శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జయమంత్రం ఎవరు చదవాలి?

>> Friday, April 1, 2011


జయమంత్రం అంటే ఏమిటి. దాని అర్థం ఏమిటి? దాన్ని ఎవరు పఠించాలి?
- యస్.వి. రంగబాబు, కొత్తూరు, నెల్లూరు జిల్లా

సీతాన్వేషణకై లంకకు వెళ్లిన హనుమంతుని ఎనభైవేల మంది రాక్షసులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు హనుమ ఉద్ఘోషించినదే 'జయమంత్రం'. ఇది శ్రీవాల్మీకి రామాయణం సుందరకాండలో 42వ సర్గలో ఉంది. ఈ కింది నాలుగు శ్లోకాలనే జయమంత్రం అంటారు.

జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః
నవరావణ సహస్రంమే యుద్ధే ప్రతిఫలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్దయిత్వాపురీం లంకాం అభివాద్యచమైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం
ఈ శ్లోకాల అర్థం ఇది. అధిక బలుడగు రాముడు, మహాబలుడగు లక్ష్మణుడు అతిశయంతో వర్ధిల్లుచున్నారు. రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడు జయము కలిగి ఒప్పుచున్నాడు. నేను కోసలేంద్రుడగు రాముని దాసుడను. శత్రుసైన్యమును చంపువాడను. వాయుపుత్రుడను, వేయి మంది రావణులు వచ్చినా యుద్ధంలో నన్నెదిరించి నిలువలేరు. శిలలతో వృక్షాలతో మాత్రమే నేను కొట్టెదను.

లంకాపురిని మర్దించి మైథిలికి నమస్కరించి, సాధింపవలసిన కార్యాన్ని సాధించి రాక్షసులందరు చూస్తుండగానే వెళ్లెదను. ఇది హనుమ రాక్షసులపై విజయానికి ఉపయోగించిన జయమంత్రం. ఈ మంత్రాన్ని అనుసంధిస్తే మనకు కూడా విరోధులు తొలగి విజయం చేకూరుతుంది. ఈ జయమంత్రంలోనే మొదటిసారిగా హనుమ తనను దాసునిగా పేర్కొన్నాడు. సీతమ్మను చూసిన తరువాతే హనుమకు స్వస్వరూపం తెలిసింది. ఆత్మలకు సహజ స్వరూపం భగవద్దాస్యమే.
రామాయణ పారాయణం చేసేటప్పుడు ఈ జయమంత్రాన్నే సంపుటీకరణ శ్లోకాలుగా అనుసంధిస్తారు. అంటే పారాయణం ముందు వెనుక ఈ నాలుగు శ్లోకాలు చదివితే 'సంపుటీకరణం' చేసిన ఫలం ఉంటుంది.
-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

1 వ్యాఖ్యలు:

సత్య April 1, 2011 at 10:13 AM  

విలువైన విషయ సేకరణ!..ధన్యవాదాలు!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP