శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జీవితాన్ని జీవించాలి!

>> Tuesday, February 22, 2011


- తటవర్తి రామచంద్రరావు
నుషులు మూడు రకాలు. ఒకరకం దేనికీ సంతృప్తిపడని వాళ్ళు. అహంకారులు. వారి కోరికలు అనంతం. అసహనం ఎక్కువ. తాము సుఖపడలేరు. ఇతరుల్ని సుఖపెట్టలేరు. రెండోరకంవారు, లభ్యమైనదానితో సరిపెట్టుకుంటారు. తమకంతే రాసిపెట్టి ఉందని సమాధానపడిపోతుంటారు. తృప్తికి, సర్దుబాటుకు తేడా తెలియని వ్యక్తులు. ఇక మూడోరకం- వీళ్ళిద్దరిలా అటూఇటూ వూగిసలాడరు. నిత్యాన్వేషకులు. చైతన్యవంతులు. తమకానందించటం తెలుసు. ఇతరుల్ని ఆనందపెట్టడమూ తెలుసు.

ఒకరోజున ఒక చెరువులో చేపలు పట్టడానికి ఆ మూడు రకాల వాళ్ళు వెళ్ళారు. మొదటివాడు చేపలు దొరకలేదని చిరాకుపడ్డాడు. గాలాన్ని, తాడును, ఎరను, తన పనిముట్లను తిట్టాడు. తన జాతకాన్ని తప్పుపట్టాడు. బుర్రనిండా అస్తవ్యస్తమైన ఆలోచనలతో గింజుకున్నాడు. పోనీ తోటివాళ్ళకు దొరకనట్లే తనకీ చేపలు దొరకలేదేమో అని సమాధానపడలేదు. ఇతరులకు దొరికిపోతాయేమోనని హైరానాపడిపోయాడు. తనకు దొరక్కపోతేపోయె... వాళ్ళక్కూడా దొరక్కూడదని అనుకున్నాడు అహంభావి అసహనమూర్తి. అశాంతికి మారురూపమతడు.

రెండోరకం వాడికికూడ రోజంతా చేపలు దొరకలేదు. కాలక్షేపానికి పుస్తకాలు చదివాడు. మధ్యమధ్య తెచ్చుకున్నది తిన్నాడు, తాగాడు. ఆఖరికి తనకారోజు చేపలు దొరికే ప్రాప్తంలేదని నిట్టూర్చి ఇంటిముఖం పట్టాడు. తనకిలా రాసిపెట్టివుందని రాజీపడిపోయాడు.

ఇంక మూడోవాడు జ్ఞాని. అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాడు. చేపల వేట పనిలో ఉన్న భగవత్ప్రసాదితమైన సృష్టిలోని అందాలన్నీ ఆస్వాదించసాగాడు. తనముఖంపైకి నీటిమీదనుంచి వచ్చే చల్లనిగాలులకు పరవశించాడు. గాలివీచే దిశగా నావను నడిపాడు. తనను నావలో ఒక భాగంగా చేసుకొని సాగిపోయాడు. గాలికి కదిలివచ్చే కెరటాల మీద నావ సాగుతుంటే- అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు. తన తలపై పక్షి ఎగిరి వెడుతూంటే తానూ మానసికంగా ఒక పక్షిలా ఎగిరాడు. నీటిలో మిలమిల కదిలే చేపల్ని కుతూహలంగా తిలకించాడు. ఇనుము అయస్కాంతంవైపు తరలివచ్చేటట్లు ఏదో ఒక చేప చిక్కకపోదన్న నమ్మకంతో గాలాన్ని ఒడుపుగా పట్టుకున్నాడు. అతని గాలానికున్న సన్నని తాడులాగానే ఏకాగ్రతతో నిరీక్షించాడు.

ఇంటికి వెళ్ళిన ముగ్గురూ మూడు రకాలుగా ప్రవర్తించారు. మొదటివాడు తనకు చేపలు దొరకలేదని ఎదురువచ్చిన పెంపుడు కుక్కను తన్నాడు. పిల్లల్ని అనవసరంగా కొట్టాడు. భార్యను వంకలుపెట్టి తిట్టాడు. తన ఇంటిని చేజేతులా నరకం చేసుకున్నాడు. ఇలాంటివాడికి ఎదురుపడాలంటేనే అంతా భయపడతారు.

రెండోవాడు నిద్రపోయాడు. నావలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడో అక్కడా స్తబ్ధుగా ఉండిపోయాడు. అతను తనకూ ఉపయోగించడు. ఇతరులకీ ఉపయోగించడు. ఇక మూడోవాడు- చేపలు దొరికినా దొరక్కపోయినా విజేత. నావలో ఉన్నా ఇంట్లో ఉన్నా అతని ప్రతి కదలికలోనూ చైతన్యమే. మనసు నిత్య ఆనందమయం. ఇంటా బయటా సుఖజీవనం ఇతని సొత్తు.

ఈ సామ్యాలు చేపలు పట్టడానికి వెళ్ళినవాళ్ళకే కాదు. జీవితంలో ఏది సాధించాలనుకున్న వాళ్ళకైనా అన్వయిస్తాయి. ఎవరి జీవన విధానాన్ని మలచుకునే శక్తియుక్తులు వారిచేతుల్లో ఉంటాయి. మొదటిరకం అసంతృప్తిగా బతికితే, రెండోరకం అసంపూర్తిగా బతుకుతారు. మూడోరకం మాత్రం పరిపూర్ణంగా జీవిస్తుంటారు.


1 వ్యాఖ్యలు:

Anonymous February 22, 2011 at 10:01 PM  

Chaalaa baagundandee mere cheppina maatalu , jeevithamu lo edi mukhyamo chappe cheppakane kanuvippu kaliginchaaru. Idi chadivi chaalaa prabhavithulamayyaamu. Thank you ! Hopefully mmodorakam manishigaa brathakaalani korukuntooo selav

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP