మనోమయమైన జీవుడు ప్రాణంతో కూడినప్పుడే బ్రహ్మం. బ్రహ్మము ఒక స్పృహ. ఒక ఆలోచన, ఒక వాక్కు. ఒక అనుభవం. ఒక అనుభూత. ఒక విభూతి. ఇదంతా బ్రహ్మమే. మనసు-ప్రాణము బ్రహ్మము కనుక మనోనియంత్రణకు సాధనమైన ధ్యానము బ్రహ్మమే. ధ్యానాంతంలో కలిగే ప్రశాంత స్థితి కూడా బ్రహ్మమే. అణువు నుంచి బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మము విడిగా అనిపించినా నిజానికి రెండూ ఒక్కటే.

జీవాత్మ, ఆసామికి ప్రతినిధి. నిత్యనైమిత్తిక కార్యకలాపాల్లో ప్రతినిధే అన్నీ చేస్తాడు కనుక మోదం, ఖేదం ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. బ్రహ్మము కర్త, కర్మ, క్రియ అయి కూడా ప్రత్యేక అస్తిత్వం లేదు. కనుక ఇది అనుభవాతీతం. భావాతీతం. బ్రహ్మమే ఒక స్థితిలో కర్తగా మరొక స్థితిలో కర్మగా ఉంటుంది. "ప్రాణుల యందు నేను వైశ్వానరుడను, తింటున్నది నేనే'' అంటాడు శ్రీకృష్ణుడు. సోమము ఆహారం.

అగ్నే భోక్త. సృష్టి కలాపం అంతా ఒక ఆహార క్రీడ. చివరిలో తనయందే తను లయిస్తుంది కనుక రుచి, అరుచి సైతం బ్రహ్మమే. ప్రళయం మహామృత్యువుకు ఒక విందు భోజనం. తనయందు తనే లయం కావడం ఒక దివ్యానుభవం. యమధర్మరాజా! మంచి, చెడు లేని కర్మ ఏది? కారణము - కారణము కానదేది. జరిగినది, జరగబోయేది లేనిది ఏది అని న చికేతుడు ప్రశించినప్పుడు యమధర్మరాజు సమాధానం ఏమిటి? అకార, ఉకార, మకారముల ఏకాక్షర స్వరూపమూన ఓం మాత్రమే అని సమాధానం.

పుట్టటం, గిట్టటం లేనిది అత్మే. జీవాత్మకే కార్యకలాపాలున్నాయి. ఆత్మ సాక్షీభూతం. ఇంతకీ ఈ రెండూ ఎక్కడ చేరుకుంటున్నాయి? హృదయమే గుహ, అదే గృహం. అక్కడికే అవి చేరుకుంటాయి. స్వస్థానమైన హృద్గుహను చేరినప్పడు, శరీరం ద్వారా సాధించిన కర్మానుభవానందాన్ని అవి ఆస్వాదిస్తూ ఉంటాయి. ఈ అనుభవం బ్రహ్మము యొక్క మరొక రూపమైన బుద్ధే కానీ, బ్రహ్మానిది కాదు. అనుభవం బ్రహ్మమే కానీ, బ్రహ్మమునకు అనుభవం లేదు కదా? ధ్యాని జీవాత్మ. ధాన్యము బ్రహ్మము. జీవాత్మకు ధ్యానము, దానివల్ల కలిగే అనుభవం ఉన్నాయి. ధ్యానానికి అవేమీ లేవు. అదొక స్థితి. అది అనుభవరహితం.

బ్రహ్మానుభవం
వస్తువును చూడటానికి వెలుగే కారణం. వెలుగుకు కారణం బ్రహ్మమే. వెలుగులేకపోతే చూపు లేదు. చూసే వాడూ లేడు. కనుక దృశ్యము లేదు. ఈ మూడిటికి కారణం వెలుగే. కాబట్టి వెలుగు బ్రహ్మమే. కనుగుడ్డు, కంటిరెప్ప, కంటి చూపు... ఇవన్నీ కలిపితే కన్ను. ఈ మూడూ జడమే. లోపల ఉన్న వెలుగే చైతన్యం. చైతన్యం చూస్తుందే కానీ చూడదు. చూడలేక కాదు చూడవలసిందేమీ ప్రత్యేకంగా లేదు కనుక. తానే బ్రహ్మము కనుక అదిచూడదు.

అపరిమిత చైతన్యం పరిమిత పరిధి ఉన్న కంటిలో ఉన్నదా అని ప్రశ్న. కంటి ద్వారా చూడటమే పని ఉన్నది కనుక చైతన్యం అక్కడ ఉన్నది. ఉండాలి. ఉపోసనలో ఉండాలంటే వస్తువును చూడాలి. ఆ వస్తువుకు ఒక రూపం, ఒక పేరు, ఒక గుణం.. ఇవన్నీ ఉండాలి. వీటిని తెలుసుకోవాలంటే చూపు కావాలి. చూడాలంటే కన్ను కావాలి. కంటి ద్వారా చూపేవాడు కావాలి. ఆ చూపేవాడు కంట్లో ఉండాలి. ఉప అంటే దగ్గరగా. ఆసన అంటే స్థిరంగా కూర్చుని ఉండటం.

అందువలన చైతన్యం కంటికి దగ్గరగా ఉండి చూపించాలి. పేరు వినాలి అంటే చెవిలో చైతన్యం ఉండాలి. పేరును అనాలంటే నాలుకపై చైనత్యం ఉండాలి. గుణం తెలుసుకోవాలంటే బుద్ధి, చిత్త, అహంకారాల్లో చైతన్యం ఉండాలి. వీటన్నింటా చైతన్యం ఉన్నది కనుకనే ఉపాసన కొనసాగుతున్నది. ఉపాసన చివరలో కలిగే అనుభవం ఏమిటి? నామ, రూప, గుణాతీతమైన అనుభవం కలగటమే. అన్నీ పోగా మిగులుతున్నది చైతన్యమే. చైతన్యం అంటే బ్రహ్మమే. కనుక ప్రాణము, పదార్థము, అనుభవము అంతా బ్రహ్మమే. సమస్త సృష్టీ బ్రహ్మమయం అనుకోగల స్థితే బ్రహ్మానుభవము.
విఎస్ఆర్ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP