దీపావళి అమావాస్య పూజ
>> Monday, October 17, 2011
చతుర్దశి నందు ఉపవాసము వుండి, అమావాస్య నాడు ప్రాతః కాలమున అభ్యంగన స్నానము ఆచరించి, మధ్యాన్నమున పార్వణ శ్రాద్ధము చేసి, ప్రదోష సమయమునందు దీప దానము చేసి, నక్షత్ర దర్శనము అయిన తరువాత శ్రీ మహా లక్ష్మీ పూజ చేసి భోజనము చేయవలెను అని ధర్మ సింధు తెలుపుచున్నది.
దీప దానము చేత మహా సంపత్తి కలుగును అని పెద్దలు చెప్పినారు.
ఇక దీపావళి అమావాస్య , ప్రదోష సమయము తరువాత లక్ష్మీ, కుబేర పూజ చాలా విశేషము. ఈ రోజు గో పూజకు చాలా ప్రాధాన్యత. శ్రీ మహాలక్ష్మి యొక్క రూపును గాని, కలశమును గాని, శ్రీ చక్రమును గాని, కనీసము ఫోటో గాని
ప్రతిష్టించి, షోడశోపచారములు సల్పి, అష్టోత్తర,శత నామాలతో అర్చించి, కనకధారాస్తవం తో స్తుతించి, నివేదన చేసి, గాన నృత్యములతో ఆ తల్లిని ఆనంద పరచి చక్కగా కుటుంబ సభ్యులతో భోజనము చేయవలెను.
ఆతల్లికి కనకధారాస్తవం అంటే మహదానందం కాబట్టి తప్పక కనకధారా స్తోత్రంతో పూజ చేయ వలెను.
ఇలా చేసినవారికి సంవత్సరం పొడుగునా చేసిన ఫలము ఒక్కరోజులోనే దక్కును. శ్రీ మహాలక్ష్మికి విశేష పూజా దినము ఈరోజు. ఇలా చేసినవారికి మహా దైశ్వర్యము కలుగును అని పెద్దల వాఖ్య.
కావున అందరూ శ్రీ మహా లక్ష్మీ పూజ చేసి సకల సంపత్తిని పొంది, ఆయుః ఆరోగ్యములను బడయుదురని ఆ శ్రీ దేవి ని మిక్కిలి ప్రార్ధిస్తూ
మీ
రామచంద్రరావు
(భాస్కరానంద నాథ)
0 వ్యాఖ్యలు:
Post a Comment