శాస్త్రం... ఒక శేషవస్త్రం
>> Wednesday, February 23, 2011
- చక్కిలం విజయలక్ష్మి శాస్త్రం సదా వందనీయం. శిరోధార్యం. శాస్త్రం చీకట్లో కరదీపికలాంటిది. ముళ్లదారిలో పాదరక్షల్లాంటిది. కొత్తదారిలో మార్గసూచికలాంటిది. శాస్త్రం రాచబాటలాంటిది. శాస్త్రాన్ని అనుసరిస్తే ఏ గమ్యానికైనా ముళ్లు ఏరుకుంటూ, దారి వెదుక్కుంటూ పోవలసిన అవసరం లేదు. మన సాధనలో ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో సగం పని అది చేసిపెడుతుంది. శాస్త్రం ఒక మతానికో, దేశానికో, కాలానికో సంబంధించినది కాదు. అది సార్వకాలికం. సదా అనుసరణీయం. అది మనను ప్రేమించే తల్లిలాంటిది. అన్నం పెట్టే అమ్మలాంటిది. క్రమశిక్షణ నేర్పే తండ్రిలాంటిది. నీకు నేనున్నాననే సోదరునిలాంటిది. మనసు పంచుకునే మిత్రునిలాంటిది. మనకు జలాశయాల్లో నీళ్లు దొరుకుతాయి. చెట్లనుంచి గాలి వీస్తుంది. అగ్ని రాజేస్తే వేడి పుడుతుంది. ఇలాగే దేనికి సంబంధించిన మూలవస్తువు దాన్నే మనకు అందిస్తుంది. కానీ శాస్త్రం ఇవ్వని జ్ఞానం లేదు. శాస్త్రం తీర్చని సమస్య లేదు. శాస్త్రం చెప్పని ధైర్యం లేదు. అది కల్పతరువు, కామధేనువు. మన ఒక్కరి జీవితంలోని అనుభవాలు మనకు పూర్తి పాఠాలు చెప్పలేవు. చెప్పిన పాఠమైనా ఆ పాఠం గ్రహించేలోపల ఆ అనుభవం తాలూకు ఆపదా, దాని అవసరమూ తీరిపోయి ఉంటాయి. శాస్త్రం ఎన్నో వేలూ లక్షల మంది అనుభవసారం! మంచి చెడుల విశ్లేషణల రసం! జ్ఞానభండారం! సౌరభ మందారం. మనం దానివైపు చూడటం లేదు. అసలు ప్రతి విషయంలో అలాంటిదొకటుందనే స్పృహే మనకు లేదు. ఎంత దౌర్భాగ్యం! ఆధునిక శాస్త్రాలు భౌతిక పరిశోధనాలయాల్లో గాజు నాళికల్లో పరీక్షల తరవాత నిర్ధారితమైన సూత్రాలు. ఎప్పటికప్పుడు అవి మారే అవకాశాలున్నాయి. ప్రాచీన రుషులు మనకందించిన శాస్త్రాలు వారి మేధస్సులోంచీ, మనోమథనంలోంచీ, వారి తపోభూమికలోంచీ ఉద్భవించిన సారభూతాలు. నిష్కామకర్మిష్ఠుల అనుభవసారాలు. వాటికి తిరుగు లేదు. మార్పు ఉండదు. గురువైనా శాస్త్రాన్ని బోధించవలసిందే. సత్య దర్శనం ఎలా చేయాలనేదే కాదు. ఎలాంటివారు గురువు స్థానానికి అర్హుడనే కీలకాంశాన్నీ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అదృష్టవశాత్తు భారతీయులకు శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. స్వీకరించగలిగితే ప్రపంచ మానవాళికందరికీ. దురదృష్టవశాత్తూ మనమే మన శాస్త్రనిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మీదుమిక్కిలి ధ్వంసం చేస్తున్నాం. అమృతమైనా ఉపయోగించుకుంటేనే మేలు చేస్తుంది. మనం విషప్రాయమైన సంస్కృతులవైపు పరుగులు తీస్తున్నాం. ఎండమావులకు ఆకర్షితులమై ఒడిలోని అమృతకలశాన్ని ఒలకబోసుకుంటున్నాం. ఏమిటీ దౌర్భాగ్యం! నిన్న మొన్న కళ్లు తెరిచిన చిన్ని చిన్ని దేశాలు కూడా తమ సంస్కృతిపట్ల గౌరవాన్ని కలిగిఉన్నాయి. నిలబెట్టుకోవాలనే తపన కలిగిఉన్నాయి. ఆచరించాలనే ఆరాటంతో మెలగుతున్నాయి. అత్యున్నతమైన సుసంస్కృతిని, ఉదాత్తమైన సంస్కారాన్ని, అమూల్యమైన జ్ఞానభాండారాన్ని కలిగి ఉండీ మనం- తన బలం తనకు తెలీని హనుమంతునిలా ప్రవర్తిస్తున్నాం. చాలా ఏళ్లు నిద్రపోయాం. ఇక చాలు. మేలుకోవాలి. మన బలం మనం తెలుసుకోవాలి. మన సత్తా మనం గ్రహించాలి. నిజానికి మనం మారవలసిందేమీ లేదు. మనమెవరమో, మన ఆభిజాత్యమేమిటో గుర్తుచేసుకుంటే చాలు. రాముడెవరంటే 'ఫలానా నటుడు' అనే సామాజిక స్థాయి నుంచి 'రామో విగ్రహవాన్ ధర్మః' అనే సాకేత స్థాయికి ఎదగగలిగితే- భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాల సహజ వారసత్వాన్ని కొంతవరకైనా అందించినవారమవుతాం. లేకపోతే వారిముందు దోషులుగా నిలబడవలసి వస్తుంది. |
0 వ్యాఖ్యలు:
Post a Comment