ప్రేమయాగం
>> Sunday, June 5, 2011
- చిమ్మపూడి శ్రీరామమూర్తి కారణమేమీ లేకుండా మనిషిని కట్టి పడేసేది ప్రేమ ఒక్కటే! పౌరాణిక వాఞ్మయమంతా మనకు ఇదే ప్రేమసూత్రాన్ని ప్రబోధించింది. మదర్ థెరెసా, బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, బాపూజీ వంటి మహామహుల ప్రేమామృత బిందువులనే ఇవాళ మనం రుచి చూస్తూ జీవిస్తున్నాం. భావితరాలకు ప్రేమను అందించాల్సిన గురుతర బాధ్యత మనమీద ఉందన్న సత్యాన్ని ఎన్నడూ మరువకూడదు. పిల్లలకు మనమిస్తున్న ప్రేమను ధనార్జనా వ్యామోహమనే దుర్లక్షణం ఆక్రమించేస్తోంది. పాశ్చాత్య సభ్యతా-సంస్కృతుల విషపునీడలు పడుతున్నాయి మన వాత్సల్యాలపైన. పరిహారంగా, పశ్చాత్తాపంతో రేపటి చరితకు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ప్రేమనేది పొలాల్లో పండదు, బజారులో విక్రయించరు. చక్రవర్తిగానీ, ప్రజలుకానీ- ఎవరైనాసరే అహంకారాన్ని అంతా ఇచ్చేస్తే చాలు, అది దొరికిపోతుంది సులభంగా- అంటాడు కబీర్‌దాసు. ఈ అహంకారం పోగొట్టుకోవడానికి ఒకటే మార్గం. జ్ఞానార్జన చేయాలి. అందుకెన్నో మార్గాలున్నాయి. అవన్నీ పలు సందర్భాల్లో మన పెద్దవాళ్లు చెబుతూనే ఉన్నారు. అనుసరించలేకపోతే, ఆచరించలేకపోతే అది మన ఖర్మ. ఇతర ప్రాణికోటిని నిశితంగా పరిశీలించండి. గోవు ఈనిన తక్షణం పుట్టిన దూడ శరీరాన్ని నాకుతూ శుభ్రపరుస్తుంది. తనలో పొంగిపొర్లుతున్న వాత్సల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది! అలాగే ప్రతి పక్షీ, జంతువూ తమ బిడ్డల్ని ఎంత ప్రేమగానో చూసుకుంటాయి. ఒక కాకి చనిపోయి కిందపడిపోతే ఎన్ని కాకులు 'కా కా' అంటూ గుంపులు గుంపులుగా వచ్చి తమ సంతాపాన్నీ, దుఃఖాన్నీ వ్యక్తం చేస్తాయో గమనిస్తూనే ఉంటాం. ఒక్క అన్నంముద్ద పడేస్తే చాలు, కుక్క మన పాదాలను ముద్దాడుతూ అక్కడే కూర్చుని ఉంటుంది. ఎంతటి మేధావులు, పండితులు, కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ప్రవక్తలు, బోధకులు, సాధకులు అయినా 'ప్రేమ' అనే రెండక్షరాల్లోని అపార మహిమను తెలుసుకోలేకపోతే వాళ్ల విద్యార్హతలన్నీ నిరర్థకాలే. శత్రువుల్ని మిత్రులుగా మార్చే ఈ ప్రేమను, సేవాభావాన్ని పెంచే ఈ ప్రేమను మన జీవితాల్లోకి సదా ఆహ్వానించాలి. తనవితీరా ఆస్వాదించి అనుభవించవలసిందీ, పదుగురికీ పంచవలసిందీ ప్రేమను. అది విశ్వశాంతిని విరాజిల్లజేసే పరీమళ ప్రవాహం. ఎక్కడ ఎవరినుంచి సంప్రాప్తించినా కళ్లకద్దుకొని స్వీకరించదగిన దివ్యప్రసాదం. ప్రేమ తపస్సు, ప్రేమ ఉషస్సు, దేవతలను ప్రసన్నం చేసే హవిస్సు. అనుబంధ వారధి, అనురాగ వారిధి, ఆదర్శ జీవన రథసారథి. అది హృదయ వీణాతంత్రుల్ని మృదువుగా మీటే స్వర మంత్రాక్షరి. అహపుపొరల్ని చీల్చే ఇహలోక ఆనందఝరి. ఇంటింటా శాశ్వతంగా వెలసి ఉండవలసిన సంతోషాల సిరి. ప్రపంచీకరణ విషవలయంలో చిక్కుకున్న మన హృదయాల్లో 'ప్రేమ' వ్యాపారం, స్వార్థం, సంపాదన, అత్యాశల్లాంటి అవతారాలెత్తి కలియుగ జగతిని క్షీణ, హీన, దీన దయనీయ దశకు తీసుకుపోతోంది. వేదనకు ఔషధంగా, రోదనకు సాంత్వనంగా పనిచేసేది ప్రేమ! కమలంలోని కోమలత్వాన్నీ, వెన్నలోని మృదుత్వాన్నీ, వెన్నెలలోని చల్లదనాన్నీ, మాతృభాషలోని మాధుర్యాన్నీ ద్విగుణీకృతం చేసే ఈ ప్రేమను వర్ధిల్లజేయాలి. హృదయ సౌందర్యానికీ, ఆత్మసౌందర్యానికీ మెరుగులు దిద్దే ఈ ప్రేమయాగంలో మనం సమిధలమవుదాం. ప్రేమరాగంలో స్వరాలమవుదాం! |
0 వ్యాఖ్యలు:
Post a Comment