ఖాల్సాపంథ్
>> Wednesday, May 4, 2011
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
కాశ్మీరు పండితులను మతం మారాల్సిందిగా అక్కడి గవర్నరు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో వారు గురుతేగ్ బహదూర్‌ని శరణువేడారు. వారిని కాపాడే ప్రయత్నంలో గురుతేగ్ బహదూర్ తన శిరస్సునే అర్పించాడు. అప్పటికి కేవలం తొమ్మిదేళ్ల వయస్సుగల గోబిందరాయ్ పాలకుల దమనకాండను సమర్థంగా ఎదుర్కోగల యోధులుగా 'ఖాల్సా'లను రూపొందించాడు. 'ఖాల్సా' అంటే జీవితకాల పవిత్రయోధుడు. ధర్మరక్షణే అతని కర్తవ్యం.
సిక్కుల్ని సులభంగా గుర్తుపట్టగల విధంగా గురుగోబిందరాయ్ కకార పంచకాలు అనే అయిదు నిబంధనలు విధించాడు (1). కేశాలు, (2). కృపాణ్, (3). కచ్ఛా, (4). కడ (కడియం), (5). కంఘా (దువ్వెన). వీటిని ప్రతి సిక్కూ ధరించాలి.
ఖాల్సా ధర్మ స్వీకరణ 'పహుల్' (అమృతస్వీకరణ) ద్వారానే జరుగుతుంది. ఒక కళాయిలో 'పటాషా'లనే తీపి గుళికలు వేసి, అందులో పవిత్ర జలాలను పోసి, పంచబాణీలు పఠిస్తూ, గురువు తన 'ఖండ' (ఖడ్గం)తో ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాడు. గురువు ఆజ్ఞమీద తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి ముందుకు వచ్చిన అయిదుగురు శిష్యులకు (వీరినే పంచప్యారీలంటారు) ముందుగా మంత్రపూరితం, మధురమైన ఆ అమృతాన్ని (పహుల్) తీర్థంగా ఇచ్చి, తిరిగి వారినుంచి గురుగోబిందరాయ్ అమృతాన్ని స్వీకరించాడు. అదే సమయంలో 'పహుల్' స్వీకరించినవారి పేర్లను 'సింగ్' అనే గౌరవనామంతో జతచేశాడు. తన పేరును గోబిందసింగ్‌గా మార్చుకున్నాడు. తన 'ఖాల్సాలు' ఒక్కొక్కరు లక్షా పాతిక వేలమంది శత్రువులను సంహరించగలరని, పిచ్చుకలు డేగల్ని వేటాడిన రీతిలో సంఖ్యలో తక్కువైనా శౌర్యంలో అసమానులుగా ఉంటారని గురుగోబిందసింగ్ ప్రకటించాడు. ఆయన ఆకాంక్షను ఖాల్సాలు అనేక ధర్మయుద్ధాల్లో నిజంచేసి చూపించారు. శత్రువులకు 'ఖాల్సా'లు సింహస్వప్నమైనారు.
గురుగోబిందసింగ్ ఎంతటి మహాయోధుడో అంతటి సాధువు. మీరీ-పీరీ (యోధుడు-సాధువు)గా ఆయన ప్రసిద్ధి చెందాడు. కులమతాలకు అతీతమైన సిక్కుధర్మాన్ని ఆయన మరింత ప్రతిభావంతంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దాడు. గురుగోబిందసింగ్ ఒక అలౌకిక దివ్య తేజస్సుతో, వెయ్యి సింహాల శౌర్యంతో, పటిష్ఠమైన శరీరంతో రాచఠీవితో, ప్రేమ నిండిన హృదయంతో, విలక్షణమైన అపూర్వమైన వ్యక్తిత్వం కలిగి ఉండేవాడు.
ఖాల్సాలు ఉచ్ఛనీచ విచక్షణగానీ, పూర్వకుల, మత వివక్షగానీ చూపరు. అందరూ ఒకే పాత్రలోని ఆహారం స్వీకరిస్తారు. గురుద్రోహులు, పుత్రికా హంతకులు, ఖల్సాపంథ్‌లోకి చేరకుండా గురుగోబిందసింగ్ నిషేధం విధించాడు. వారితో సిక్కులు వైవాహిక సంబంధాలు పెట్టుకోకూడదని ఆంక్షలు విధించాడు. తన తరవాత శాశ్వత గురువుగా శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌ని నిర్ణయించి 1708వ సంవత్సరం అక్టోబరు ఏడోతేదీన గురు గోబిందసింగ్ పరమాత్మలో లీనమయ్యాడు.
1 వ్యాఖ్యలు:
Informative. Thank you.
Post a Comment