తాగుబోతుల లెక్క తారుమారయ్యింది . హరిహరీ ! ఇంత మార్పా ???!!!
>> Thursday, April 7, 2011
. నాకు మరీ చిన్నతనంలో మాగ్రామంలో తాగుబోతులు కనపడితే చిన్నపిల్లలం దూరంగా పరిగెత్తేవాళ్లం . వాళ్ళు పిచ్చోళ్ళురోయ్ .రాళ్ళెసి కొడతారు అని చెప్పుకునేవాళ్లం . మొత్తంగ్రామంలో తాగుబోతులెవరంటే వేళ్లమీద లెక్కేసి పదిలోపే సంఖ్య చెప్పేవాళ్ళు . ఇక పండగపబ్బం సమయలలో కొద్దిమంది పెద్దలు ఏదో దొంగచాటుగా ఎక్కడో తాగి గప్ చుప్ న ఎవరికంటపడకుండా ఇంటికొచ్చి తొంగునేవాళ్ళు. ఇక ఎవడైనా సృతిమించి తాగితే అది లోపల ఇమడక కాబోలు బజార్లో వీరంగం వేస్తుంటే ఊరుఊరంతా అక్కడ తిరునాళ్లలా పోగై చెడతిట్టేవాళ్లు. చిన్నపిల్లలకు అదొక వినోదప్రదర్శన లాంటిది. ఇకపొద్దున్నే ఆతాగినవాడు జనమందరూ తననే చూస్తున్నారని గమనించి సిగ్గుతో చచ్చే వాడు . ఆతరువాత మేముహైస్కూల్ కొచ్చాక పుస్తకాలలో సప్తవ్యసనాలగూర్చి పాఠాలు చెబుతూ అయ్యవార్లు వాటిని అతి నికృష్ఠమైన అలవాట్లని జీవితాన్ని నాశనం చేస్తాయని చెబితే విని బయట ప్రభుత్వం దుకాణాలు పెట్టి పాకెట్లలో అమ్మేసారాయి షాపులు అక్కడ మందుబాబులచిందులు చూసి మాకు చెప్పిన పాఠాలు వీళ్లకెవరూ చెప్పలేదు కాబోలు ,చదువులేకుంటే అంతే అనుకునేవాళ్లం . సినిమాల్లోకూడా హీరోలు అలాతాగే విలన్లని భలే తన్నేవాళ్లు . కాబట్టి మేం పెద్దయ్యాక అటువంటి చెడుపనులు చేయకూడదని గాఠ్ఠిగా తీర్మానించుకునేవాళ్లం . మాచదువులతోపాటు తాగుబోతుల సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వస్తూనే ఉంది . ఐతే మాకు ఉద్యోగాలొచ్చాక ఓసమస్య ఒచ్చిపడింది .ఒరే! తాగుడు తప్పురా అని పిల్లలకు మొదటిరోజులలో చెప్పగలిగాం కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాం . ఎందుకంటే ఆపిల్లల ముందు పెద్దవాళ్లంతా తాగుతుండటం ,సినిమాల్లో కూడా ఈరో లు తాగిచిందెయ్యటం ,ఈరోయిన్లు వాల్లనే అభిమానించటం [.మరీఘోరంగా వెనుకటిసినిమాలలో హీరోయిన్లను ఏడిపించేవాడు విలనైతే ఇప్పుడేమో వాడె హీరో]
ఇవన్నీ చూసేదానికీ మేం చెప్పిందివిన్నదానికీ పొంతనకుదరక పిల్లలమనసులు గిజగిజలాడుతాయని . ,కాబట్టి అటువంటి పాఠాలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక ప్రభుత్వం వారుకూడా అటువంటి పాఠ్యాంశాలు లేకుండా చేశారు. కాకపోతే నైతిక విలువలు నేర్పండి ...నైతిక విలువలు నేర్పండి అని మాకు ట్రైనింగులలో చెబుతుంటారు. పోనీ నైతిక విలువలంటే రాముడు,సీత, ధర్మరాజు , శిబి, ఇలాంటివాళ్ల జీవితాలు చెప్పటమేమో నని ఆపనిచేస్తే చాదస్తుల్లావున్నారే అవి చెప్పకూడదు ? అవి ఒకమతానికి సంబంధించినవి అని తిడతారేమోనని భయం . [అలాఎందుకంటారనుకోకండి ఈమధ్యే వివేకానందుడి జీవితం పాఠ్యాంశంగా పెట్టాలనుకుంటే మా ఉపాధ్యాయసంఘాలే ఎదిరించాయి ,అలాంటివి పిల్లలకు చెప్పకూడదని .]
ఇక విషయం వదిలి దూరంగా పోతున్నాను. అసలు విషయానికొద్దాం .
నేను మాతాతగారు అమ్మవారి అనుగ్రహంతో స్థాపించిన పీఠాన్ని ఊరికిదూరంగా ఉన్న మాపొలంలో మందిరం నిర్మించి అక్కడకు తరలించడంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా నాకుటుంబ నివాసం ఒకరకంగా వనవాసం క్రిందలెక్క . కనుక నాకు ఊర్లో విషయాలు అంతగా తెలియవు . మొన్న ఒక పూజా కార్యక్రమానికి ఆడవాళ్లంతా వచ్చినప్పుడు ఆడవాళ్లంతా పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూన్నప్పుడు ఓమాట నా చెవినబడి నమ్మలేకపోయాను . ఏమిటంటే ఊరుమొత్తంలో "మందు తాగని వాళ్ళు మొత్తం ఆరుగురు" [ఊర్లో నే ఉండే మాతమ్ముడితో కలిపి] అని చెప్పుకుంటుంటే విని బిత్తరపోయాను . నా కు నలభైరెండు . ఇంత చిన్నకాలంలోనే వేల్లమీద లెక్కవేయగలిగిన తాగుబోతుల సంఖ్య తిరగబడి అది తాగనివాళ్ల సంఖ్యగా మారిందంటే ! ఇక అన్నిఊర్లూ కలిపి ఎంతమందుండొచ్చో ?
ఎంతశరవేగంగా మారిపోయింది పరిస్థితి ? ఔరా ! కలిపురుషుని మాయ .
ఒక్కసారి తాగితే వందజన్మల పుణ్యం కొట్టుకుపోతుందని శుక్రాచార్యుల వారిచ్చిన శాపం ఇంకెవడు పట్టించుకుంటాడు. ఖురాన్ లో ఓ కథ ఉంది . సైతాన్ ఓ మనిషికొక పరీక్ష పెట్టాడు. ఒకపసిపిల్లవాన్ని,యువతిని,మద్యాన్ని ముందుంచి ,పిల్లవాణ్ణి చంపుతావా ? యువతిని చెరుస్తావా ? మద్యం తాగుతావా ? వీటిలో ఏదో ఒక్కటి ఎంచుకుని చెయ్యాల్సిందే అని. అప్పుడతను అయ్యో పిళ్లవాణ్ని చంపటం,స్త్రీపై అత్యాచారం పాపం కనుక మద్యం మాత్రమే తాగుతాడు. ఆతరువాత మత్తులో పిళ్లవాణ్ణిచంపి,ఆస్త్రీని పాడుచేసి పతనమవుతాడు .
మరి ఈలెక్కన మందేసుకుని పరిపాలనచేసే మంత్రులు,అధికారులు ,ప్రజలతో ఈసమాజ భవిష్యచిత్రం ఎంతఘోరంగా ఉండబోతుందో ! ? .తాగితాగి శరీరాలు కృషించి నశించే యువత ఈదేశాన్ని రక్షంచటం మాటదేవుడెరుగు పెనుభారం అవుతారుకదా ? తాగినమత్తులో,అలవాటుపడిన పిచ్చిలో ఎన్ని ఘాతుకాలకు తెగబడి అల్లకల్లోలం సృష్టిస్తారో తలచుకుంటేనే భయం.
మీరు మరీనూ ! ఏదో సరదాగా తాగితే ఇన్ని జరుగుతాయా అని మీరు ఎగతాళి చేయవచ్చు. ఇప్పుడొకమాటడుగుతాను ఆలోచించండి . మాదకద్రవ్యాలు పెరిగి పోతున్నాయి ,అని గగ్గోలుపెడుతున్నవాళ్ళు అవి కూడా సరదాకి వేసుకునేవే అనుకోగలరా ? మద్యానికి వాటికీ పెద్దతేడా ఏముంది ? వాటి గాఢత ఎక్కువవటం వలన త్వరగా చస్తాడు ,మద్యంతో కొద్దినాళ్లాగి శరీరం శక్తిని కోల్పోతుంది అంతే తేడా . శక్తి హీనులచే నిర్ణయించబడే శాశనాలు,పరిపాలన ఖచ్చితంగా దౌర్భాగ్యకరంగనే ఉంటాయి . అవి మనకిప్పుడు బయట కనపడుతున్నాయి రేపు మనయింటిలో కొచ్చినప్పుడు నోటితో తాగినవన్నీ కళ్లనుంచి బయటకొచ్చే రోజులొస్తాయి .
అయినా ఏమీ చేయలేం మనం . కలిపురుషుని కరాళ నృత్యం సాగుతుంది . అడుగులు భగవంతునివైపుపడితే భవిష్యత్తు బంగారమవుతుంది లేదంటే భయంకర మైపోతుంది . ఈ యుగానికి ఉన్న రెండే దారులివి.
3 వ్యాఖ్యలు:
guruvu garu,
meru cheppindi ..kaadu analeni vaastavam.
-----
ippudu taagani vaadini oka vinta jantuvuga chuse paristithi vachindi maa IT fieldlo.
migataavi kuda inchu minchu alane vundochu anukuntunnaanu.
---
mee vyktee karana chaalaa baagundi.
Regards
Ramana
మంచి వ్యాసం. పైన రమణగారు అన్నట్లు ఇది కాదనలేని వ్యాసం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి మద్యపు అమ్మకాలపై ఆధారపడుందన్నది ఒక చేదు నిజం.
పల్లెటూళ్ళల్లోనేకాదు, ఉన్నత విద్యనభ్యసించినవారిలో కూడ తాగేవారి శాతం పెరిగిపోయింది. శుక్రవారంరాత్రి తాగనివాడు (నాలాంటివాడు) నేను చూసిన పెక్కు సాఫ్ట్వేరు సహోద్యోగులలో వెధవ.
గుజరాత్ లో మద్య నిషేధం అమలు లో ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా గుజరాత్ ని అనుసరించ వచ్చు.మనసుంటే మార్గముంటుంది.
Post a Comment