భక్తాగ్రేసరుడు హనుమాన్
>> Tuesday, April 19, 2011
- తటపర్తి రామచంద్రరావు
విషయ స్పష్టతతో, స్ఫుటంగా విస్పష్టంగా మళ్ళీమళ్ళీ వినిపించేలా ప్రతి అక్షరాన్నీ పలుకగల ఉత్తమ హనువులు (దౌడలు) కలవాడు కనుక ఆయనకు 'హనుమాన్' అన్నపేరు సార్థకమైంది. సన్యాసి వేషంలో రామలక్ష్మణుల ముందుకు వచ్చి ఆయన మొదటిసారి మాట్లాడినప్పుడు 'లక్ష్మణా! రుగ్వేదంలో మహాపండితుడు కాకపోతే, యజుర్వేదాన్ని ఔపోసన పట్టకపోతే, సామవేదంలో దిట్ట కాకపోతే- ఇంత స్పష్టంగా ఇంకా ఇంకా వినాలనిపించేలా మృదుమధుర కంఠంతో ఇలా ఇతడు పలకలేడు సుమా! ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం లేదు. ముఖంలో, కళ్ళల్లో, నుదుటిలో, హస్త విన్యాసంలో వ్యంగ్యంలేదు. ఇతను తప్పక హనుమాన్ అయి ఉంటాడు' అన్నాడు శ్రీరాముడు.
కేవలం అంజనకు జన్మించడం వల్లనే ఆయన ఆంజనేయుడు కాలేదు. ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు నాభి నుంచి మొదలైన వాయువు హృదయాన్ని దాటి శ్వాసనాద తంత్రుల్ని స్పృశించి అంగుడుని అంటే అంజనను తాకుతుంది. ఈ వాయువుకు, అంజనకు పుట్టినవాడు- అంటే 'ప్రశస్తమైన వాక్కు' కలవాడు కనుక ఆంజనేయుడు!
ప్రత్యక్ష నారాయణుడైన సూర్యదేవుడి వద్ద సర్వవేద శాస్త్రాలు అభ్యసించిన పండితుడు, దేవతల ఆశీస్సులతో సిద్ధులు పొందిన సిద్ధపురుషుడు. వజ్రశరీరుడు. ఒక్క బ్రహ్మాస్త్రానికి తప్ప ప్రపంచంలో ఏ ఆయుధానికీ తల వంచనివాడు. సుగ్రీవుడిలా రాజరికాన్ని సమర్థించగలడు. రామలక్ష్మణులతో సమానంగా ఒంటరిగా ధైర్య సాహసాలతో యుద్ధం చేయగల వీరుడు. గరుడునిలా ఎంతో ఎత్తుకు ఎగిరి సుదూర ప్రాంతాలకు చేరగలడు.
ఆత్మ పరిశీలన, మానసిక ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, వస్తుమయ ప్రపంచంపై వైరాగ్యం, సత్వసాధనం మొదలైన ఉత్కృష్ట గుణాలతో- ఆ మహాదేవుడితో సమానమైన రామభక్తుడు.
ఇంతటి మహాధీశాలికూడా లంకలో మొదట సీతాదేవి కానరాక నిరాశా నిస్పృహలకు గురై, రిక్తహస్తాలతో వెనుదిరిగితే శ్రీరాముడితో సహా అంతా హతాశులవుతారని చింతించి- ప్రాణత్యాగం చేసుకుందామనుకున్నాడు. కేవలం అది లిప్తకాలం పాటు. 'చనిపోతే దోషం, బతికుంటేనే కదా శుభాలను బడయవచ్చు' అని తనను తాను సముదాయించుకొని- ఆశావాదంతో సీతాన్వేషణలో సఫలీకృతుడయ్యాడు. రావణాసురుడు తన కళ్ళెదుటే సీతను బెదిరించి వెళ్ళిపోతే ఆమె తన జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు ఉద్యుక్తురాలైనప్పుడు రామ కథాగానంతో సీతాదేవిని ఊరడించి రామ సందేశాన్ని వినిపించాడు. హనుమంతుడి పాత్రలేని శ్రీరామకథ అసంపూర్ణమయ్యేది.
సీత బహూకరించిన మాలలోని ముత్యాలను కొరికి పారేసినప్పుడు ఆయన భక్తిని శంకించిన వాళ్ళకు దివ్య సందేశమిస్తూ- తన గుండెల్ని చీల్చి అక్కడ ప్రతిష్ఠించుకున్న సీతారాముల్ని చూపించిన భక్తశిఖామణి ఆంజనేయుడు. పితృవాక్య పరిపాలనలో శ్రీరాముడికి ఎంత పేరొచ్చిందో, మాతృవాక్య పరిపాలనలో శరణాగతుడికి రక్షణ కల్పించి తన దేవుడితోనే పోరాటానికి సంసిద్ధుడై- తానూ అంత పేరు తెచ్చుకున్నాడు. రామ బాణాన్ని మించినది రామనామమని లోకానికి చాటిన దివ్యుడు.
సృష్టి మిగిలినంతకాలం రామనామ జపం ఆగదు. రామశబ్దం వినిపించిన చోటల్లా ప్రత్యక్షమయ్యే చిరంజీవి భక్తాగ్రేసరుడు... భక్త జన రక్షకుడు హనుమాన్!
0 వ్యాఖ్యలు:
Post a Comment