బుద్ధుని జీవితాదర్శం
>> Sunday, October 16, 2011
గౌతమ బుద్ధుని దర్శించి తరించిన వనితా రత్నాల్లో శ్యామావతి ఒకరు. ఆమె గొప్ప సుగుణాల రాశి. ఆక సద్గుణ సంపదే ఆమె మహారాణి అయ్యేందుకు కారణమయ్యింది. ఆమెను బుద్ధుని వైపు నడి పించింది.
ఆ ప్రాంతం పేరు వత్సదేశం. ఆ దేశ ప్రజలను కన్న తండ్రిలా పాలిస్తున్న రాజు శంఖముఖుడు. ఆయన ముఖస్తుతి ఏ పాటి సత్యం ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తి అందుకే ఒక పక్క తన పరిపాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుంటూనే, మరో పక్క తానే స్వయంగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ, అందుకు అనుగుణంగా పాలించేవాడు. శంఖ ముఖుడు ఒకసారి రౌరక గ్రామం పక్కనున్న వల్గుమతి అనే చిన్న నది ఒడ్డుకు వచ్చాడు.
ఆ నదీ తీరంలో తడి ఇసుకతో గూళ్లు కట్టుకుంటున్న ఇద్దరు అమ్మాయిలు కనిపించారు. వారికేసి అలా చూస్తూ ఉండగానే, ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఆ ఇసుక గూళ్లను తొక్కేశాడు. కూలిపోయిన ఇసుక గూళ్లను చూసి ఒక అమ్మాయి గట్టిగా ఏడ్చింది. ఇంకో అమ్మాయి మాత్రం ఏడ్వకుండా వాటికేసి అలా చూస్తూ ఉండిపోయింది. శంఖముఖుడు మాత్రం ఇసుక గూళ్లను కూల్చేసిన పిల్లవాడి చెవులు పిండుతూ " ఎందుకు ఆ గూళ్లను తొక్కేశావు? వాటిని నువ్వే మళ్లీ కట్టివ్వు'' అన్నాడు చాలా కోపంగా.
వెంటనే ఆ కుర్రాడు తిరిగి ఇసుక గూటిలో నిర్మించే పనిలో పడ్డాడు. అది చూసిన అమ్మాయి తన ఏడుపు ఆపేసింది. శంఖముఖుడు శాంతంగా ఉన్న పాపను దగ్గరగా తీసుకుని, "పాపా! నీ పేరేంటమ్మా'' అంటూ ప్రశ్నించాడు ఎంతో ఆప్యాయంగా. వెంటనే ఆ పాప తన పేరు " శ్యామ అని చెప్పడంతో పాటు, తన తల్లిదండ్రుల గురించి, వారున్న నివాస స్థలం గురించి చెప్పింది.
ఆ పాప ముద్దు ముద్దు మాటలు శంఖముఖునిపై చెరగని ముద్ర వేశాయి. శంఖముఖుడు తన రాజధానికి వెళ్లినా ఆ పాపే పదే పదే గుర్తుకు వస్తూ ఉండేది.
బుద్ధుని దర్శనం
ఏళ్లు గడిచాయి. రాజా శంఖముఖుని కుమారుడు ఉదయనుడు పెళ్లీడుకొచ్చాడు. వధువు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ సమయంలో శంఖముఖునికి శ్యామ గుర్తుకొచ్చింది. శ్యామనే తన కోడలుగా ఎందుకు తీసుకురాకూడదు? అనుకున్నాడు. వెంటనే రౌరక గ్రామానికి తన మనుషులను పంపాడు.అయితే ఆ పదేళ్లలో శ్యామ కుటుంబం ఓ ఐదు గ్రామాలను మార్చింది.
ఎంతో కష్టపడి చివరికి రాజసేవకులు వారున్న ఊరును కనుక్కోగలిగారు. వారున్న ఊరి పేరు 'తిమింగల'. వారు శ్యామ తండ్రిని కలిసి రాజుగారి ఉద్దేశాన్ని తెలియబరిచారు. ఆయన అదో గొప్ప అదృష్టంగా భావించిక శ్యామను ఉదయునికి ఇచ్చి వివాహం జరిపించారు. ' శ్యామ' ఆ దేశ ప్రజల చేత "మహారాణి శ్యామావతి'' గా గౌరవించబడింది.
శ్యామావతి ఆధ్యాత్మిక చింతనగలది. బుద్ధ భగవానుడు కౌశాంబిలోని ఘేషితారామంలో ఉన్న విషయాన్ని తెలుసుకుని, వీలైనప్పుడల్లా ఆయనను దర్శించి ఆయన భోధామృతాన్ని గ్రోలేది. తన భర్త ఉదయనుడు కూడా బుద్ధ భగవానుని దర్శించాలని ఎంతగానో అభిలాషపడేది. కానీ, ఆయనేమో పెద్ద భోగలాలసుడు. నిరంతరం తినడం, తాగడం నాట్యకత్తెలతో గడపడమే ఆయనకు తెలిసిన ఆనందం. ఆ ఆనందం క్షణికమని, దాన్ని మించిన శాశ్వతానంద పథం ఒకటుందని ఊహించే స్థితిలోనే లేడాయన.
బుద్ధుని దర్శనానికి తాను వెళుతున్న ప్రతిసారీ, అతన్ని కూడా తనతో పాటే రమ్మని శ్యామావతి చాలా సార్లు కోరింది. కానీ, ఆ మాటలు అతనికి ఏ మాత్రం చెవికెక్కలేదు. ఒక్కసారి బుద్ధ దర్శనానికి తనవెంట రమ్మని మరీ మరీ బతిమిలాడింది.
అందుకు ఆయన 'శ్యామా! నీవు నా అర్థాంగివి. నీవు ఆయన్ను పదేపదే దర్శించి దండిగా పుణ్యం కట్టుకురా. అందులో సగభాగం నాకు ఎలాగు దక్కుతుంది' అని చెప్పి తప్పించుకున్నాడు. శ్యామావతి గత్యంతరం లేక ఒంటరిగానే వెళ్లి బుద్ధుని బోధను తనివితీరా అనుభవించేది.
శ్యామావతి సందేహం
బుద్ధుని బోధనలు విన్న శ్యామావతికి ఒక సందేహం కలిగింది. బుద్ధునితో ఆమె "శాస్తా, మీరు అనేక ధర్మాలను బోధిస్తారు. అన్ని ధర్మాలకు ఏది ఆధారం, ఏది మనిషికి అమిత బలాన్నిచ్చేది? దయచేసి అట్టి ధర్మాన్ని వివరించండి'' అని విన్నవించింది. గౌతమబుద్ధుడు ఆమె జిజ్ఞాసను ఎరిగిన వాడై "మహారాణీ! మీకు చాలా మంచి సందేహమే కలిగింది.
మీలో కలుగుతున్న అంతర్మదనానికి స్పష్టమైన సంకేతమే అది. మీరు నా మాటలను ఎంత శ్రద్ధగా వింటున్నారో సూచిస్తుంది. అన్ని ధర్మాలకు ఆధారం అప్రమాదం(అప్రమత్తత), నిరంతర జాగరూకత. అన్నిటికీ బలాన్నిచ్చేది అదే.
అన్ని ప్రమాదాల నుంచి రక్షించేది అదే. అన్ని జంతువుల పాదాల గుర్తులు ఏనుగు పాదం గుర్తులో అణగిపోయినట్లుగా అన్ని కుశలధర్మాలు ఈ అప్రమాదంలో అంతర్గతములవుతాయి'' అని వివరించాడు.ప్రపంచ ప్రఖ్యాత ఆధునిక తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి "మనముందు ఒక విష సర్పం పడగవిప్పి మనలను కాటువేయడానికి బుసకొడుతుంటే మనం ఆ కాటును తప్పించుకోవడానికి ఎంత జాగ్రత్త పడతామో అంత జాగ్రత్తగా ప్రతి నిమిషం జీవించాలని బోధిస్తాడు.
నిజానికి మనల్ని కాటువేయడానికి సిద్ధంగా వున్నది ఒక విష సర్పం కాదు. కామ, క్రోధ, మద, మోహాలనే నాలుగు విషసర్పాలే కాక లోభం, మాత్సర్యం అను మరు రెండు కాల నాగులు. ఇక మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో మరి.
ధర్మసంపత్తి
గౌతమ బుద్ధుడు మహారాణి శ్యామావతికి ఒక అద్భుత ఊహాచిత్రం ద్వారా అప్రమాదం యొక్క ఆవశ్యకతను తెలిపాడు. కింద భూమి, పైన ఆకాశాన్ని తగులుతూ నాలుగు దిక్కుల నుంచి నాలుగు మహా పర్వతాలు ఒకదానికెదురుగా ఒకటి ముందుకు కదిలివస్తున్నాయి. వాటి మధ్య మనిషి ఉన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ పర్వతాల మధ్య అతడు నలిగి చావవలిసిందే. గత్యంతరం లేదు. ముసలితనం, వ్యాధి, విపత్తి, మరణాలే ఆ నాలుగు పర్వతాలు.
యవ్వనాన్ని తరుముతూ ముసలితనం, ఆరోగ్యాన్ని చిదుముతూ వ్యాధి, సంపదను చంపుతూ విపత్తు, జీవితాన్ని మింగేస్తూ మరణం వస్తాయి. అప్పుడు, అటు పిమ్మటైనా తోడు వచ్చేది ఆ మనిషి కూడబెట్టిన ధర్మసంపత్తే. అప్రమాద వర్తనులే ధర్మసంపత్తిని ఆర్జింగలరు.
మహారాణి శ్యామావతి సమక్షంలోనే అక్కడున్న భిక్షువులనుద్దేశించి "అప్రమాదం నిర్వాణానికి దారితీస్తుంది. ప్రమాదం మృత్యువుకు దారి తీస్తుంది'' అని బుద్ధభగవానుడు హిత బోధ చేశాడు. సందేహం తీరిన శ్యామావతి బుద్ధ భగవానుని పాదపద్మాలకు నమస్కరించి తేలికబడ్డ హృదయంతో రాజమందిరానికి చేరింది. భగవానుని బోధనునిత్యం స్మరిస్తూ, ఆచరిస్తూ తరించింది.
2 వ్యాఖ్యలు:
చక్కటి సందేశమిచ్చారు ఈ కధ ద్వారా.
1 జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం.
2 ఉత్తిష్టత జాగరూకత ప్రపవరాన్నిబోదితః
Post a Comment