శాక్యముని ప్రవచనాలు
>> Friday, May 6, 2011
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా మనసులో పేరుకొంటున్న దోషాల్ని సమూలంగా తొలగించి ఆ మనసును నిష్కల్మషం చేసే సాధనాల్లో దానానికి అగ్రస్థానం ఉంది. దాతృత్వాన్ని స్వార్థమనే పొర కప్పివేస్తుంటుంది. 'నాది' అనే గర్వరేఖ తలెత్తని సుమనస్విత గుణం మనిషికి అవసరం. మనిషిని పట్టి పీడిస్తున్న మమత్వరోగాన్ని క్రమంగా తగ్గించే ఔషధంగా దానం అద్భుతంగా పనిచేస్తుంది. లోకంలో సత్యం, అసత్యం రెండూ ఉన్నాయి. మిథ్యాగర్వం చోటుచేసుకొంటూ ఉండటంవల్ల ప్రజలు సత్యాన్ని గ్రహించలేని అశక్తతకు లోనవుతున్నారు. అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నారు. ఈ స్థితి కొనసాగుతూ ఉన్నతకాలం వారు పరమార్థాన్ని గ్రహించలేరు. కల్లోలానికి, అశాంతికి లోనవుతారు. కన్నీటి వ్యధల్ని మిగుల్చుకొంటారు. ఇంద్రియాకర్షణకు లోనైనప్పుడు విపరీతమైన కోరికలకు బానిసలవుతారు. అసత్యం, అధర్మాల మార్గాల్లో పయనిస్తారు. అవివేకం బలపడి బంధనాలవైపు లాగుతుంది. జీవిత లక్ష్యాల్ని విస్మరింపజేస్తుంది. కర్కశ ప్రవృత్తిని ఆహ్వానిస్తుంది. వృత్తినైపుణ్యంగల మాలాకారుడు(పూలు గుచ్చి దండలు చేసేవాడు) వివిధ పుష్పాల్ని తీసుకొని మనసును దోచే రకరకాల పూలదండలు తయారుచేస్తాడు. ఉదారభావంతో ధనికుడు తనకు ప్రాప్తించిన సంపత్తిని సద్వినియోగపరచడానికి ఎన్నో పుణ్యసుమాల్ని చేయవచ్చు. మంచిని గుర్తించడం కర్తవ్యంగా భావించి, వేదనలో కుములుతున్న నిరుపేదల కన్నీళ్లు తుడవడానికి వీలైనంతవరకు ఖర్చు చేయవచ్చు. చేసిన సహాయం ఒకరికి వూతకర్ర అయితే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది? లోతుగా పరిశీలిస్తే- ఇవ్వడంలోని ఆనందాన్ని అభివర్ణించడానికి అక్షరాలు చాలవు. పైకప్పు సరిగాలేని ఇంటిలోనికి వర్షం నీరు సులభంగా ప్రవేశిస్తుంది. దానివల్ల ఆ ఇల్లు నివాసయోగ్యం కాకపోవచ్చు. కంతలు లేని చక్కటి పైకప్పు ఉన్న ఇంటిలోకి నీరు ప్రవేశించడం సాధ్యపడదు. సుదృఢమైన ఉత్తమ గుణాలు కలిగిన మనసులోకి కామం, క్రోధం, భయం, లోభం లాంటి దుర్లక్షణాలు ప్రవేశించడం దుస్సాధ్యం. ఐహిక సుఖాల్ని అభిలషించే మనుషులు బలహీనమైన హృదయంతో వీటిని వశులవుతారు. స్వార్థంతోనూ, స్వలాభాపేక్షతోనూ తమ జీవితాల్ని గురించి ఆలోచిస్తారు. పరుల క్షేమాన్ని పట్టించుకోరు. ఫలితంగా జీవితమంతా ఉరుకులు పరుగులతోనే వ్యర్థమవుతుంది. చివరకు ఆవేదనలు, భయాలు, సమస్యల వలయాల్లో చిక్కుకొంటారు. ఎంత రుచికరమైన వంటల రుచినైనా గరిటె గ్రహించలేదు. బుద్ధిహీనుడు జీవితమంతా పండితుల సన్నిధిలో గడిపినా ధర్మాన్ని గ్రహించలేడు. అలాంటి బుద్ధిహీనుడికి ఉన్నత స్థానం కల్పించి గౌరవిస్తే అది అందరి తప్పిదం. ఫలితం అందరూ అనుభవించవలసిందే. పుడమిలాగా మనుషులు క్షమాగుణాన్ని అలవరచుకొంటే 'అహింస' విరబూస్తుంది. అందుకోసం కోపం వంటి వికారాలకు దూరంగా ఉండాలి. నిర్వికారంగా ఉండటం అభ్యసించాలి. తలుపును మృదువుగా మెల్లగా వేసినా, గట్టిగా దబాలున వేసినా నిర్వికారంగానే ఉంటుంది. మన మనసూ అలాగే ఉండాలి. బురదలేని కాసారంలాగా శోభిల్లాలి. అర్థం పర్థంలేని మాటలు వేయికన్నా శాంతిని ఉపశమనాన్ని కలిగించే అర్థవంతమైన ఒక్క వాక్యం చాలు. కపట ప్రవర్తనవల్ల ఏర్పడే నింద తలవంపులు తెస్తుంది. మొదట విశుద్ధమైన నడవడికను మనిషి అలవరచుకోవాలి. ఇది కష్టమైన పని కావచ్చు. మానవత్వానికి ప్రాణం పోసేది ఇదే. దీన్ని సాధించిన తరవాతే ఇతరులకు ఏదైనా మంచిని బోధించాలి. తనను అంటిఉన్న అల్పత్వాన్ని తెలుసుకోవడమే సత్యశోభితమైన జ్ఞానం. పశువుల కాపరి కర్రపట్టుకుని పశువుల్ని తోలుకు పోతాడు. అలాగే జరామరణాలు జీవుల ఆయువును తోలుకు పోతుంటాయి. ఎప్పటికైనా మరణించక తప్పదని మనుషులు నిత్యం గుర్తుంచుకోవాలి. 'మరణం తప్పదు' అనే అవగాహన లేకపోవడంవల్ల అనవసర విషయాల్లోకి దిగుతుంటారు. భేదభావాలు సృష్టిస్తారు. ప్రలోభాలకు లోనవుతారు. ఘర్షణ పడతారు. శాంతికి విఘాతం కలిగిస్తారు. అనిశ్చిత ప్రపంచంలో నిశ్చయమైంది మరణమే. కాలం దయాదాక్షిణ్యాలు తెలియనిది. ప్రతి మనిషీ క్షణం క్షణం కరగటం తప్పదు- ఈ వాస్తవాలకు గుండెల్లో చోటు కల్పిస్తే మనుషులు వివాదాలకు, సమస్యలకు, దురాశకు స్వార్థానికి దూరంగా ఉంటారు. ఉపశమన సంపన్నులవుతారు. నిరతం శాంతి ప్రియత్వం పరిఢవిల్లుతుంది. |
0 వ్యాఖ్యలు:
Post a Comment