మాయ
>> Friday, May 6, 2011
మాయ
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
'బ్రహ్మ సత్యం జగన్మిథ్య' అంటుంది అద్వైత సిద్ధాంతం. జగత్తు అనేది పుట్టనేలేదని, ఈ జగత్తు మాయ తాలూకు పరిణామమని, బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు 'జగత్తు' అనే భావన నశిస్తుందని, అంతవరకు వ్యవహారంలో సత్యంగా భాసిల్లుతుందని మాయావాద సిద్ధాంతం. ఈ వాదం ప్రకారం మాయ ఆద్యంతాలు కలిగినది. ఈ వాదం లోకంలో చాలా ప్రాచుర్యం కలిగి 'జగన్మిథ్య' అని వేదాంతులు భావిస్తున్నారు.
ఉన్నట్లు భాసిస్తున్నప్పటికీ ఏది యథార్థమైనది కాదో అది మాయ. సంసారానికి మాయ పర్యాయవాచకమంటారు వేదాంతులు. సృష్టికర్త బ్రహ్మ సృష్టి ప్రారంభంలో 'దేవా! మాయ అంటే ఏమిటి? దాని నుంచి జీవుడు విముక్తిపొందే విధానమేమిటి?' అని మహావిష్ణువును ప్రశ్నించాడట. 'సృష్టికర్తవు నీవే కదా!' అన్నాడు విష్ణువు. 'నేనే' అని అంగీకరించాడు బ్రహ్మ. 'ఓ చతుర్ముఖుడా! ఇదే మాయ అంటే. నీ సమాధానాన్ని బట్టి సృష్టికర్తవైన నీవు కూడా మాయకు అతీతుడవు కావని తెలియటం లేదా?' అన్నాడు.
సృష్టిలో సమస్త ప్రాణులూ తాము చేసే పనులన్నింటికీ తామే కర్తలమనుకుంటారు. నిజానికా 'కర్త' వారిలోని ప్రాణమే. అంటే, శ్వాసరూపంలో పనిచేసే వాయు స్వరూపుడైన పరమేష్ఠియే. జీవుల శరీరం, ప్రాణం, మనస్సు సమస్తం ప్రాణస్వరూపుడైన పరమాత్ముని అధీనం. జీవుడు తానే కర్తననుకోవడం మాయ. బ్రహ్మ కూడా జీవకోటిలోని వాడేనని తాత్పర్యం. బ్రహ్మ నుంచి చీమ దాకా సమస్త జీవజాలానికి బుద్ధి ప్రబోధకుడిని తానే అంటాడు మహావిష్ణువు. 'ఏ జీవులనైతే నేను అనుగ్రహిస్తానో అంటే వారికి ముక్తిని ఇవ్వాలని సంకల్పిస్తానో అట్టి వారికే ఈ 'మాయ' వారి మనసుల్ని విడిచిపెట్టే మబ్బుతెర వీడినట్టు వీడి ఆత్మ సూర్యునివలె ప్రకాశిస్తుంది' అని భగవానుడి ఉవాచ. బ్రహ్మదేవుడు కూడా జీవుడే గాని పరుడు కాడు. ఈ రహస్యాన్ని గుర్తించి అహంకారాన్ని త్యాగంచేసి సర్వసమర్పణ బుద్ధితో శరణాగతి చేసిన వారికే మాయ తొలగిపోతుందన్నది పెద్దలమాట.
బృహస్పతి మనువుకు మాయాప్రవృత్తి తెలుసుకోవడం వీలుకానిదని ఇది సత్వరజస్తమో గుణాత్మకమని దానికి బద్ధుడైనవాడు జ్ఞానాన్ని కోల్పోతాడని చెబుతాడు. వైరాగ్యం అనే కొడవలిచేతనే మాయ తెగటారుతుందని విజ్ఞుల భావన. భీష్ముడు ధర్మరాజుకు చేసిన విజ్ఞాన బోధనల్లోనూ త్రిగుణాత్మకమైన ఆత్మతత్వాన్ని గ్రహించడమే మాయను ఛేదించే మార్గమంటాడు.
పరమాత్మ త్రిగుణాలకు ఆవలకు ఉండే వెలుగు. త్రిగుణాతీతుడు జన్మ మృత్యు జరాదుఃఖాల నుంచి ముక్తుడవుతాడు.
లోకంలో చాలామంది సంసారబంధాలు, మమకారాలు, సిరిసంపదలపై వ్యామోహం వదులుకోలేక ఇవన్నీ శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. సాధ్యమైనంత వరకు భౌతిక సుఖాలు, బంధాలపట్ల వైరాగ్య భావం అలవరచుకుని పారమార్థిక దృష్టి నిలుపుకొన్నప్పుడే శాంతిమయ జీవితం గడపగలుగుతాం. ఈ మాయా తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే సుఖ దుఃఖాలకు అతీతమైన మనస్తత్వాన్ని, జీవన సరళిని పొందగలుగుతాం.
0 వ్యాఖ్యలు:
Post a Comment