పూజతో పాటు ధ్యానం చేయాలా?
>> Saturday, February 19, 2011
రోజూ పూజ చేస్తున్నాం గదా! ధ్యానం కూడా చేయ్యాలా?
- కె. శివరామగురులింగాచారి, మార్కాపురం
ఇది మంచి ప్రశ్న. ధ్యానాన్ని అర్చనలో అంతర్భాగంగా చేసుకోగలిగితే, అప్పుడు ధ్యానానికి ప్రత్యేక సమయాన్ని పెట్టుకోవలసిన పనిలేదు. కాని ఇప్పుడు ధ్యానం (మెడిటేషన్) ఒక ప్రశాంతతనిచ్చే ప్రక్రియగా, ఒక ఆధునిక వ్యాయామంగా ఒక ఆరోగ్యప్రక్రియగా, ఖ్యాతి, లాభ పూజలనిచ్చే ఒక చిట్కాగా అత్యంత ఆధునిక జీవనంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎలా చెలామణి అయినా మొత్తానికి ధ్యానం ఒక 'వాణిజ్య వస్తువు' అయింది. పరమార్థకృషిలో అంతర్యామి ఉపాసనం చేసే సాధకుడికి ధ్యానయోగం ఒక అభ్యాసంగా విధించబడింది.
ఈ ధ్యాన యోగాన్ని భ్రమర కీట న్యాయంతో పోలుస్తారు. ఒక వస్తువును గూర్చి తదేక నిష్ఠతో ధ్యానించేటప్పుడు ధ్యాత(ధ్యానించే వాని)చిత్తం ధ్యేయ(ధ్యానించే వస్తువు) ఆకారంగా పరిణమిస్తుంది. ఇది ప్రకృతి నియమం. కీటకం(పురుగు) ఒక తుమ్మెదను నిరంతరం చింతన చేయడం వల్ల అది భ్రమరాకారంలోకి మారిపోతుందని లోక ప్రతీతి. దీన్నే 'భ్రమర కీటన్యాయం' అంటారు. చిత్తం ఒక అద్దం వంటిది. అద్దం తన ముందున్న దాన్ని తనలో ప్రతిబింబింపచేసుకొని, ఆ రూపాన్ని పొందుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు, పరమాత్మనే ధ్యానిస్తూ మనస్సును దానిలోనే ప్రతిష్ఠింప చేయాలని భగవానుడు గీతలో అన్నాడు.
'ఆత్మ సంస్థం మనః కృత్వానకించిదపి చింతయేత్' మనస్సును బాహ్యం నుంచి మరల్చి అంతర్ముఖం చేసి, ఆత్మలో నిలిపి ఇతర విషయాల్ని చింతింపరాదు అని ఆదేశించాడు. ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం రెండూ సిద్ధించాలంటే నిత్య ఆరాధనలోనే ధ్యానం అంతర్లీనంగా ఉంటే మంచిది. ధ్యానం ఒక పనిగా కాక మనం చేసే ప్రతి పనీ ధ్యానంగా చేయగలగడమే మన జీవితానికి సార్థకత.
- ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ
[ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment