లోకాభి రాముడు
>> Tuesday, June 7, 2011
- కిల్లాన మోహన్‌బాబు
ఏ వైరమూ లేకుండా చెట్టుచాటునుంచి తననెందుకు వధించావని వాలి ఆఖరి ఘడియల్లో ప్రశ్నిస్తే- రఘురాముడు చెప్పిన ధర్మరహస్యం రసరంజితం. పరమాత్మకు తప్ప పరమధార్మికులకు సైతం ఇది సాంతం అర్థం కాదు. పరిశుద్ధ హృదయ దర్పణంతో పరిశీలిస్తేనే ధర్మసూక్ష్మం అందులో ప్రతిబింబిస్తుంది. వాలి మెడలో ధరించిన కాంచనమాల గతంలో సాక్షాత్తు విష్ణువే దేవాంతర రూపంలో ప్రసాదించనది. ఆ మాల ధరించి యుద్ధం చేస్తే ఎదుటివాడు ఎంతటి బలవంతుడైనా ఎదిరి నిలువలేడు. ఆ వరబలం వాలికున్నంతవరకు కోదండరాముడు తలపడినా దాని ప్రభావంనుంచి తప్పించుకోలేడు. పైగా కూతురితో సమానమైన సుగ్రీవపత్నిని చెరపట్టి అధర్మానికి పాల్పడ్డ వాలి దండనార్హుడు. వానరజాతిలో అలాంటి సంప్రదాయం ఉన్నప్పటికీ భర్త మరణించిన తరవాత మాత్రమే అది సాధ్యపడుతుంది. ధర్మసంరక్షణార్థం భరతుడి ప్రతినిధిగా అధర్మపరుణ్ని అణచడం అన్యాయం కాదు. రాక్షస సంహారం కోసం తాను మానవజన్మ ఎత్తాననీ ఇందుకోసం ఇంద్రుని అంశతో వాలి ముందుగానే జన్మించినట్లు చెబుతాడు. రానున్న రామరావణ సంగ్రామంలో వానర సహాయం అనివార్యమని అంటాడు. తద్భిన్నంగా వాలి రావణునితో మైత్రి పెంచుకోవడమూ అధర్మం కిందికే వస్తుందని ఆయన విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. పితృద్రోహం, దేవద్రోహం దోషాలు అంటకుండా వధించానని వాలికి కనువిప్పు కలిగిస్తాడు.
వాల్మీకి రామాయణాన్నే అందరూ ప్రామాణికంగా స్వీకరిస్తారు. చిత్రంగా- ప్రస్తుతం ప్రజాబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కొన్ని సంఘటనలు, సన్నివేశాలు ఈ కావ్యంలో కనిపించవు. ఉదాహరణకు- అహల్య రాయిగా మారడం, లక్ష్మణుడు రేఖలు గీయడం, శృంగిబేరపురం బోయరాజైన గుహుడు స్వయంగా నది దాటించడం, రావణబ్రహ్మ కడుపులో అమృత భాండం ఉండటం వంటివి మనకు గోచరించవు. వాల్మీకి తరవాత తులసి, భాస్కర, మొల్ల, ఇటీవల విశ్వనాథ వంటివారు రామాయణాన్ని తమదైన శైలిలో రచించి తరించారు. మూలకథకు భంగం వాటిల్లకుండా నాటకీయతకోసం మార్చిన ఘటనలు ఈ కావ్యానికి వన్నె తెచ్చాయేకాని చిన్నబుచ్చలేదు! ఇంతటి ఘనచరిత్ర కలిగిన సూర్యతేజస్వి, చంద్ర కౌముదీ వర్చస్వి, శుభయశస్వి అయిన లోకాభిరాముడికి వాడవాడలా, పల్లెపల్లెనా మందిరాలు నిర్మించి నిత్యం పూజించడం మానవాళికి దక్కిన పుణ్యఫలం!
0 వ్యాఖ్యలు:
Post a Comment