శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవీ భక్తులపట్ల అపచారం ప్రమాదం సుమా !

>> Tuesday, September 20, 2011

దేవీ భక్తుల పట్ల జాగ్రతవహించాలని కొన్ని ఉదంతాలు మనకు తెలుపుతున్నాయి . ఇటువంటిది నాకు తెలిసినదొక విషయం ఇది.
మాతాత గారు వెంకయ్యగారు అమ్మకు అనన్యభక్తులు . చదువులేకున్నా పూర్వజన్మ సుకృతంగా అమ్మ అనుగ్రహం వలన వాక్సిద్దిని పొందిన వారు. దీక్షగా సాధనచేయడం ద్వారా నామమే మహామంత్రమై అయనను అమ్మ అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసినది . ఇప్పటి మంత్రి కాసు కృష్ణారెడ్డిగారి తండ్రి కాసువెంగళ రెడ్డి ,నీలం సంజీవరెడ్డి,భవనం వెంకట్రామిరెడ్డి వంటీ రాజకీయప్రముఖులు ఆయన గురుతుల్యులు . ఏదైనా సంకట పరిస్థితులలో ఆయనను సంప్రదించి సలహాలు స్వీకరించేవారు .
అయితే ఆయన మాత్రం ఏరోజూ భగవంతుడిచ్చిన శక్తిని అత్యాశతో స్వార్ధానికి వాడుకోలేదు. గంపెడు సంతానం . ఆరోజుల్లో మా ప్రాంతంలో జొన్నలు సజ్జలు మాత్రమే పండేవి . వరన్నం దిరికితే స్వామిబువ్వ అని ఆబగా తినేవారు . రేగ్గాయలు పండేభూములని పేరు మాప్రాంతానికి . అలాంటి రోజులలో ఈయన ఎప్పుడూ అన్నదానాలు ,సంతర్పణలు అని వచ్చినదానిని ఖర్చుపెట్టేవారేకాని తనకోసం దాచుకునేవారుకారు. వినుకొండలో మంచిసెంటర్లలో గురువు గారూ కొద్దిగా స్థలం ఉంచుకోండి భవిష్యత్తులో పనికొస్తుందని హితులు చెప్పినా అలాగే సాగర్ కాలువలు వస్తున్నాయని ఈప్రాంతంలో భూమి కొంటున్నవారికి మధ్యవర్తిగా వ్యవహరించినప్పుడు డబ్బుకు బదులుగా భూమి తీసుకోమన్నా తిరస్కరించేవాడు. మాకెందుకండి ఇవి అమ్మ ఉన్నది చాలు అనేవారు. వచ్చిన డబ్బును అమ్మవారి పూజలు అన్నదానాలంటూ ఖర్చుచేసేవారే తప్ప ఈరోజు మేము కోటీశ్వరులమవ్వాలని కోరుకోలేదాయన . మాకు తులంబంగారం ఆస్తిగా ఇవ్వకపోయినా బంగారు కొండ అమ్మను సేవించుకునే అదృష్టం కల్పించారాయన .ఇదే నిజమైన ఆస్థి మాకు.
ఇక ఆయన నిజజీవితంలో ఓసంఘటన [పెద్దవారు చెప్పుకుంటుంటే చిన్నప్పుడు విన్నది] చెబుతాను మీకు.
అప్పటిలో అసెంబ్లీకి ఎన్నికలురాగా వినుకొండ సీటు భవనం జయప్రద గారికి ఇచ్చారు . ఆవిడభర్త భవనం వెంకట్రామ్ గారు స్థానిక నాయకులద్వారా ఈయనగూర్చి విని . ముందుగా ఆయన దగ్గరకు వచ్చారు . గురువుగారూ ! ఈవిడకు మీ ఆశీర్వాదాలు కావాలి ,అనికోరారు . అమ్మ అనుగ్రహంతో అమ్మాయి గెలుస్తుంది . అంతేకాదు పరిపాలనస్థానాన్ని అందుకునే అదృష్టం కూడా ఉంది అని భవిష్యవాణి చెప్పారట. ఆమె ఎంతో సంతోషించి తాతగారూ ! మీ నోటిచలువవలన అదేజరిగితే మీపూజకు కావల్సినవన్నీ నేను చూసుకుంటాను అని అన్నారు. ఏమక్కరలేదమ్మా ! అమ్మవారి పూజజరిపించి , అన్నదానం చేపించాలి అని ఈయన మాట తీసుకున్నారు. తప్పనిసరిగా అని ఆవిడ మాటిచ్చారు.
సరే ! ఎన్నికలలో హోరాహోరీ పోరులో ఆవిడ గెలవటం ,మంత్రివర్గంలో స్థానం లభించటం కూడా జరిగింది. అయితే మనకు ఏరుదాటాక పడవనడిపినవాల్లందరూ వెంటనే గుర్తు రాకపోవటం సహజమే కదా ! అలాగే ఆవిడ ,వాల్లాయనా తమపనులలో తాము బిజీ అయ్యారు. వాల్లంత వాల్లు పిలుస్తారులే అని ఈయన ఎదురు చూశారు . కానీ ఈయన ఆశ నెరవేరలేదు.
ఓరోజు మంత్రిగారు వినుకొండ వచ్చారు . ఆర్ అండ్ బి బంగ్లాలో అధికారులను పార్టీ కార్యకర్తలను కలుసుకుని మాట్ళాడుతున్నారు. ఆరోజు మాజేజినా గారు వినుకొండలోనే ఉన్నారు. ఆయనకు ప్రియశిష్యుడు భూమా ఓబయ్య గారు తన లాడ్జిలో ఒక గదిని ఈయనకు కేటాయించారు . ఈయన వినుకొండలో ఉన్నప్పుడు స్నానపానాదులు జపతపాలు అన్నీ ఆరూములోనే . ఆరోజు మధ్యాహ్నం పన్నెండుగంటలదాకా ఆయన జపం చేసుకుంటూనే వున్నారు. ఆతరువాత ఎలాగూ మంత్రిగారు వినుకొండలోనే ఉన్నారు కదా ! మనమే అడుగుదాము పూజకు అన్నదానానికి ఇస్తామన్న మొత్తాన్ని అని నేరుగా బంగ్లాకు బయలుదేరాడు . తీక్షణం గా జపంచేసి ఉన్నాడాయన . ఆపైన ఏమీ తినక ఆకలితోకూడా ఉన్నాడు. త్వరగా మాట్లాడి రావాలని వెల్లాడు . అయితే అక్కడ కార్యకర్తలు,అధికారులతో హడావుడిగా ఉంది . ఈయన నేరుగా మంత్రిగారి దగ్గరకెల్లాడు. జ్యోతిష్యం వెంకయ్యగారుగా ప్రసిద్దులుకనుక మిగతావారు తొలిగి దారిచ్చారాయనకు. మనమ్మాయే కదా! అన్న ధోరణిలో ఈయన మర్యాదలేవీ పాటించకుండా వెళ్ళటమేకాదు ఏకవచనంతో ...అమ్మాయ్ ! నువ్వు ఇచ్చినమాట మరచిపోయావట్లుంది. నువ్వొస్తావని పూజజరిపించాలని చూస్తుంటే అసలు పట్తించుకోలేదేమిటి ? అంటూ భోలాగా మాట్ళాడుతూ వెల్లి ఎదురుగా ఆశీనుడయ్యాడు. ఈయన ఎర్రనిపంచె పైకండువా మాత్రమే ధరిస్తాడు. నుదుటవీభూధి కుంకుమ మెడలో రుద్రాక్షలు ఇదీ అవతారం.
తానుమంత్రి. పక్కన అధికారులు నాయకులు వినయంగా వచ్చి మాట్ళాడుతుంటే,మంచీ మర్యాదా లేకుండా వచ్చిన
సమయం సందర్భంలేకుండా ఎదో అప్పువసూలుకొచ్చినట్లు వచ్చి అడుగుతున్నాడన్న భావనతో మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది . అంతటితో ఆగినాబావుండేది .ఆమె దీన్ని అవమానంగా తీసుకున్నది. ఏం ముసలోడా ! ఏంమాట్లాడుతున్నావో ! ఎవరితో మాట్ళాడుతున్నావో తెలుసా ? ముందు బయటకు నడువు అని గర్జించిందట. ఇప్పటిదాకా మంత్రిగారు మనమ్మాయే అన్న నమ్మకంతో ఉన్న ఈయనకు ఇదొక అవమానం. ఏమాట్లాడుతున్నావమ్మాయి? గుర్తుందోలేదో నీకు . నువ్విచ్చినమాటకోసమే వచ్చాను అన్నాడు ఈయన. అది నిర్లక్ష్యంగా భావించిన ఆవిడకు కోపం నసాళానికెక్కింది . వెళతావా లేకపోతే ఈడ్చి బయటపడెయ్యమంటావా అని ఆవేశంతో ఊగిపోయింది . ఇక ఏకళనున్నాడొ! ఈయనకు అప్పుడు ఆవేశం అదుపుతప్పింది . అసలే ఆకలితోకూడా ఉన్నాడు పదిమందిలో అవమానం .... నన్ను బయటకు పొమ్మంటావా ? ఈ అధికారం చూసుకునే కదా పెద్దాచిన్నాలేకుండా ..ఈడ్చి పారేస్తానంటావా ? . నువ్వే పోతావు ఫో ... .... నీకీ పదవి ఊడేదిఖాయం .అ ని కోపంతో శాపనార్ధం పెట్టాడు . ఆరోజు వెంకట్రామ్ గారు లేరు / ఆవిడ తండ్రి గారున్నారు . ఆయనకుకోపంవచ్చి తన్నండ్రా నా కొ.... అని ఏదో తప్పుడుకూతకూడా కూశాడట.మీదకురాపోగా మిగతావారడ్డుకున్నారు . వెంటనే మంత్రి గారు స్థానిక సిఐ . ని చూస్తూ ముందీ ముసలోడ్ని లోపలపడెయ్ తరువాత చూస్తాను అని ఆర్డరేశారు . అప్పుడు సి ఐ. హుడ్ గారని ఉండేవారు .[ఆయన క్రిష్టియన్ అయినా నెల్లూరులో వాల్లమ్మయి పెల్లికి గురువుగారొచ్చి బొట్టుపెడితేనే కుదురుతుందని చెప్పి ,అభ్యంతరంపెట్టిన తమ మతపెద్దలఅభ్యంతరాలను కూడా తిరస్కరించినవారట .అంత గురుత్వం ఈయనంటే . ] ఆయన మంత్రిగారికి చేతులెత్తి నమస్కరించి అమ్మా! నేనాపనిచేయలేనమ్మా ..అని అశక్తతను వెల్లడించారు . ఇక మధ్యలో స్థానిక నాయకులు మధ్యలోకి పరిగెత్తుకొచ్చి ఏదో పెద్దవాడులేమ్మా ! పోనీయండి అని ఆవిడకు కొందరు సర్ధిచెబుతుండగా మరికొందరు గురువుగారూ ముందు మీరు పదండి ,,తరువాతమాట్ళాడదామని ఈయనను బయటకు తీసుకొచ్చారు . ఈయన ఆవేశంతో బుసలు కొట్టుకూంటూ వెల్లిపోయాడు. ఈవిడ కేమి దెయ్యంపట్టినదబ్బా! పెద్దాయనను అంత అవమానించిందని స్థానిక నేతలు మనసులో బాధపడ్దారు.
ఇక మంత్రిగారి అవేశం తగ్గలేదు . మంత్రిగా తాను చెప్పినా అరెస్ట్ చేయని హుడ్ గారిమీదకు మల్లింది కోపం. వెంటనే ఎస్పీ కి ఫోన్ చేసి ఈ సిఐ నా నియోజకవర్గంలో ఉండటానికి వీల్లేదు వెంటనే ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పింది. అప్పటి గుంటూరు ఎస్పీ శ్రీకాంతరెడ్డి తాతగారికి శిష్యుడు.
సిఐ గారు విచారంగా సాయంత్రం జేజినాయనగారున్న రూముకొచ్చారు . గురువుగారూ ! ఆవిడ నామీద కక్షసాధించేలా ఉన్నారు .పిల్లలు చదువులు మధ్యలో ఉన్నాయి,సంసారం మొత్తంఅ టు ఇటుమార్చటం ఇబ్బంది అని తనబాధ వ్యక్తం చేశాడు. ఏం పరవాలేదు. నేను ఇంటికి వెళుతున్నా నలభైరోజులు పూజకు కావలసిన కొబ్బరికాయలు పూజాద్రవ్యాలు పంపు నువ్వు ఒక నెల సెలవు పెట్టు అని చెప్పి మనసులో అగ్నిపర్వతాలు పేలుతున్నట్లు అవమానభారంతో వెల్లాడు.

ఇక ఎస్పీ సిఐని పిలిచాడు గుంటూరు . ఏమిటి ఏంజరిగిందని ? అడిగాడు. ఇలా గురువుగారొచ్చారండి . ఈవిడ చాలా అవమానకరంగా ప్రవర్తించారు అని విషయమంతా వివరించాడు. ఈమెకేమి దరిద్రం పట్టుకుందో ఆయనతో అలాప్రవర్తించింది అని ,సరే నువ్వు సెలవుమీద కంటిన్యూ అవ్వు తరువాత చూద్దామని సలహాఇచ్చారు ఆయన.
ఇక ఈంటికొచ్చిన మాజేజినాయన గారు వీధిలోకి మొహంకూడా చూపలేకపోతున్నాడు . అమ్మముందుకూర్చుని దీనంగా మౌనంగా విలపిస్తున్నాడు పసిపిల్లవానిలా. ఎందుకింత అవమానం .నేనేం స్వార్ధంతో ఎవరినీ అడగలేదు పదిమందికి ఆకలైనవాల్లకు అన్నం పెట్టాలనుకున్నాను అందుకు ఇంత అవ్మానం చేపిస్తావా అని? అమ్మవారిని ప్రశ్నిస్తున్నట్లుగా జపంలో ఉండిపోయాడు . నెల దాటిందేమో
ఇక హఠాత్తుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారింది .జైఆంధ్రా ఉద్యమం ఉదృతరూపం దాల్చింది. బందులు రాస్తారోకోలు కల్లోలంగా ఉంది . చివరకు ప్రభుత్వం రద్దయింది .ఆవిడ పదవి ఊడింది. అంతేకాదు ఈ గొడవలలో రోడ్డుపక్కన కారు ఆపుకుని కూర్చున్న పెద్దమనిషిని[జేజినాయనను తిట్టిన వారు] ఊరేగింపుగా పోతున్నగుంపులో నుంచి ఎవరో కత్తితో పొడవగా అది. బుగ్గల్లోంచి నాలుకను కోసుకుంటూ అటువైపుకి దిగిందట.

ఇక కాలం ఆగదుకదా ! మరలా ఎలక్షన్లకు జయప్రదకే వినుకొండ సీటూ ఇచ్చారు . విషయం తరువాత తెలిసిన వెంకట్రామ్ గారు బాధపడ్దారు. ఎకాఎకిన ఎందుకులే అని ఇప్పటిదాకా రాకపోయినా సీటూ కన్ఫర్మ్ కాగానే మరలా మందీమార్బలంతో వినుకొండవచ్చి గురువుగారిని పిలిపించుకుని ఆశీర్వచనం కోరారు. ఏదో తెలిసో తెలియకో జరిగినవాటిని పెద్దలు మీవంటీవారు పట్టించుకుంటే ఎలా ? మేము మీపిల్లలలాంటివాల్లము కాదా అని తాతగారి కోపం అగ్గేలామాట్ళాడారు. కానీ ఈయన మాత్రం .. ఇక ఈజన్మకు ఈవిడకు అధికార యోగం ల లేదు..లేదు..లేదు .. ముఖాన అలావ్రాసి ఉంది అని అన్నారట, . ముఖం చిన్నబుచ్చుకున్న వెంకట్రామ్ గారు అదేమిటి గురువుగారు అంత కఠినంగా ? అని బాధపడ్డారట . కానీ నాయనా నువ్వు వినయవంతునివి నీకు మాత్రం రాజయోగ ముంది అని పలికారట. సరేలెండి ! పోటీచేస్తున్నది ఆవిడ మధ్యలో నాయోగమెందుకు లెండి అని నిరాశగా మాట్లాడాడు. కాదు నేచెప్పేది సత్యం . నీకు తప్పనిసరిగా రాజయోగం ప్రాప్తిస్తుంది అని అశీర్వదించటం ఆతరువాత అలాగే ఆవిడ ఓడిపోవటం జరిగింది.
కాలక్రమంలో ఎమ్మెల్సీ గాఉన్న భవనం వెంకట్రామ్ను ఇందిరాగాంధీ పిలిచి ముఖ్యమంత్రిని చేయటం తో తాతగారు చెప్పిన భవిష్యవాణి నిజమైంది. ఆతరువాత తాతగారిని హైదరాబాద్ పిలిపించుకుని ఆనందంతో ఆశీర్వాదాలు తీసుకున్నారు వెంకట్రామ్ గారు.
వారు తాతగారి గూర్చి స్వయంగా వ్రాశిన నోట్స్ నాదగ్గరుంది

1 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల September 21, 2011 at 8:32 AM  

ఒక్కొక్కసారి అంతే, పోయేకాలం దాపురిస్తే అన్నం పెట్టే అమ్మనే అవమానిస్తారు కొందరు. అలాంటివారికి ఇలాగే బుద్ధి చెప్తుంది అ తల్లి. జపతపాదులకున్న శక్తిని తెలియచేసారు, చాలా ధన్యవాదాలు.

కలియుగానికి నామజపమే అతిపెద్ద తపస్సు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP