శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నరకానికి పంపే గుణాలు

>> Friday, April 1, 2011


ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్ప సద్గుణం. కానీ చేసిన వాగ్దానాన్ని భంగపరచడాన్ని పెద్ద విషయంగానే పట్టించుకోరు ప్రజలకి ఇది అలవాటు అయిపోయింది. వాస్తవానికి వాగ్దానాన్ని నిలుపుకోకపోవడం, దాన్ని భంగపరచడం పెద్ద తప్పు.
కొంతమంది కొన్ని విషయాలను అసలు తప్పుగా, పాపాలుగా, నష్టదాయకమైనవిగా భావించరు. ఎందుకంటే అవి చూడడానికి చాలా చిన్న, సామాన్య విషయాల్లాగానే కనిపిస్తాయి. కాని పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ (స) చిన్న చిన్న తప్పిదాల నుంచి కూడా సురక్షితంగా ఉండాలని ఉపదేశించారు. ఉదాహరణకు అబద్దం. దీన్ని చాలామంది అసలు తప్పుగానే భావించరు.

చిన్న చిన్న విషయాలకు చాలా తేలిగ్గా అబద్దాలాడేస్తుంటారు. ఒకసారి అబద్దం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా దాన్ని సమర్థించుకోవడానికి అనేక అబద్దాలకు పాల్పడవలసి ఉంటుంది. అందుకే అబద్దం మనిషిని నరకానికి తీసుకుపోతుందని ముహమ్మద్ ప్రవక్త (స) తీవ్రంగా హెచ్చరించారు. అబద్దాల కోరు పరలోకంలో మాత్రమే కాదు, ఇహలోకంలో కూడా తీవ్ర పరాభవాన్ని చవిచూస్తారు. అబద్దాలు మాట్లాడేవారిని ఎవరూ ఒక పట్టాన నమ్మరు. బయటివారే కాదు, బంధుమిత్రులు కూడా దగ్గరికి చేరనివ్వరు. అందుకని అబద్దమనే దురలవాటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్దం చెప్పకుండా జాగ్రత్తపడాలి.

ఇవేం మాటలు?
ఈకాలంలో సర్వసాధారణం అయిపోయిన మరో తప్పిదం బూతులు పలకడం. మంచి అయినా చెడు అయినా రెంటికీ దీని వాడకం పరిపాటి అయిపోయింది. సినిమాల్లోనే కాదు మామూలు వ్యవహారికంలో కూడా అలవోకగా బూతులు మాట్లాడేస్తుంటారు. ఇది అశ్లీలం అన్న స్పృహ చాలామందికి ఉండడం లేదు. ఆగ్రహంలోనూ, ఆనందంలోనూ అశ్లీలమే అగ్రస్థానం అలంకరిస్తోంది. నిజానికి నోరు అద్భుతమైన వరం. మానవ సంబంధాల వారధి.

నోరు విప్పితే మాటల ముత్యాలు రాలాలి. అవి పరులకు మేలు చేయాలి. అంతేగాని ఎదుటివారి మనసుల్లో శూలాల్లా గుచ్చుకోకూడదు. ఎవరి హృదయాలనూ గాయపరచకూడదు. బూతులు మాట్లాడటం వల్ల గానీ, ఇతరుల మనసు నొప్పించడం వల్ల గానీ కొంతమందికి తాత్కాలిక ఆనందం కలిగితే కలగవచ్చేమోగానీ, దాని పర్యవసానం మాత్రం తీరిగ్గా అనుభవించాల్సి ఉంటుంది. ఇహలోక పరాభవంతో పాటు, పరలోక వైఫల్యాన్నీ మూటగట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి అశ్లీలం దొర్లకుండా నోటిని పవిత్రంగా ఉంచుకోవాలి. పరుల మనసు గాయపడకుండా ఉండేందుకు మన హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి.

ఆశపెట్టి తీర్చకపోతే...
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్ప సద్గుణం. కానీ చేసిన వాగ్దానాన్ని భంగపరచడాన్ని పెద్ద విషయంగానే పట్టించుకోరు ప్రజలకి ఇది అలవాటు అయిపోయింది. వాస్తవానికి వాగ్దానాన్ని నిలుపుకోకపోవడం, దాన్ని భంగపరచడం పెద్ద తప్పు. చాలామంది వెనుకా ముందూ చూసుకోకుండా, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వాగ్దానాలు చేసేస్తుంటారు. ఈ విషయంలో మన రాజకీయ నాయకులను మించినవారు ఎవరూ ఉండరు.

ఒక విషయంపై ఇతరులకు ఆశలు కల్పించడం కూడా పాపమే అన్న విషయం వీరికి తెలియదు. మీ వాగ్దానంపై నమ్మకంతో అవతలి వ్యక్తి మరొకరికి మాటిచ్చి ఉండవచ్చు. లేక అతనికి వేరే ఏవైనా అవసరాలు ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు ఈ వాగ్దానం పూర్తిచేయకపోతే ఆ వ్యక్తి ఇబ్బందుల పాలు కావచ్చు. అతని పరువు పోవచ్చు. చిన్నపాటి నష్టంతో పాటు పెద్ద నష్టం వరకు ఏమైనా జరగవచ్చు. అందుకని వాగ్దాన పాలన చాలా అవసరం. వాగ్దానాల విషయమై దైవం ప్రశ్నిస్తాడు. శిక్షిస్తాడు. కాబట్టి చిన్నచిన్న విషయాలే కదాఅని నిర్లక్ష్యం చేయకుండా స్వయం శ్రేయస్సుతో పాటు, ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనుగడ సాగిస్తే ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందవచ్చు.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP