సాకారం - ఓ సందేశం
>> Wednesday, May 4, 2011
- దానం శివప్రసాదరావు మంగళకరమైన ఆ రూపం, అలంకరణాదులు ఎన్నో పురాణ గాథలకు నిలయం. అంతే కాకుండా జీవరాశికి సందేశాత్మకం. మానవాళి రుజుమార్గంలో పయనిస్తూ, శివతత్వాన్ని తద్వారా ప్రేమతత్వాన్ని గ్రహించి ఆ దేవదేవుడికి ప్రతీకగా ఉండాలన్న అంతరార్థాన్ని 'శివరూపం' తెలియజేస్తుంది. నిరాడంబరత్వానికి నిదర్శనం శివస్వరూపం. శుభాలను ఇచ్చేవాడే శంకరుడు. ఆయనకు ఇవ్వడమే తెలుసు. ప్రతిగా ఆయన కోరుకునేది భక్తిపూరిత హృదయాన్నే. నిర్మలమైన మనసుతో ఇంత జలంతో అభిషేకించినా, ఓ మారేడుదళం అర్పించినా పరమానంద భరితుడయ్యే తత్వంగలవాడు ఆయన. ఎంతో ఔదార్యం, వాత్సల్యం తన సృష్టి పట్ల! చితా భస్మమే పైపూత. 'నానుంచి ఆవిర్భవించిన జీవరాశులు తిరిగి నాలోనే లయమవుతా'యన్న కాలసత్యాన్ని తెలుపుతుంది. తలపై గంగ- నెలవంక. దేహానికి అగ్రభాగాన ఉండే శిరస్సు ప్రధానమైంది. శిరోపైభాగాన ఉండే సహస్రారం, బ్రహ్మగ్రంధి ఆ పరమాత్మకు నెలవు. మస్తిష్కం శరీరాన్ని, నాడులను నియంత్రిస్తుంది. వ్యర్థ ఆలోచనా విధానాలతో మస్తిష్కం ఒత్తిడికి గురికాకూడదు. గంగ శీతలత్వానికి, చంద్రుడు అమృతత్వానికి ప్రతీకలు. దేహంలో జ్వలించే అగ్నిని అవి సమతుల్యంగా ఉంచుతాయి. పవిత్రమైన భావసంపద, నిగ్రహంతో కూడిన ఆలోచనా స్రవంతి శిరోభాగాన గంగ, నెలవంకల్లా విలసిల్లితే- ముఖబింబం ప్రశాంతంగా, చిత్తం శాంతిగా ఉంటుందన్న సంకేతానికి నిదర్శనం. గంగాధరుని పాలభాగంపై విబూధి రేఖలు. జీవాత్మ-ఆత్మ-పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మే-పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం... అది మనపాలిట జ్ఞాననేత్రం. క్షీరసాగరమధనంలో ఆవిర్భవించిన ప్రళయ భీకర హాలాహలాన్ని కంఠభాగంలో నిక్షిప్తంగావించుకొని ఆయన నీలకంఠుడయ్యాడు. ఢమరుకం ప్రణవనాదమైన ఓంకారానికి, సకల వాఞ్మయాలకు జననస్థానం. మానవశరీరంలోని నాడీ మండలాలు 'ఓంకారం'తో పునీతమయ్యేలా కంఠం ద్వారా, రెండు పెదవులతో ప్రణవోచ్చారణ చెయ్యాలి. మంగళకరమైన, మధురమైన, ప్రీతికరమైన వాక్కులు మాత్రమే కంఠంనుంచి వెలువడాలి. కఠిన, పరుష, నిందాపూరిత మాటలు విషం లాంటివి. అవి కంఠంనుంచి బైటకు రానేకూడదు. అలాగని మనోకోశంలోకి జారనూకూడదు. నాగాభరణుడు-గజచర్మాంబరధారి. పిపీలికాది బ్రహ్మాండపర్యంతమూ ఆయనకు ప్రీతిపాత్రమైనదే. మానవుడు సృష్టిలోని జీవరాశులపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న దివ్యోపదేశమే అది. పంచభూతలింగాల్లోని వాయులింగం సాలీడు, సర్పం, గజరాజులతోనే ముడివడి ఉంది. శ్రీకాళహస్తీశ్వరలింగంగా పూజలు పొందుతోంది. ఆయన వాహనం నందీశ్వరుడు. రుద్రాక్షమాలలే ఆయన ఆభరణాలు. శివునికంటి నీటి చుక్కే రుద్రాక్ష అంటూ ఐతిహ్యాలు చెబుతున్నాయి. పవిత్రతకు చిహ్నం రుద్రాక్షలు. ఔషధీయతత్వం గలవి. ఆరోగ్యప్రదమైనవి. ప్రకృతిలో లభించే అరుదైన జాతివృక్షాలవి. పరమేశ్వరుడు ప్రకృతి ప్రియుడు. పార్వతీమాత ప్రతిరూపమే ప్రకృతి. ప్రకృతి ఆరాధనే ఆదిదంపతుల ఆరాధన. పరమేశ్వరుని చేతిలోని త్రిశూలం దుష్టుల పాలిట పాశుపతం. శిష్టుల పాలిట రక్షణ కవచం. ఆయుధం జగత్తు సంరక్షణకే. త్రిశూలం పైభాగాన ఉండే మూడు కొనలు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడుకొనల్లో మధ్యభాగాన ఉండే 'కొన' పొడవుగా ఉంటుంది. అది సత్వగుణానికి ప్రతీక. సత్వగుణ ప్రధానులుగా మానవాళి చరించాలన్న సందేశం అందులో ఉంది. శివరూపం తెలియజేసే తత్వమే జీవన పరమార్థంగా భావించాలి. కారణజన్ముడు శ్రీరామకృష్ణులు. కామార్పకూర్‌లో నాటక ప్రదర్శనలో శివుడి వేషం వెయ్యాల్సి వచ్చింది. ఎప్పుడైతే శివుని వేషధారణ తన శరీరంపైకి వచ్చిందో- ఇక సర్వమూ మరిచిపోయారు. ధ్యానముద్రలోకి వెళ్లిపోయారు. నాటకం అయిపోయింది. ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఇతర పాత్రధారులు రంగులు కడిగేసుకున్నారు. రంగస్థలిపై భావసమాధిలో అలానే శ్రీరామకృష్ణులు. ఉలకరు. పలకరు. ఆ తరవాత ఎప్పటికో బాహ్యస్మృతిలోకి వచ్చారు. వేషధారణ ఆయనను శివతత్వంలోకి నడిపింది. దైవలక్షణాలు మనో మందిరాన్ని చైతన్యవంతం చేశాయి. పరమేశ్వరుడి లీలాగాథలే కాదు, రూప వైశిష్ట్యమూ ఓ గొప్ప సందేశం. జిజ్ఞాసతో కూడిన భక్తితత్వం అలవడితేనే శివతత్వం బోధపడుతుంది. ఆ ఈశ్వరతత్వాన్ని గ్రహించి, తదనుగుణంగా చరించేవారు భువిపై నడయాడే దేవుళ్లు! |
0 వ్యాఖ్యలు:
Post a Comment