కృష్ణ తత్వం
>> Wednesday, August 24, 2011
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనలనే త్రిపుటి కృష్ణావతార పరమార్ధం. ఈ ఉద్యమానికి శ్రీకృష్ణుడు విశ్వరథ సారథ్యం వహించాడు. ఆయనలో ఒకపక్క మానవత్వం తొణికిసలాడగా, మరోపక్క దివ్యత్వం ప్రకాశించింది. శ్రీకృష్ణుడు అవ్యక్తధర్మానికి వ్యక్తరూపం. అతడికి ఎవరితోనూ ఘర్షణ లేదు. ఘర్షణ పడినవాళ్లు కూడా తమ దుష్టత్వం వల్లనే విభేదించారు తప్ప కారణం ఉండికాదు. ధృతరాష్ట్రుడు దుష్టుడైనా కృష్ణుడి హితవాక్కు అనుసరించలేకపోవడం జరిగిందిగాని, ఘర్షణ పడలేదు. దుర్యోధనుడు కూడా రాయబార ఘట్టాల్లో పాండవులను నిందించినా కృష్ణుణ్ని నిందించడం చేతకాలేదు. అతడు పాండవులకు ఎంత హితుడో తమకూ అంత హితుడేనని వారికి తెలుసు. ఈ సత్యాన్ని భరించగల హృదయ వైశాల్యం వారికి లేకపోయింది. కృష్ణుడి జీవితంలో ఇతరులకు అతడి నిమిత్తంగా సన్నివేశాలు ఉన్నాయిగానీ అతడికి సంబంధించిన సన్నివేశాలు చాలా అరుదు. చివరకు యాదవ వినాశనంగాని, తన కాలికి తగిలిన బాణంగాని అతడి మనసును తాకిన సన్నివేశాలు కాలేకపోయాయి. అతడి జీవితంలోని సుఖదుఃఖాలకు సంబంధించిన సందర్భాలేవీ అతడి మనసును తాకలేకపోవడం మానవాతీతమైన లీల. కృష్ణుడి జీవితంలో తనకోసం ఆచరించిన ధర్మమూ కనిపించదు. తమ స్వధర్మాన్ని లోకహితంగా ఆచరించడానికి సంకల్పించినవారు సాధువులు. స్వధర్మాన్ని స్వార్థానికి వినియోగించుకునేవారు దుష్కృతులు. సాధువులకు రక్షణ ఇచ్చేందుకు, దుష్కృతులను శిక్షించేందుకు అన్ని కాలాల్లో దిగివస్తూనే ఉంటానని కృష్ణుడు చెప్పాడు. కృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది. కృష్ణతత్వాన్ని పరిశీలించడం అంటే- సముద్రం లోతును తెలుసుకునే ప్రయత్నం చేయడమే. మహాభారతం కృష్ణుని పరంగా ఒక దర్శనం. భారతంలో ఇమడ్చటానికి అవకాశం లేక పోయిన కృష్ణుని లీలామయ జీవితాన్ని వ్యాసుడు భాగవతంలో కీర్తించాడు. ఆయన బోధించిన జీవనతత్వాన్ని భగవద్గీతలో వివరించాడు. భారతీయుల ఆధ్యాత్మిక, లౌకిక ఆకాంక్షలకు ఆ మహాపురుషుని జీవితంలో సమాధానాలు లభిస్తాయి. |
|
|
1 వ్యాఖ్యలు:
మంచి విషయం. సర్వకాల సర్వావ్యవస్తలలోను..వసుదేవసుత మార్గం.. సదా ఆచరణీయం.ఆయన తత్వమే..ఆనందకారం. చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
Post a Comment