శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సత్యమార్గంలో సాహసం

>> Saturday, February 26, 2011


- కె.యజ్ఞన్న
త్వవేత్తలు లోకాతీతమైన సత్యాల గురించి ఆలోచిస్తుంటారు. శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచంలోని వాస్తవాలను పరిశోధిస్తారు. తత్వవేత్తలు మానస పుస్తకం చదివితే, శాస్త్రవేత్తలు ప్రకృతి పుస్తకం చదువుతారు. తత్వవేత్తలు లోపలి పుస్తకం చదువుతారు కాబట్టి, వారు భౌతిక సత్యాలు పట్టించుకోరు. శాస్త్రవేత్తలు బాహ్య పుస్తకం చదువుతారు కాబట్టి, వారికి లోపలి సత్యాలు అవసరం లేదు.

'నేను మత నియమాలు పాటించి, మతం చెప్పే సత్యం సిద్ధింపజేసుకోవాలనుకున్నాను. కాని నాకు అది అందలేదు. ఇప్పుడు నేను సత్యాన్ని నమ్మలేని స్థితికి వచ్చాను' అని సాధారణంగా ప్రతి వ్యక్తీ అనుకుంటాడు. 'నేను మతం చెప్పే సూత్రాల ప్రకారం జీవించాను. అందులో నాకేమీ కనిపించలేదు' అనేవారు కోకొల్లలు. ఒక గొప్ప శాస్త్రవేత్త వద్దకు ఒక సాధారణ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి శాస్త్రజ్ఞుడితో 'నాకు సైన్సులో నమ్మకం లేదు. అందులో ఏమీ లేదు. జీవితమంతా ప్రయత్నించాను. కాని నేను శాస్త్రవేత్త కాలేకపోయాను' అన్నాడు. అప్పుడా శాస్త్రవేత్త 'నువ్వు ప్రయత్నించానన్నావు. ఏం చేశావు?' అని అడిగాడు. 'నేను రాత్రివేళ- ఓ విజ్ఞానశాస్త్రమా! నా వద్దకురా అని ఎన్నోసార్లు అడిగాను. కాని అది నా వద్దకు రాలేదు' అని సామాన్య వ్యక్తి అన్నాడు. అప్పుడా శాస్త్రవేత్త నవ్వి 'అది సరియైున పద్ధతి కాదు. నువ్వెందుకు ఆ గ్రంథాలు చదవలేదు? ప్రయోగశాలకు వెళ్లి ఏమైనా ప్రయోగాలు చేశావా? అప్పుడే నీకు సైన్సు తెలుస్తుంది' అన్నాడు.

ఆధ్యాత్మిక జ్ఞానసంపాదనలోనూ మనం చేసే పొరపాటు అదే.

తత్వ పరిశోధనలో సైతం శ్రమించాలి. సాధన చెయ్యాలి. మానసక్షేత్రంలో ప్రయోగాలు చెయ్యాలి. రాత్రివేళ లేదా పొద్దున్నే లేచి కాస్సేపు ధ్యానం చేసి 'ఓ సత్యమా! నా వద్దకు రా' అని పదేపదే మంత్రాలు చదివితే అది రాదు. మనం ఉన్న స్థితిలోనే ఉంటాం. ఇప్పుడు ఉన్నది అదే స్థితిలో. భౌతిక సత్యాల ఆవిష్కరణకు ఎన్నో త్యాగాలు చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక అన్వేషణలో ఎన్ని త్యాగాలు చెయ్యవలసి వస్తుందో! 'ఎందుకీ శ్రమ?' అనే ప్రశ్నకు శాస్త్రవేత్తకాని, తత్వవేత్తకానీ జవాబివ్వడు. జవాబివ్వలేడు. ఒకవేళ ఆ శ్రమ లేకపోతే మనమింకా కొండ గుహల్లో ఆదిమానవుల్లాగా జీవిస్తుండేవాళ్లం. మనలో ఎవ్వడో ఒకడు మానవజాతి సుఖసంతోషాలకోసం (భౌతికమైన, ఆధ్యాత్మికమైన) ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పరిపూర్ణత్వంకోసం, సత్యంకోసం, నిజమైన ఆనందం కోసం పరిగెడుతూనే ఉన్నాడు. అవి దొరికేవరకు ఈ పరుగు ఆగదు. ఏమో! భౌతికమైన విజ్ఞానశాస్త్రం గీసిన సరిహద్దురేఖలు సైతం దాటిపోయి మానవజాతి ఆనందమయ కాంతిలోకంలో అడుగుపెట్టగలదేమో!

చాలామంది- ప్రాచీన ప్రవక్తల మాటలకు, ఆ యుగాల బృహత్‌గ్రంథాలకు బూజు పట్టిందని, ఆధునిక సమాజానికి పనికిరావని భావిస్తున్నారు. ఔను, వాటిని అధిగమించి మానవజాతిని మహోన్నత శిఖరాలకు తీసుకునివెళ్లాలి. నిజమే కాని, అక్కడికి వెళ్లే మార్గాలు ఆ ప్రవక్తల ప్రవచనాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయన్న సంగతి మరచిపోరాదు.

నదిని దాటడానికి పడవ ఉపయోగిస్తాం. నదిని దాటిన పిమ్మట పడవను మోసుకుని ఊళ్లోకి ఎవ్వరూ వెళ్లరు. అలాగే ప్రాచీన మంత్ర సంహితలు సత్యధామం వరకు మనల్ని తీసుకుని వెళ్తాయి. సత్యాన్ని చూడవలసింది మనం... అవి కావు. సహనం, విశ్వాసం, సాధనతోపాటు సాహసం కూడా కావాలి.

ప్రాచీన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు సాహసంతో ముందడుగు వేశారు కాబట్టే- మనకు ఇంతటి మహనీయ ప్రపంచం లభించింది. సాంకేతిక పురోగతితోపాటు నైతిక, ఆధ్యాత్మిక పరివర్తనం జరిగినప్పుడే మనిషికి నిజమైన శాంతి లభిస్తుంది. భౌతికమైన గట్టి పునాదులపైనే ఆధ్యాత్మిక స్వర్గం చెక్కుచెదరకుండా భాసిస్తుంది. దానికోసం నిరీక్షించడం కాదు... ఎవరికి వారు కొద్దిగానైనా ప్రయత్నిస్తే ఆ అమృతక్షణం త్వరలోనే రావచ్చు.


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP