ఇదేం గురుదక్షిణ?
>> Wednesday, March 30, 2011
గురుదక్షిణగా ఏకలవ్యుడి బొటనవేలును అడిగి తీసుకున్న ద్రోణుణ్ణి, ఇచ్చిన ఏకలవ్యుణ్ణి ఏమనాలి?
- జి. పాండు, నల్లగొండ
ఏమనడానికైనా ఎవరి కారణాలు వారికుంటాయి. ఒకసారి మహాభారత ఇతిహాసాన్ని చూద్దాం. హిరణ్యధన్వుడు అనే కోయదొర కుమారుడే ఏకలవ్యుడు. ద్రోణుడు కౌరవులు, పాండవులు, వృష్ణి వంశీయులైన యాదవులు, కర్ణుడు, తన విరోధి ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు మొదలైన వారికి అస్త్రవిద్యలు నేర్పుతున్నప్పుడు ఏకలవ్యుడు అక్కడకు వచ్చి తనను కూడా శిష్యుడిగా స్వీకరించి అస్త్రవిద్యలు నేర్పమన్నాడు.
ద్రోణుడు ముందుచూపుతో అతడి అభ్యర్థనను తోసిపుచ్చి పంపేశాడు. ఒక లక్ష్యం ఉన్నవాడు కాబట్టి ఏకలవ్యుడు నిరాశపడలేదు. తండాలో తన గుడిసె ముందే ద్రోణాచార్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆయన్ని గురువుగా ఆరాధిస్తూ విలువిద్యను స్వయంకృషితో నేర్చుకున్నాడు. మంచి విలుకాడయ్యాడు. ఒకరోజు వేటలో తన ఏకాగ్రతను భంగపరుస్తున్న ఒక కుక్కనోటిలో ఏడు బాణాల్ని నాటి దానికి ప్రాణాపాయం లేకుండా విడిచిపెట్టాడు. అది పాండవుల వేటకుక్క కావడంతో ఏకలవ్యుడి విషయం ద్రోణుడికి తెలిసింది.
తాను ప్రపంచంలోకల్లా ఉత్తమ విలుకాడుగా చెయ్యాలనుకున్న తన ప్రియశిష్యుడు అర్జునుణ్ణి తీసుకుని అడవిలో ఉన్న ఏకలవ్యుడి దగ్గరకు వస్తాడు ద్రోణుడు. అతని చేత పూజింపబడి అతడి బొటనవేలును గురుదక్షిణగా అడిగి తీసుకుని విలువిద్యలో అతడిని నిర్వీర్యుడిని చేస్తాడు. ఏకలవ్య చరిత్ర చూస్తేగాని త్రికాలజ్ఞుడైన ద్రోణుడు ఆ విధంగా ఎందుకు చేశాడో మనకు అర్థం కాదు. ఏకలవ్యుడు మహా విలుకాడు.
భవిష్యత్తులో అర్జునుడినే అంతమొందించగలవాడు. అతడు శ్రీకృష్ణుని విరోధి అయిన జరాసంధునితో స్నేహం చేస్తాడు. కృష్ణ జరాసంధ యుద్ధంలో తాను, తన పరివారంతో పాల్గొని దుష్టుల బలాన్ని పెంచుతాడు. ఇలాంటి చీడను మొదటే తీసివేస్తే సమాజానికి మేలే జరుగుతుందని ద్రోణుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏకలవ్యుడు తన పరోక్ష ఉత్తమ శిష్యుడైనా అతని అంగీకారంతో గురుదక్షిణను స్వీకరించాడు. ప్రపంచంలో ఏకలవ్యుని సాటి ఎవరూ లేరు. అతడు విద్యార్థి లోకానికి ధృవతార.
-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ
0 వ్యాఖ్యలు:
Post a Comment